2080* రోజు....

                   

 చల్లపల్లి స్వచ్చోద్యమంలో 2080 * వ రోజు

 

            ఈనాటి (శనివారం-5.12.2020) ప్రాభాత స్వచ్చ- సుందరీకరణలో కలిసి కృషి  చేసిన కార్యకర్తలు 29 మంది. వీళ్ల గ్రామ బాధ్యతా దీక్షతో సానుకూల మార్పుకు లోనైనది 1 వార్డులోని బాలికల వసతి గృహ పరిసరాలు. ఈ పారిశుద్ధ్య కృషి సమయం నేటి వేకువ 4.25-6.10 నడుమ! కాస్త పరిమితమైన మంచు, అపరిమితమైన డిసెంబరు మాసపు చలి విశాల హృదయులైన- బాధ్యతా పరులైన ఈ స్వచ్చ కార్యకర్తలకు ఒక లెక్కలోనిది కాదు.

            బైపాస్ మార్గంలోని, 1 వ వార్డులోని  బాలికల వసతి గృహానికి మూడు ప్రక్కల నాలుగేళ్ల క్రిందటి దాక ఇదే వేకువ సమయాలలో ముమ్మరంగా బహిరంగ మల విసర్జన జరగటం గుర్తున్నదా? ఈ ప్రాంతాన్ని స్వహస్తాలతో శుభ్ర పరుస్తున్నప్పుడు స్థానికులైన విసర్జన కారులతో జరిగిన చర్చలను మనం గాని, ఇతర గ్రామస్తులు గాని మరచిపోదగిన సంగతులా? బారులు తీరి కూర్చుంటున్న సదరు స్థానికులను స్వచ్చ కార్యకర్తలు చేతులు మోడ్చి ప్రాధేయ పడటం, కార్యకర్తలకు కొండంత అండగా కొడాలి మురళి, కృష్ణ కుమారి వంటి సహృదయులు నిలబడటం.... మరిచిపోదగిన చరిత్ర కాదు!

            స్వచ్చ సైనికులదేముంది? 2080 రోజుల్నుండి ఈ 30 వేల మంది గ్రామస్తుల స్వచ్చ-శుభ్ర-స్వస్తతల కోసం స్వయంగా అంకితులైపోయి, మూల మూలల్లోని  చెత్త-దుమ్ము-ప్లాస్టిక్ లు, సారా సీసాలు, నిర్విరామంగా తొలగిస్తూనే ఉంటారు; అది తమ ప్రవృత్తిగాఎన్నేళ్లైనా వాళ్లు ముందుకు పోతూనే ఉంటారు. మరి, ఆ కృషి ఫలిత లబ్దిదారులు- స్వగ్రామ సంక్షేమాన్ని తీవ్రంగా పరిగణించక, 7 ఏళ్ల తరువాత గూడ ఇంకా సహకరించని గ్రామ ప్రజల మాటేమిటి?

 

            నేటితో ఈ ఉప మార్గంలో సూరి డాక్టరు గారి వీధి దాక- సుమారొక కిలో మీటరు పర్యంతం శుభ్ర- సుందరీకృతమైనట్లే.

 

ఈ దినం విశేషాలలో-80 ఏళ్ల పైబడిన ఇద్దరు కార్యకర్తల ప్రమేయం. ఒకటి- మాలెంపాటి గోపాల కృష్ణయ్య గారు, వేమూరి అర్జున రావు మాస్టరు గారు.  మొదటి వారు ప్రత్యక్షంగా పాల్గొని, చీపురందుకొంటే, రెండవ వారు (కర్ణాటక లోని ధార్వాడ నుండి) పాల్గొన్నారు. డాక్టరు మాలెంపాటి గారి 2000/- నెల వారీ విరాళం పట్ల మన అందరి కృతజ్ఞత!

 

రేపటి మన స్వచ్చంద శ్రమదాన ఆవశ్యకత బందరు జాతీయ రహదారిలోని ఏ.టి.యంల కేంద్రం.

 

       తమది కాని ప్రయోజనముకై

అనంతకాల ప్రవాహమందున – చల్లపల్లి చరిత్రమందున

తమది కాని ప్రయోజనానికి- గ్రామ భవిత మహోదయానికి

రెండు వేల దినాల తరబడి నిండు మనసుల పూనికలుగల

అందరికి మా ప్రణామంబులు- స్వచ్చ సుందర చందనంబులు!

 

నల్లూరి రామారావు

సభ్యులు- మనకోసం మనం ట్రస్టు

05.12.2020.