2083* వ నాడు....

 చల్లపల్లి స్వచ్చోద్యమంలో 2083* వ నాడు.

27 మంది స్వచ్చతా బాధ్యుల పారిశుధ్య చర్యలతో మరింతగా ముస్తాబైన గ్రామ ప్రముఖ వీధులు 3. గత బుధవారం తరువాయిగా – అదే చోట – ప్రధాన కూడలిలోనే 4.29 కే గుమికూడిన 27 మంది స్వచ్చోద్యమ కారులు 5.42 సమయం దాక నిర్వహించిన విధులతో ఇంచుమించుగా ఆ బుధవారం చేసిన బందరు, అవనిగడ్డ, విజయవాడ దారుల స్వచ్చ – సుందరీకరణమే నేడు కూడ.

          “మరల ఇదేల రామాయణ రచనము...?” అనే ప్రశ్నకు ఒక కవి సామ్రాట్ గారు ఈ జనులంతా రోజూ తినే తిండినే, చేసే సంసారాన్నే మళ్ళీ మళ్ళీ తింటున్నారు, చేస్తున్నారు; నేనూ అందుకే ఇంకోమారు రామాయణం రాస్తున్నానయ్యా.... అని చమత్కరించినట్లుగా చల్లపల్లి స్వచ్చ కార్యకర్తల విధి నిర్వహణ కూడా 2083* రోజులుగా ఒకే రీతిగా, ఒకే దీక్షగా సాగుతూ వస్తున్నది!  స్వయంగా తామే మొన్న చేసిన చోటైనా సరే – ఏ కాస్త అశుభ్రత కనిపించినా, సౌందర్య లోపం చూపట్టినా ఓర్వలేని బలహీనత వారిది! పైగా – వీళ్ల దీక్షతో, పని తనంతో సమానంగా ఈ జాతీయ రహదారుల మీద ఎప్పటికప్పుడు కావలసినంత వ్యర్థాలు చేరుతూనే ఉంటాయి కూడా! మరి, కార్యకర్తల గ్రామస్తుల నిష్పత్తి 1:1000 గా ఉంటే ఇలాగే ఉంటుంది! 

          విసుగు విరామం లేని ఈ స్వచ్చోద్యమ కారులు - ఇటు ఉభయ బంకుల మధ్యస్థ రహదారిని, అటు విజయవాడ దారిలోని కొంత భాగాన్ని క్షుణ్ణంగా ఊడ్చి, ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను ఏరి, వివిధ అంగళ్ల దగ్గరి అన్ని రకాల కశ్మలాలను ఊడ్చి - ఎత్తి ట్రక్కుతో చెత్త కేంద్రానికి తరలించారు.

          అసలు వేలాది దినాలుగా ఈ గ్రామంలో ప్రతి బ్రహ్మ ముహూర్తంలో నిస్వార్థంగా ఈ స్వచ్చోద్యమమే ఒక వింత! ఆ వింతలో నేటి మరొక వింత – ఈ చల్లపల్లి కి చెందిన ఒకానొక కుటుంబం లోని 3 వ తరం వాళ్ళిద్దరు - దాసరి స్నేహ, వల్లభనేని నాగేంద్ర కుమార్ లు - ఎక్కడో దుబాయి లో ఉండేవాళ్లు - ఈ గ్రామ పారిశుద్ధ్య కృషిలో పాల్గొనటం, 5 లక్షల తమ కష్టార్జితాన్ని చల్లపల్లి కి అంకితమై పోయిన “మనకోసం మనం” ట్రస్టుకు సమర్పించడం! వీరిద్దరూ చూపుతున్న ఆదర్శం కాక, పంచుతున్న స్ఫూర్తి కాక, చల్లపల్లి సుందరీకరణ కోసం ఇంత వరకూ ఇచ్చిన ఆర్ధిక సహకారం 16,00,000/- అక్షరాలా పదహారు లక్షలు సుమా!

          నేటి మరొక విశేషం – మన స్వచ్చోద్యమ చల్లపల్లికి వెన్నెముక వంటి ప్రధాన కార్యకర్త – తరిగోపుల పద్మావతి గారి 60 ఏళ్ల మైలు రాయి. ఆమె కృషి, దృక్పధం, పట్టుదల గురించి చల్లపల్లి ప్రజలకు చెప్పనవసరముందా? మొత్తం మీద దాసరి కుటుంబ సభ్యులు దాతృతలో వాళ్ళకు వాళ్ళే పోటీ! డాక్టరమ్మ గారి దగ్గరి బంధువులు - ఉదయిని, పురుషోత్తములు 50 వేల (గతంలో ఇచ్చిన లక్ష రూపాయలు కాక) విరాళం కూడ నేటి విశేషమే! అనగా చుట్టపుచూపుగా వచ్చిన ఈ ఇద్దరు వైద్యుల మొత్తం విరాళం ఒక లక్షా యాభై వేల రూపాయలన్న మాట. వీరందరికీ మన చల్లపల్లి స్వచ్చోద్యమం సదా ఋణపడి ఉంటుంది!

          నవంబరు నెలకు ట్రస్టు జమా ఖర్చులు నేడు తెలుపబడినవి,

          మన రేపటి వీధి శుభ్రతల కోసం కూడా ఈ ప్రధాన కూడలి దగ్గరే కలుసుకొందాం!      

          చాటింపులు వేస్తున్నాం.

ఎవరెవరో రావాలను ఎదురుచూపు వ్యర్ధమనీ

స్వశక్తితో – సాహసిస్తె స్వగ్రామహితం ఉందని

ప్రతి రోజొక గంటపాటు ప్రజాసేవ గొప్పదనీ

అక్షరాల ఆరేళ్లుగా స్వచ్చోద్యమ పయనమనీ...

 

నల్లూరి రామారావు

సభ్యులు- మనకోసం మనం ట్రస్టు

12.12.2020.