2084* వ రోజు....

 సుదీర్ఘ  స్వచ్చోద్యమ చల్లపల్లి లో 2084* వ నాడు.

ఈ ఆదివారం (13.12.2020) నాటి స్వచ్చంద శ్రమదాన సందడిలో భాగస్వాములైన కర్మవీరులు 32 మంది. చల్లపల్లి గ్రామంలో వీరి ఆదర్శ కృషి కి నోచుకొన్న ప్రదేశం- మూడు ప్రధాన దారుల కూడలి నుండి విజయవాడ మార్గంలో ని కస్తూరి మామ్మ రహదారి వనం వరకు.

మన దేశ విదేశ చరిత్రల్ని చదివితే-“ ఫలానా కాలంలో, ఫలానా రాజ్య సైన్యాలు ఇన్ని వందల మందిని చంపి, ఇంత ప్రదేశాన్ని ఆక్రమించాయి....” వంటి వర్ణనలు కనిపిస్తాయి. అలాంటి భాషలో చెప్పాలంటే-“ ఈ ఆదివారం వేకువ 4.27 నుండి 6.16 నడుమ 100 నిముషాల కాలంలో స్వచ్చ సైనికులు ఈ రహదారి మీద గల రకరకాల దుకాణాల, బడ్డీ కొట్ల, దేవాలయాల, క్లబ్బుల, తినుబండరాల కొట్ల ఎదుట చేరిన కాలుష్య కారక సమస్త వ్యర్థాలను తమ ఆయుధాలైన చీపుళ్లు, గోకుడు పారలు, గొర్రులు, దంతెలు, పారలతో సంహరించి, సమీకరించి ఊరి బైట ఉన్న చెత్త కేంద్రానికి తరలించారు!” చరిత్రలోని ఆ యుద్ధాలన్నిటికన్న ఈ స్వచ్చ కార్యకర్తల సమరమే సాత్వికమూ, ఆదర్శమూ, అర్థవంతమూ! మహిళా ప్రేక్షకులకు దుఃఖ  భాజనమైన ఎన్నో ధారావాహికలు తెలుగు బుల్లితెర మీద రెండు-మూడు వేల దినాల తరబడీ వస్తుంటాయి. వాటన్నిటికన్న మేలైన-ఆదర్శమైన- ఆచరణీయమైన - ప్రయోజనాత్మకమైనది ఈ 2084* దినాల స్వచ్చోద్యమ ధారావాహిక!

ఈ క్రొత్తరకం ధారావాహిక సూత్రధారులు ఇద్దరు వైద్యదంపతులైతే - స్వచ్చ సైనిక పాత్రధారులు అతి సాధారణ వ్యక్తులు.  గ్రామ సమాజ కళ్యాణమే ఈ వినూత్న ధారావాహిక పరమార్థం. ఈ ఆదివారపు స్వచ్చోద్యమ వేడుకను గంటన్నర పాటు పరిశీలించాను: ఎవరి పని దీక్ష వారిదే! గ్రామ స్వస్తతా ధ్యేయంలో ఎవరి ప్రయత్నం వాళ్లదే! స్వలాభం కోసం కాక, పరహితం కోసం లక్షల కొద్దీ పని గంటలు శ్రమిస్తున్న వీరు కాక ధన్యులెవరు? గ్రామస్తుల సౌకర్యంలోనూ, స్వస్తతా భవితవ్యంలోనూ తమ సంతృప్తిని వెదుకుకొంటున్న ఈ కార్యకర్తల కన్న ఆదర్శులెవరు?

6.20 వేళలో,  కాఫీ-టీ ల సమయంలో తమ ఇటీవలి గ్రామ వీధుల స్వచ్చతా ప్రయత్న సాఫల్యాన్ని సమీక్షించుకొని, సదరు ప్రయత్నం కోసం మరొకమారు ఇదే 3 బాటల కూడలిలోనే 16.12.20(బుధవారం) నాటి వేకువ 4.30 కు కలుసుకొందాం!

  యుద్ధ భారతం వర్సెస్ స్వచ్చ భారతం

పద్దెనిమిది పర్వాల్లో- పద్దెనిమిది రోజుల్లో

యుద్ధ పంచకం కన్నా- శాంతి పర్వమే మిన్న

రెండు పదుల వందలదిన స్వచ్చోద్యమ చల్లపల్లి

స్వార్థ రహిత- త్యాగ మహిత మానవతా పాలవెల్లి!   

నల్లూరి రామారావు

సభ్యులు- మనకోసం మనం ట్రస్టు

13.12.2020.