2089* వ రోజు ....

 స్వచ్చ- సంస్కృత  చల్లపల్లిలో 2089* వ నాటి బాధ్యతలు.

ఈ శనివారం (26.12.2020) వేకువ 4.27 కే మంచులో-చలిలో ప్రారంభమైన స్వచ్చ సైనికుల స్వయం విధిత గ్రామ బాధ్యతలు 6.05 దాక కొనసాగినవి. వీరి కర్మ క్షేత్రం డంపింగ్ కేంద్రానికి దక్షిణ భాగం. ఈ స్వచ్చంద కార్మిక బలగం వాట్సాప్ చిత్రంలో చూపినట్లు తొలుత 16 మందే కాని, అనతి కాలంలో నే అది రెట్టింపయింది!. ఈ శ్మశాన- చెత్త కేంద్రం గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలో ఉండగా, ఈ కార్యకర్తల్లో 4 కి.మీ. దూరం చీకట్లో ప్రయాణించి వచ్చిన వారు కూడ ఉన్నారు. డంపింగ్ నుండి వచ్చే వాసనలకూ, పొగలకూ, రుద్ర భూమిలో ఆరని చితాగ్నికీ  వెరవని – గ్రామం స్వచ్చ-శుభ్ర-స్వస్తతల కోసం తమ పట్టు వదలని ఈ ఆదర్శ శ్రమదాతలకు నా వినమ్ర కృతజ్ఞతాంజలి!

          నేటి 50 పని గంటల ప్రణాళికా బద్ధమైన కృషితో మరింత మెరుగైన చోటులు 3.

- చిల్లల వాగు దక్షిణపు గట్టు మీద 10 మంది కత్తి వీరుల-దంతె ధారుల దీక్షతో ముళ్ల, పిచ్చి మొక్కలు, తీగలు, ప్లాస్టిక్ సంచులు వంటివి తొలగిపోయి తెల్లవారే సరికి ఆ దారి ప్రయాణయోగ్యమై పోయింది. డంపింగ్ కేంద్రానికి వెళ్ళిన చెత్త ట్రాక్టర్లు ఇప్పుడు సౌకర్యంగా ఈ గట్టు మీదుగా తిరిగి రాగలవు.

- పూర్వం ప్రధాన చెత్త కేంద్రంగా ఉండి, తూర్పు దిశగా నెట్టబడిన ప్రస్తుత ఖాళీ జాగాలో కొందరు స్వచ్చ- సుందరీకర్తలు  ప్రతి చిన్న వ్యర్ధాన్ని ఏరి-ఊడ్చి-పిచ్చి మొక్కల్ని తొలగించి క్షుణ్ణంగా శుభ్ర పరిచారు. ఇక్కడ ముందుగా వెలుగు వెల్లువలు(ఫ్లడ్ లైట్లు) బిగించబట్టి గాని, లేకుంటే అక్కడ అంతా కటికచీకటే!

- చెత్త సంపద కేంద్రానికి దక్షిణంగా ఏడెనిమిది మంది కార్యకర్తల కృషి కొనసాగి, అక్కడి చెట్లు, పూల మొక్కల పాదులు మెరుగులు దిద్దుకొన్నవి.

6.10 కు కొందరు అయిష్టంగానే తమ పని ముగించి, అందరూ కాఫీలు సేవించి, తమ స్వచ్చంద శ్రమదాన భూత – వర్తమాన – భవిష్యత్తులను చర్చించుకొని, డాక్టరు గారి సమీక్షా వచనాలనూ విని, మరొకమారు తమ గత ఐదారు దినాల ప్రయత్న ఫలితాలను చూచుకొని, పూర్తి సంతృప్తి తో గృహోన్ముఖులయ్యారు. ఐదారుగురు మాత్రం రేపటి స్వచ్చ కృషి ప్రణాళికలు రచిస్తూ మరికొంత సమయం అక్కడే ఉన్నారు.

దేసు మాధురి సాధికారికంగా ముమ్మారు ప్రకటించిన చల్లపల్లి స్వచ్చ-శుభ్ర-సౌందర్య సంకల్ప నినాదాలతో అందరూ ఏకీభవించారు.

మన రేపటి గ్రామ సామాజిక బాధ్యతల కోసం వేకువ 4.30 సమయంలో చెత్త సంపద కర్మాగారం దగ్గరే కలుసుకొందాం.  

          అంగడి సరుకే కాదిది.

ఉద్యమాలు నింగి నుండి ఊడి పడవు మిత్రులార!

అంగట్లో దొరుకు సరకులవి కావుగ పెద్దలార!

మేథో మధనాలు జరిగి- పురిటి బాధలధిగమించి

సాగు మహోద్యమమేగద స్వచ్చోద్యమ చల్లపల్లి!

నల్లూరి రామారావు,

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త

26.12.2020.