2090* వ రోజు ....

 స్వచ్చ- స్వస్త-  చల్లపల్లిలో 2090* వ నాటి బాధ్యతలు.

మరీ చల్లగా మారిన ఈ ఆదివారపు (27.12.2020)బ్రహ్మ ముహూర్తంలో – నిన్నటి నిర్దేశిత ప్రాంతమైన చెత్త సంపద కర్మాగార సమీపంలో 4.27 కే చేరుకొన్న 37 మంది స్వగ్రామ స్వచ్చోద్యమ కారులు అలుపెరుగక చేపట్టిన కర్తవ్య నిర్వహణ 6.10 దాక కొనసాగింది. దట్టమైన మంచైతే ఏమిటి- మంచు ఎగదోస్తున్న చలిగాలైతే ఏమిటి- చిమ్మ చీకటైతే ఏమిటి... 2090* రోజులుగా రాటుదేలిన ఈ కర్తవ్య పరాయణులకు  తామున్నది శ్మశాన-చెత్త కేంద్రంలో అనే వెరపు లేనే లేదు- తమకు తామే తలకెత్తుకున్న గ్రామం మెరుగుదల ప్రయత్నంలో వీళ్లకేదీ ఆటంకం కాదు!

          నేటి స్వచ్చ-శుభ్ర-సుందరీకృత ప్రాంతాలు నిన్నటి చోటులకు మరికొంత పొడగింపులే. చెత్త కేంద్రం ఉత్తరాన చిల్లలవాగు దక్షిణపు గట్టు మీద చిట్టడవిని పది మంది కార్యకర్తలు ట్రాక్టర్ల నడకల కనుకూలంగా మార్చగలిగారు. నలుగురు చీపుళ్ల వారు పాత డంపింగ్ కేంద్రాన్ని (ప్రస్తుతం ఖాళీ ప్రదేశం) గంటన్నర పాటు ఊడ్చి, వ్యర్ధాల గుట్టల్ని చెత్త కేంద్రంలో కి పంపారు. ఐదారుగురు చీపుళ్ల, దంతెల వాళ్లు నిడువైన సిమెంటు దారి కిరుప్రక్కల ప్లాస్టిక్ లను, చెత్తలను చెత్త కేంద్రం వైపు కు నెట్టారు -పొగల, ఘాటైన దుర్గంధ వీచికల నడుమ!

ఏడెనిమిది మంది మహిళలు, సిమెంటు దారుల తూర్పు – దక్షిణ దిశల నడిమి ఖాళీ జాగాను జల్లెడ పట్టి, ఆ కశ్మల భారాన్ని కొంత తగ్గించగలిగారు. మొక్కల పాదుల్ని సవరించేవారు తమ పనిలో లీనమై పోయారు.

సుందరీకరణ బృందానికెందుకో గాని నిన్న ఊడ్చిన ప్రధాన బాట నచ్చక ఈ రోజు మరొక మారు మరింత క్షుణ్ణంగా ఊడ్చి దారి ప్రక్క గుంటల్ని చక్కదిద్ది గాని విశ్రమించలేదు.

ఆనంద రావు అనే ట్రస్టు ఉద్యోగి అందరికీ త్రాగు నీరు సరఫరా చేస్తూనే ఉన్నాడు.

శాన్ ఫ్రాన్సిస్కో నుండి వచ్చిన మాలెంపాటి అనిత, ఆమె తండ్రి డాక్టర్ గోపాల కృష్ణయ్య గార్ల శ్రమదానం నేటి మరొక విశేషం. వీరి కుటుంబం స్వచ్చ- హరిత చల్లపల్లి కోసం గతంలో నీళ్ల టాంకర్లను ప్రదానం చేసింది.

కర్నాటక దేశం నుండి మన స్వచ్చ-బాల వృద్ధుడు వేమూరి అర్జున రావు మహోదయుడు కూడ దూరవాణి ద్వారా నేటి సమీక్షా సమావేశం లో పాల్గొన్నారు.

DRK ప్రసాదు గారి నేటి స్వచ్చంద శ్రమదాన సమీక్షా సమయంలో గ్రామ స్వచ్చ-సుందర సంకల్ప నినాదాలను డంపింగ్ కేంద్రం మారు మ్రోగించింది ఆకుల దుర్గా ప్రసాద్ గారు!

ఈ నెల- సంవత్సరానికి చివరి సారి – 30 వ తేదీన-బుధవారం నాటి వేకువ మనం స్వచ్చ శ్రమదానం చేయదగిన చోటు స్టేట్ బ్యాంకు- జూనియర్ కళాశాలల ప్రాంతం!

        వాళ్లీ ఊళ్లో మాత్రమె

శక్తి మయులు, ధనవంతులు, సాహసులూ, యశస్వులూ

ఏ ఊళ్లో నైన కలరు ఇంతకన్న మిన్నగా!

ఆ సకల గుణాలు ఊరి అభ్యుదయానికె వ్యయించు

స్వచ్చ సైనికులు మాత్రం చల్లపల్లి లోననే!

నల్లూరి రామారావు,

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త

27.12.2020.