స్వచ్చ – సుందర చల్లపల్లి ప్రయత్నంలో ... 2092* వ నాటి పురోగతి.
ఈ (గురువారం – 31.12.2020) నాటి గ్రామ పరిశుభ్ర – సుందరీకరణ కృషిలో చేతులు కలిపిన బాధ్యులైన కార్యకర్తలు 34 మంది. ఊరి పారిశుద్ధ్యానికి అంకితులైన వీరి దీక్షతో మెరుగుపడి, శోభస్కరమైన ప్రదేశం – అరకిలోమీటరు నిడివి గల బందరు జాతీయ రహదారి. బ్రహ్మ శుభ ముహూర్తాన – వేకువ 4.16 సమయంలోనే మొదలైన ఈ ఆదర్శ కృషి 6.10 దాక జరుగుతూనే ఉన్నది – అప్పుడు చలిగాలైనా, మంచైనా సరే! ఈ స్వచ్చంద శ్రమదాతలకు సహానుభూతిపరులుగా వచ్చి నేడు తోడ్పడిన వారు – రక్షకభట, పంచాయితీ శాఖలవారు! అందుకే ఈ చల్లపల్లిలో నడుస్తున్న ప్రయత్నం వైయక్తికం కాక - ‘స్వచ్చోద్యమం’ అని పేర్కొనేది! గ్రామ సంబంధీకులు, దాతలు, వివిధ శాఖల అధికారులు, ఇతర సహృదయులు కలిసి వస్తేనే గదా మన ఈ పల్లి ‘స్వచ్చ సుందర చల్లపల్లి’ గా మారుతున్నది! కనువిందు చేస్తున్న ఈ వేలాది పచ్చని చెట్ల ప్రాణవాయువులు, ఆహ్లాదమయమైన లక్షలాది పూల సోయగాలు, ఈ పాటి పారిశుద్ధ్య నిర్వహణలు ఉన్న ఏ ఊరైనా కరోనా తదితర అంటు జబ్బుల్ని ఎదిరించగలదు.
స్వచ్చ సైనికుల నేటి కృషి ఫలితాలిలా ఉన్నవి:
- 6 వ నంబరు పంట కాలువ సమీపాన నిన్న బాగుచేసిన చోటును ట్రాక్టరు గొర్రుతో దున్ని, సమం చేసి, రాతి ముక్కలు, ప్లాస్టిక్ తుక్కులు ఏరి ఏడెనిమిది మంది దాన్ని సాగుకనువుగా మార్చారు. ఆ ఖాళీ జాగాలో మొక్కలు నాటారు.
- ‘స్వచ్చ - సుందర - చల్లపల్లి కి స్వాగత/ ధన్యవాదాల ఫలకం ఒరిగిపోతే - వంతెన దగ్గర దాన్ని మళ్ళీ ప్రతిష్టించి, S.I గారి చేతుల మీదుగా కాంక్రీటుతో పటిష్టం చేశారు.
- కార్యకర్తల్లో అధికులు చీపుళ్లతో బందరు రహదారిని, మునసబు వీధి ముఖ ద్వారాన్ని దంత వైద్యశాల పరిసరాలను తాతినేని రమణ నర్సరీ దాక గంటన్నర పాటు ఊడుస్తూనే ఉన్నారు.
చలిలో - చీకటిలో - వాళ్ళ వదనాల్లోఉత్సాహాన్ని, సంతృప్తిని మన శాస్త్రి గారి వాట్సాప్ ఛాయా చిత్రాల్లోను, దృశ్య - శ్రవణా (వీడియో) లలోను గమనించండి.
ఒక ప్రక్క 6.20 కి కాఫీ ఆస్వాదనలు - అదే సమయంలో కార్యకర్తలు కొందరు ట్రాక్టర్ లోకి చెత్త చేరి వేతలు - ఏక కాలంలో జరిగాయి.
డాక్టర్ గారి నేటి పారిశుధ్య కృషి సమీక్షా సమయంలో ఉడత్తు రామారావు గారి చాక్లెట్లు, అంతకముందు మరొకరి నిమ్మకాయలు కార్యకర్తలు స్వీకరించారు. లయన్స్ క్లబ్ ప్రతినిధి వరప్రసాదు గారు ముమ్మారు గ్రామ స్వచ్చ - శుభ్ర-సుందరీకరణ సంకల్ప నినాదాలు ప్రకటించారు.
రేపటి - మన క్రొత్త సంవత్సర సామాజిక బాధ్యతలకై శిర్విశెట్టి దంత వైద్యశాల దగ్గర 4.30 కే కలుసుకొందాం.
ఉదాహరణ! ఒక ప్రేరణ!
స్వచ్చోద్యమ చల్లపల్లి సాధించిన గెలుపు లెల్ల
ఒక్కరికో – ఇద్దరికో దక్కబోవు – చెందబోవు
ఇది సమిష్టి మహాకృషికి ఎంతొ మంచి ఉదాహరణ
వందలాది గ్రామాలకు ప్రగతి శీలమగు ప్రేరణ!
నల్లూరి రామారావు,
స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త
31.12.2020.