2093* వ రోజు....

 నూతన సంవత్సర (2021) స్వచ్చోద్యమ చల్లపల్లి లో – తొలినాటి (2093*) విశేషాలు

ఈ 01.01.2021 వ నాటి తొలి ఉషోదయానికి ముందే – 4.17 సమయానికి బందరు మార్గంలోని భగత్ సింగ్ దంత వైద్యశాల వద్దకు చేరుకొన్న గ్రామ సామాజిక స్వచ్చ కార్యకర్తలు యధావిధిగా రహదారి పారిశుధ్య – సౌందర్య  - స్వస్తతల కోసం 6.10 దాక శ్రమించారు. మరి కొద్ది సేపటికే వచ్చి కలిసిన ఔత్సాహికులతో వారి సంఖ్య 45 కు చేరింది. ఈ అందరి ధ్యేయం ఊరి ప్రధాన దారుల లోప రహిత స్వచ్చ – శుభ్ర – సౌందర్యాలు, అందుమూలంగా కలిగే ఆహ్లాదంతో 30 వేల మంది సోదర గ్రామస్తుల అవగాహనా భరిత సుఖ సంతోషాలే! ఆ ఉదాత్త లక్ష్య సాధన కోసం వట్టి ఆశలు, నిరీక్షణలు కాక ఆరేడేళ్లుగా - 2093* రోజులుగా పట్టు సడలని గట్టి కార్యాచరణలు! ఈ స్వచ్చ సైనికులు ఇంత గట్టి పిండాలు కాబట్టే – ఇంత సుదీర్ఘకాలంగా ప్రసార – ప్రచార మాధ్యమాల గుర్తింపులకూ , ఎవరి దూషణభూషణ తిరస్కార పురస్కారాలకీ అతీతంగా – ఒకానొక అత్యుత్తమ తాత్త్వికతతో స్వచ్చ రధాన్ని చల్లపల్లి లో నడపగల్గుతున్నారు.

లోకంలో చాలా మంది మందుల చిందులతోను, అట్టహాస వేడుకలతోను క్రొత్త సంవత్సరాన్ని స్వాగతించడం చూస్తున్నాము.  చల్లపల్లి స్వచ్చ సైనికులు మాత్రం మరింత గట్టి పూనికతో- సాహసోపేత ప్రణాళికతో తమ గ్రామాన్ని మరింతగా మెరుగు పరచే ఆశయంతో పునరంకితులై ఈ సంవత్సరాదిని స్వాగతించడం కూడ చూస్తున్నాం.  అదీ కాక ఎవరి శక్తి మేరకు వాళ్లు, ఎవరికితోచినంతగా వాళ్లు అర్థ- శ్రమదానలతో ఉన్న ఊరికి ఇలా అంకితులైపోవడం హర్షణీయ పరిణామం కాదా?

40 మందికి పై బడిన ఈ కార్యకర్తలు రోజుటి వలెనే ఈనాడు తామెంచుకొన్న బందరు రహదారిలో మునసబు వీధి నుండి పెద్ద మసీదు దాక సకల పరిచర్యలూ చేశారు. ఇది చాలక కొందరు సజ్జావారి వీధి పారిశుద్ధ్యాన్ని బాగా మెరుగుపరిచారు. ఐదారుగురు కార్యకర్తలు భారత లక్ష్మి ధాన్యం మర వీధిలో తమ  అవసరాన్ని గుర్తించి, అక్కడి గడ్డిని, పిచ్చి-ముళ్ల మొక్కల్ని, దుమ్ము, ధూళినీ, వ్యర్ధాలనూ ఊడ్చి, ఏరి గుట్టలు చేశారు.

సుందరీకరణ బృందమైతే- ఈ ప్రదేశంలో ఏ చిన్న అస్తవ్యస్తతనూ, లోపాన్ని సహించక మూలమూలలు వెదకి, ఊడ్చి, చెక్కి శ్రమించారు. వీరిలో వర్ధమాన చిన్నారి కార్యకర్తల హుషారును చూచి తీరాలి! 6.15 తరువాత కూడ ఈ బృందం బాధ్యతా విరమణ చేయడానికి ఇష్టపడలేదు.

ఈనాటి కృషి సమీక్షా నినాద సన్నివేశం కాస్త భిన్నంగా జరిగింది.  గత కరోనా సంవత్సరంలో కూడ తమ గ్రామ కర్తవ్య దీక్షను గుర్తు చేసుకొని, కొందరు కార్యకర్తలు ఆనంద నృత్యాలు చేస్తే- చాక్లెట్లను, కేకులనూ కొందరు పంచుతుంటే- స్వచ్చోద్యమ వ్యయాల నిమిత్తం కొందరు “ మనకోసం మనం” మేనేజింగ్ ట్రస్టీకి విరాళాలు సమర్పిస్తే, సజ్జావారి వీధి నివాసిని, తోట పద్మావతి గారు హృదయపూర్వకంగా ముమ్మారు గ్రామ స్వచ్చతా దీక్షా సంకల్ప నినాదాలను ప్రకటించగా - స్వచ్చోద్యమ ప్రధాన గాయకుడు కార్యకర్తల్లో మరింత ఉత్సాహం రగిలించగా - డాక్టర్ డి. ఆర్.కే. గారు కొన్ని మెలకువలు సూచిస్తూ సమీక్షిస్తే- ఈ సమావేశం అరగంట దాక సాగింది.

సజ్జావారి వీధి వాళ్ల  1000/-, చల్లపల్లి స్వచ్చోద్యమ పాత కాపు-శంకర శాస్త్రి గారి నెలవారీ 5000/-, ఘంటా లీలాకృష్ణ గారి 505/- నగదు/ చెక్కుల సమర్పణకు మన ధన్యవాదాలు!

రేపటి నుండి ప్రతి వేకువ 4.30 కు మన కలయిక ప్రదేశం- చిల్లలవాగు గట్టు మీద శ్మశాన-చెత్త సంపద- డంపింగ్ కేంద్రమే!. అక్కడి అపరిశుభ్రత మీద సంకుల సమరమే!.    

         వీళ్ళె రోడ్ల డాక్టర్లె..

స్వచ్చోద్యమ చల్లపల్లి కధా వికాస మెట్టిదనిన-

సామాజిక ఋణం తీర్చు సద్భావనతో కొందరు

రోడ్లు విశాలం చేస్తూ గుంటలెన్నో పూడుస్తూ

ప్రమాదాల నివారణకు ప్రయత్నాలొనర్చడం!

నల్లూరి రామారావు,

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త

01.01.2021.