2097* వ రోజు....

 స్వచ్చ – సుందర చల్లపల్లి రూపకల్పనలో 2097* వ నాడు.

 

వేకువ 4.20 నుండి 6.10 వరకు 21 మంది కార్యకర్తల శ్రమదాన ఫలితంగా బాగా మెరుగుపడిన బాగం ఇంచుమించు నిన్నటిదే! – విజయవాడ దారిలోని చిల్లలవాగు వంతెన – వాహన కాటాల పరిసరాలే! ఇదే బెజవాడ బాటలో డ్రైను వెల్లవేతతో వేరొక చోట వచ్చిన మట్టిని ట్రక్కులోనికెత్తి, చిల్లలవాగు వంతెన సమీపంలో సర్దడం అభినందనీయం.

 

గ్రామ స్వచ్చ – శుభ్రతలతో బాటు సుందరీకరణం, వాటన్నితో బాటు ప్రయాణికుల, వాహనాల భద్రతల కోసం గ్రామ సంరక్షక దళం చూపుతున్న దూరదృష్టి, ప్రణాళిక, మెచ్చదగినవి.

 

- ఎందుకో గాని ఈ నాడు సుందరీకరణ బృందంలో ఒకే ఒక్క కార్యకర్త కృషి చేశాడు. ఐతే – అతడు సాధించినది మాత్రం నలుగురు పెట్టు!

 

- కాటాల ఎడమ ప్రక్క, రహదారి పడమర వైపున లోతైన డ్రైనులో ఐదారుగురి కృషి సైతం తక్కువదేమీ కాదు. కత్తులతో ఇద్దరు పిచ్చి – ముళ్ళ – నిరర్ధక కంపను నరకడం, మరొకరు దంతెతో దాన్ని రోడ్డు మీదకు లాగడం, ఆ వెంటనే మరొకామె చీపురుతో ఊడ్చి శుభ్రపరచడం – ఇదంతా దైనందిన చర్యే గాని, ఎంతకాలమైనా ఇష్టపడి ఆనందంగా వాళ్ళు చేస్తున్న తీరే కొంత ఆశ్చర్యకరం!

 

ఈ దినం మన ప్రస్తావనార్హమైన మరొక విశేషం ముచ్చటించాలి. అది బందరు రహదారి నుండి పద్మావతి ఆసుపత్రి వరకు గల 300 గజాల రహదారి ఉద్యానం. ఏడేళ్ళ నాడు భూలోక నరకమార్గం. స్థానికుల సంకల్పంతోను, కార్యకర్తల అత్యధిక వ్యయప్రయాసలతోను, సుందరీకర్తల సౌందర్య పిపాసతోనూ, భూగర్భంలో మురుగు, పైన హరితతోరణాలు, నడుమ రకరకాల - రంగు రంగుల పుష్ప సంభరిత ఉద్యానం! ఈ దారి మీద పదే పదే విహరించాలని, ఫొటోలు తీసుకోవాలని, ఎంతసేపైనా కళ్ళార్పకుండ చూస్తూ ఉండాలని, పని కల్పించుకుని అక్కడ తిరుగాడాలని ఎవరి కుండదు? (కానీ, ఈ దారి మీద పూర్వం నడిచేవాళ్ళంతా కళ్ళు మూసుకొనో – ముక్కులకు చేతులు అడ్డం పెట్టుకొనో ఎగుడు దిగుడు పల్లాలలో పడిపోకుండా జాగ్రత్త పడుతూనో నడిచిన రోజులు మరువకూడదు.) ఐతే సౌందర్యారాధ కులైన సందర్శకులకు చిన్న హెచ్చరిక – (ఇది పుష్పచోరులకు వర్తించేది) – చాలా కాలం క్రిందటే జంధ్యాల పాపయ్య శాస్త్రి తన పుష్ప విలాపంలో రాసి, ఘంటశాల పాడిన పద్యం :

 

“అందమును హత్య చేసెడి హంతకుండ

మైలపడిపోయెనోయి నీ మనుజ జన్మ!”

 

స్వచ్చంద శ్రమదాతలు రేపటి కర్తవ్య నిర్వహణ కోసం కలుసుకోవలసిన చోటు విజయవాడ దారిలోని కాటాల కేంద్రమే!

 

          ఋణ విముక్తి సాధనలో...

స్వచ్చ మాన్య చల్లపల్లి విజయ రహస్యం బేదట?

సామాజిక ఋణ విముక్తి సాధన సద్భావనతో

బాలబాలికల మనసుల – గ్రామస్తుల హృదయాల్లో

ఆనందాదివారాలతొ అధిక స్ఫూర్తి రగల్చడం!

 

నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

07.01.2021.