2100* వ రోజు ....

 2100* వ నాటి “స్వచ్చ సుందర చల్లపల్లి” ఉత్సాహాలు.

రెండు వేల వందవ రోజు మరొక మైలురాయిని చేరుకొన్న ఈ (10.01.2021) ఆదివారం వేకువ 4.26 కు మొదలెట్టిన 33 మంది స్వచ్చ కార్యకర్తల కర్తవ్య నిర్వహణ 6.25 కు గాని ఆగలేదు.

తమ ఉన్న ఊరి స్వస్తతకు, మెరుగుదలకు నిబద్ధులైన ఈ శ్రమదాతలు నాలుగు బృందాలుగా విడిపోయి, బెజవాడ మార్గంలోనే- చిల్లలవాగు వంతెన నుండి నిన్న – మొన్నటి సుందరీకృత ప్రదేశాల సమీపంలోనే- దీక్షగా, నిష్ఠగా కృషి చేశారు.

- రెండు బృందాలు అచ్చంగా తూర్పు వైపు డ్రైనులోనే వేర్వేరు చోటులలో తమ తమ ప్రణాళికలను అమలుచేశారు. ఆకులలమలు, గడ్డి, ప్లాస్టిక్ సంచులు, ఏరి, పీకి తొలగించి పోగులు చేయడం, మట్టిని సర్ది, డ్రైను ను కూడ సమతలంగా మార్చడం, గట్టుల మీది చెట్లు,  వికృత కొమ్మల్ని తొలగించడం, మొక్కల పాదుల్నిసరిదిద్దడం వంటివన్నీ యథావిధిగా – క్రమ పద్ధతిలో జరిగిపోయినవి. పని వేళ మధ్య-మధ్య చతురోక్తులు, కబుర్ల సరదాలు షరా మామూలే!

- ఇద్దరు చీపుళ్ల మహిళలు చీకటిలో వాహనాల రాకపోకల్ని కాచుకొంటూ, బాటనంతా తుడిచి, శుభ్రం చేస్తూనే ఉన్నారు.

- ఇంత చీకట్లో, అంత లోతైన డ్రైనులోకి పురుషులతో బాటు నలుగురు మహిళా కార్యకర్తలు దిగడమొక వింత! రెండు గంటల పాటు చెమటలు చిందించి, శ్మశాన, డంపింగ్ కేంద్ర ముఖద్వారం దగ్గర అశుభ్రాలను తొలగించి, చదును చేసి, అద్దంలా తీర్చిదిద్దడం మరొక పెద్ద వింత!

“స్పర్దతా వర్థతే విద్యా” అన్నారు మన పెద్దలు. ఇప్పుడు దాన్ని కాస్త మార్చి, మనం

“స్పర్దతా వర్దతే గ్రామ పరిశుభ్రతా” అని కూడ చెప్పుకోవాలి!

- కత్తుల, దంతెల మరొక ముఠా ఎంతో శ్రద్ధగా దారికిరు వంకల చెట్ల, పూల మొక్కల సుందరీకరణాన్ని చూసుకొన్నది.

- 6 వ నంబరు పంట కాలువ దగ్గరి డ్రైను మట్టిని నేడు కూడ ఐదుగురు “రెస్క్యూ టీమ్” వారు ట్రాక్టరులో నింపి, తెచ్చి, అవసరమైన చోట్ల దింపి, సర్ది, తమ బాధ్యతను నెరవేర్చారు.

“ఇంతింతై వటుడింతయై ....” అని బమ్మెర పోతన వర్ణించినట్లే ఉన్నది చల్లపల్లి స్వచ్చోద్యమ ప్రగతి! తొలుత ఒక ఏడాది అనుకొన్న గ్రామ పారిశుద్ధ్య కృషి ఏడేళ్లై-2100* దినాలైనా కార్యకర్తల దీక్ష సడలక- పట్టు వదలక – వాళ్ల సృజనాత్మక గ్రామసేవలు మరింతగా విస్తరించడం మన కళ్ల ఎదుటి సమకాలిక వాస్తవం!

6.30 కు కాఫీల కాలక్షేపం పిదప RTC ఉద్యోగి తోట నాగేశ్వర రావు గారు ముమ్మారు నినదించిన గ్రామ స్వచ్చ-శుభ్ర-సౌందర్య సంకల్పంతో నేటి బాధ్యతా నిర్వహణ వేడుకకు స్వస్తి!

రాబోవు నాలుగైదు రోజులకు గూడ స్వచ్చోద్యమ కారులకు చేతి నిండా సరిపడా ఇదే శ్మశాన, డంపింగ్  కేంద్రమే కార్యవేదిక కానున్నది!

                ఏడేళ్ళ నిబద్ధత

నేను-నాకు-నాదనుకొని  నీలోనికె ముడుచుకొనకు

మనకోసం మన మనుకొని మానవతను చాటిచెప్పు

ఉమ్మడి సంక్షేమంలోనే ఉండు వ్యక్తి భద్రత

అద్దానికె ఏడేళ్లుగ స్వచ్చ సైన్య నిబద్ధత!

నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

10.01.20 21.