2101* వ రోజు ....

 స్వచ్చ సుందర చల్లపల్లి నిర్మాణంలో 2101* వ నాడు.

 

ఈ సోమవారం – (11.01.2021) – అక్షరాల 2101* వ నాడు వేకువనే 4.28 - 6.28 కాలముల మధ్య రెండు గంటల పాటు తమ ఊరి కోసం క్రమించి; శ్రమించిన బాధ్యులు 29 మంది. పదే పదే స్వచ్చ – శుభ్ర – సుందరీకృత ప్రదేశం విజయవాడ రహదారిలోని చిల్లలవాగు వంతెన – ఆటోనగర్ నడిమి ప్రాంతమే! మరి 2  రోజుల్లో మన స్వచ్చ – సుందర శ్మశాన వాటిక దగ్గరి మూత్రశాలల – శౌచశాలల ప్రారంభోత్సవానికి ప్రజాప్రతినిధుల రాక సందర్భంగానో – సంక్రాంతి భోగి వేడుకల నిర్వహణమో బహుశా ఇందుకు కారణం కావచ్చు! ఏదైతేనేం గాని, ఆరేళ్ళ క్రిందట ముక్కులు మూసుకుని, అడుగు తీసి అడుగేసేందుకే భయపడుతూ – తమ సన్నిహితులకు తుది సంస్కారాన్ని ఒక తప్పని సరి తద్దినంగా నిర్వహించిన చోట – ఇప్పుడు చీకట్లో, చలిలో ఇందరు కార్యకర్తలు తమ చిర కష్టార్జిత శ్మశాన అద్భుతాన్ని చూసుకొంటూ ఇలా నిస్వార్ధంగా శ్రమించడం కాల వైచిత్రి అందామా, భావితరాలకు చెక్కు చెదరని ఒక సామాజిక ఆదర్శం అందామా?

 

          కార్యకర్తలు 4.28 కి వస్తే – అంతకన్న ముందుగానే మేమున్నామని, మంచు – చలి గాలి వాళ్లను స్వాగతించాయి! చేతులకు తొడుగులు (గ్లోవ్స్), హస్త భూషణాలుగా కత్తులు, చీపుళ్ళు, పారలు, దంతెలు చేతబూని స్వచ్చ సైనికులు అక్కడి అస్తవ్యస్తతల మీద – డ్రైను కాలుష్యాల మీద, పిచ్చి – ముళ్ళ కంపల మీద, రోడ్ల గుంటల మీద , దారి మార్జిన్ల దుమ్ము మీద రెండు గంటల పాటు దాడి చేశారు. దాంతో :

 

- చిల్లల వాగు దక్షిణం గట్టు, దానిలోతట్టు, తరిగోపుల ప్రాంగణం పడమటి డ్రైను దాపులు, పూల మొక్కలు, చెట్లు నాటడానికనువుగా, చదునుగా మారాయి.

 

- వాగు వంతెన దక్షిణాన రోడ్డు గుంటలు పూడి, వాహనదారుల భద్రతకు హామీ ఇస్తున్నాయి.

 

- అక్కడికి దూరంగా – దక్షిణాన, ఆటోనగర్ ప్రవేశం దగ్గర డ్రైనులోని వివిధ కాలుష్యాల పైన నలుగురు కార్యకర్తల పోరు సఫలమయింది.

 

- పంచాయితీ వారు నెల రోజుల క్రిందటే తోడిన డ్రైను ఎండిన బురదను రెస్క్యూ టీమ్ వారు ఇంకొక ట్రక్కులో నింపుకొని, రోడ్డు వారల అవసరాన్ని బట్టి సర్దుతూనే ఉన్నారు.  

 

          6.45 కు – కాఫీ రుచిని ఆస్వాదించే వేళ – తూములూరి లక్ష్మణరావు ముమ్మారు గ్రామ స్వచ్చ – శుభ్ర – సౌందర్య సంకల్ప నినాదాలు ప్రకటించే సమయాన – డిసెంబర్ మాసపు ట్రస్టు జమా ఖర్చుల వివరాలు ప్రకటించి, డాక్టరు DRK గారు 2100* రోజుల కార్యకర్తల కర్తవ్య నిర్వహణను చాల మంది ప్రవాసులు ప్రస్తుతించడాన్ని ప్రస్తావించారు.

 

          రేపటి మన కర్తవ్యాల కోసం తరిగోపుల ప్రాంగణం వద్దనే – 4.30 కు మన కలయిక.

 

        పంచుకొనుచు – పెంచుకొనుట

అన్ని నాకె” అనుకొనడం – అది బాల్య విచేష్టత

సామాజిక కర్తవ్యమె సర్వాత్మనా శ్రేష్టత

పంచుకొనుచు పెంచుకొనుటె ప్రతి యొక్కరి బాధ్యత

స్వచ్చ సైన్య ప్రస్థానమె సాటిలేని విశిష్టత!

 

నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త

11.01.2021.