ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడం.
మరింత ఉత్సాహ ఉద్విగ్నతలతో 2114* వ నాటి స్వచ్చోద్యమం.
విజయవాడ మార్గంలోనే – నిన్న, మొన్నటి కార్లు కడుగుడు స్ధలం దక్షిణంగా 28-01-2021 (గురువారం) నాటి అతిశీతల బ్రహ్మ ముహూర్తంలోనే - 4.26 నుండి 6.20 దాక - ఇంచుమించు రెండు గంటల పాటు ప్రవర్తిల్లిన – చల్లపల్లికి ప్రయోజనకరంగా ప్రవర్ధిల్లిన శ్రమదానంలో భాగస్వాములు 29 మంది. నేటి స్వచ్ఛ – శుభ్ర సేవలు 6 వ నంబరు పంట కాలువ దాటి విస్తరించాయి.
కొన్ని అదనపు విశేషాలతో చాల వరకు నిన్నటి వలెనే ఈ నాటి బాధ్యతలు కొనసాగినవి – అదే మట్టి పని, చీపుళ్లతో అవే రహదారి శుభ్రతలు, బాటకు తూర్పు ముఖంగా మురుగు కాల్వలో అవే పరిశుభ్రతా ప్రయత్నాలు! కాకపోతే నిన్నటి ఒక్క ట్రాక్టరు బదులు రెండు ట్రాక్టర్లలోకి చట్టుపడిన బురదను డిప్పలతో ఎత్తి, శ్మశానంలో అవసరాన్ని బట్టి సర్ది రావడం. చిన్న ట్రక్కు దగ్గర ఏడుగురు, పెద్ద ట్రక్కు దగ్గర పది మంది శ్రమదాతల కృషి. ఇద్దరు పలుగులతో మట్టిని త్రవ్వుతుంటే – నలుగురు డిప్పలలోకి పారలతో ఆ మట్టిని నింపుతుంటే – డిప్పలను ట్రక్కులోకి ముగ్గురు చేరవేస్తుంటే – ఇంకొకాయన ట్రక్కు మీద ఆ మట్టిని సర్దుతుంటే – ఈ మహత్క్ర కృషిలో రైతుల - ఉద్యోగుల, వ్యాపారుల శ్రమ జీవన వైభవంతో నేను సైతం ఉత్సాహం ఆగక పార, పలుగు పట్టి పని చేయక తప్పలేదు!
ఆ ప్రకారం నాలుగు ట్రక్కుల బురద మట్టి శ్మశానం గోతుల చదునుకు పనికి వచ్చింది; ఈ అందమైన రహదారి ప్రక్కన అసహ్యంగా – అనవసరంగా ఉన్న బిగిసిన మన్ను గుట్టలు తొలగిపోయి, (జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం వాట్సాప్ చిత్రంలో గమనించండి -) దారి మరికొంత విశాలంగా, హరిత – సుమ సుందరంగా కనిపిస్తున్నది – స్వచ్ఛ సైనికుల అకుంఠిత శ్రమదానం అలా ఉభయ తారకంగా ఫలితాలనిస్తున్నదన్న మాట!
బెజవాడ దారికి పడమర దిక్కు డ్రైనులో ముగ్గురు పని చేశారు. ఎందుకో గాని, అక్కడ ముళ్ళు, ముళ్ళ మొక్కలు, ఎండు కొమ్మలు ఎక్కువగా పడి ఉన్నాయి. వీటన్నటిని తొలగించి సుందరీకరించడం కాక ఈ త్రిమూర్తులు సాధించినది మరొకటి – గతంలో తామే నాటి, పెంచిన ఒక చక్కని చెట్టును త్రాగిన మత్తులో కాబోలు, ఎవరో బండితో గుద్ది పడగొడితే కూలిపోయి, ఎండి డ్రైనులో పడి ఉంది. కాని అది చావలేదని కనిపెట్టి, అతి కష్టం మీద దానిని నిలబెట్టి, పోటీలు పెట్టి యధాస్థితికి తెచ్చారు. (వాట్సాప్ చిత్రంలో కనిపిస్తున్నది.)
ఇవికాక నలుగురు మహిళా కర్మిష్టులు చీపుళ్లతో వచ్చే పోయే వేగవంతమైన వాహనాల రద్దీని కాచుకొంటూ రహదారిని శుభ్రపరుస్తూనే ఉన్నారు.
బాగా నడవలేని, సరిగా శ్రమదానం చేయలేని 83 ఏళ్ల వృద్ధ ఔత్సాహిక కార్యకర్త యీరోజు కూడ స్టూలు మీద కూర్చొని, ఈ రెండు గంటల ఉషోదయ స్వచ్ఛ కార్యక్రమాన్ని చూసి, ఎద నిండా సంతోషం నింపుకొంటూనే ఉన్నారు. శ్మశానం లో ట్రస్టు కార్మికులు కాయించిన ఆరటి పండ్లను అందరూ నిస్సంకోచంగా ఆరగించి, కాఫీలనాస్వాదించి, RTC లో బస్సు చోదక ఉద్యోగి తోట నాగేశ్వరరావు ముమ్మారు ధ్వనించిన గ్రామ స్వచ్ఛ – పరిశుభ్ర – సౌందర్య సంకల్ప నినాదాలను దీటుగా ప్రతిధ్వనించి, 6.45 తరువాత ఇళ్లకు కదిలారు.
పెదకదళీపుర మూలాలుకల – 1976 లో S.R.Y.S.P. కాలేజీలో ఇంటర్ చదివిన – (గొర్రెపాటి పార్ధసారధి గారి కుమారుడు) రమేష్ చంద్ర బాబు గారు చల్లపల్లి స్వచ్చోద్యమాన్ని, స్వచ్చోద్యమ కారుల్ని అభినందించిన సందేశాన్ని దాసరి రామకృష్ణ ప్రసాదు గారు హర్ష ధ్వానాల నడుమ చదివి వినిపించారు.
రేపటి శ్రమదానం కోసం విజయవాడ రోడ్డులోని కార్ల షెడ్డు దగ్గర ఉదయం 4.30 కి కలుసుకొందాం!
చంద్రునిలో మచ్చలేని...
స్వచ్చోద్యమ చల్లపల్లి సముత్తుంగ శిఖరాగ్రం
స్వచ్ఛ మాన్య చల్లపల్లి సకల జనుల కారాధ్యం
చంద్రుని మచ్చైన లేని స్వచ్ఛ ధన్య చల్లపల్లి
సకాల సముచిత యత్నం స్వచ్ఛ రమ్య చల్లపల్లి!
నల్లూరి రామారావు,
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త, చల్లపల్లి.
28.01.2021.