ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.
2124* వ నాటి గ్రామ స్వచ్ఛ – సుందర ఉద్యమ సన్నివేశాలు.
ఇది గురువారం (11.02.2021). వేకువ 4.22 సమయం. గాంధీజీ మౌన విగ్రహ సాక్షిగా నిశ్చల నిశ్చితంతో గ్రామ స్వస్తతకు కంకణధారులైన స్వచ్చోద్యమకారుల్ని వాట్సాప్ చిత్రంలో చూడవచ్చు. అనగా – వీళ్ళంతా వేకువ ఏ 3.40 కో నిద్ర లేచి ఏ రెండు – మూడు - నాల్గు కిలోమీటర్లో చలిలో ప్రయాణించి 4.20 కి ఇక్కడకు చేరినట్లే గదా! ఇక అక్కడి నుండి 2 గంటల సమయం ఏ పదవులు, డబ్బులు, కీర్తి ప్రతిష్ఠలు కోరుకొనక, ఊరి ఉమ్మడి ప్రయోజనమే లక్షించి – ఈ ఒక్క రోజే కాదు – 2124* దినాలుగా – రెండున్నర లక్షల పని గంటలుగా శ్రమిస్తున్న ఈ కార్యకర్తల్ని సగం మంది గ్రామస్తులు పట్టించుకోక పోవడాన్ని ఏమనాలి?
ఈ నాటి స్వచ్ఛ – శుభ్ర – సుకర – సుందరీకృత గ్రామ విభాగం ముఖ్యంగా 6 వ సంఖ్య గల పంట కాలువ ప్రాంతమే. ఐదారు నాళ్ళుగా ఈ కాలువ ఉత్తర గట్టు సౌకర్యం మీదే దృష్టి పెట్టిన కార్యకర్తలు ఇంచుమించు అందరూ ఈ వేకువ దాని దక్షిణపు దిశ దారి భద్రత, శుభ్రతల కోసం పూనుకొన్నారు. నారాయణరావునగర్ కు వెళ్ళే యీ రోడ్డు మాత్రం ఏమీ తక్కువ తిన్నది? కావలసినన్ని ప్లాస్టిక్ సంచులు, టిఫిన్ పొట్లాలు, ఎంగిలి విస్తర్లు, ఖాళీ సారా సీసాలు, డ్రైన్ల ప్రక్క పిచ్చి – ముళ్ళ మొక్కలు, దురదగొండి తీగలతో సహా భారీగా కశ్మలాలు! ఈ అన్నిటి పైన దండెత్తి – సుమారు 150 మీటర్ల మేర శుభ్ర – సుందరీకరించిన ఈ పది మందిని “మీకిదేంపనయ్యా? ఎవరెవరో గ్రామస్తులు విసురుతున్న ఈ కశ్మలాల సంగతి మీకెందుకు?.....” అని మాత్రం ఎవ్వరూ ఆలోచించరు – అడగనే అడగరు!
ఉదయం 5.00 తరువాత రెచ్చిపోతున్న మంచు – చలి నేపధ్యంలో పంట కాల్వ గట్టు గోడ దగ్గర గోతుల్ని, వానలకు కారిపోయి, గేదెల త్రొక్కుడుకు లోతుగా వెడల్పుగా విస్తరించిన పెద్ద గోతిని, దాని కాలుష్యాలను తొలగించి, తాటి బొందులమర్చి, పెద్ద రాళ్ళను, కాంక్రీటు దిమ్మల్ని తెచ్చి లోతును తగ్గించి, పైన మట్టిని ఊరికే విసరడం కాక – అందంగా సర్దుతూ శ్రమిస్తున్న పది మందిని కూడ వాట్సాప్ సాక్షిగా గమనించండి! ఇదొక్కటే చోటు కాదు – ఊరిలో ఎక్కడ ఏ అసౌకర్యం - అందహీనత కనిపించినా భరించలేని ఈ కార్యకర్తలు ఇలా కాక ఇంకెలా స్పందింస్తారు?
ఈ దారి సౌకర్యం కోసం, నడిచే గ్రామస్తుల ఆహ్లాదం కోసం ఈ రోజు శ్రమించిన 28 మందిలో - ఇంత చీకటిలో నెత్తి మీద మట్టి తట్టలు మోసే డాక్టరమ్మ, దీక్షగా పనిలో మునిగే సంపన్న రైతులు, పారలతో నడుం వంచి పనిచేస్తున్న గృహిణీమ తల్లులు, 65 - 70 ఏళ్ల వయసులోనూ పాటు బడుతున్న పదవీ విశ్రాంత వయో వృద్ధులు ఉన్నందుకు నా చల్లపల్లి గర్వించాలో, చాలినంతగా స్పందించనందుకు సిగ్గుపడాలో తెలియకున్నది.
శ్రమదాతలంతా 6.40 సమయంలో కాఫీలను, పరస్పర చతురోక్తుల్ని ఆస్వాదించిన పిదప దేసు మాధురి తన గ్రామ స్వస్తతా నిబద్ధతను తెలియజేసే స్వచ్ఛ - శుభ్ర - సుందర సంకల్ప నినాదాలను తిరుగులేని విధంగా వినిపించడమే కాదు - తనదో, తన వారిదో గాని, పుట్టిన నాటి సందర్భంగా “మనకోసం మనం” మేనేజింగ్ ట్రస్టీ గారికి 1000/- విరాళం సమర్పించడం ఒక విశేషం.
కృషీవలుడైన స్వచ్ఛ కార్యకర్త - మల్లంపాటి ప్రేమానంద్ పంచిన ఆరోగ్యకరమైన ఏడెనిమిది స్వచ్ఛ - లేత సొరకాయలకు కూడ మన ధన్యవాదాలు!
90 ఏళ్ల వయోవృద్ధ – విశ్రాంత వ్యాయామోపాధ్యాయులు శ్రీ కోనేరు శివరామకృష్ణయ్య గారు స్వచ్చోద్యమ చల్లపల్లి ఖర్చుల నిమిత్తం 5000/- రూపాయలను దాసరి రామకృష్ణ ప్రసాదు గారికి ఆశీర్వచనపూర్వకంగా సమర్పించినందుకు వారికి మన కృతజ్ఞతాభివందనాలు.
రేపటి మన వేకువ గ్రామ మెరుగుదల కృషి విజయవాడ బాటలోని 6 వ నంబరు కాలువ గట్టు/ రోడ్డు దగ్గరే!
ధర్మవీరుల ఘర్మ జలములు.
ఎంత సునిశిత మహాయత్నం! ఇంత సుందర స్వచ్ఛ గ్రామం
ఒక సమున్నత లక్ష్యసాధన కుద్యమించిన స్వచ్ఛ సైన్యం
ఎన్ని వేల దినాల పొడవున ఈ నిరంతర స్వచ్ఛ యజ్ఞం!
కర్మ వీరుల ఘర్మ జలములు గ్రామ స్వస్తత కాలవాలం!
నల్లూరి రామారావు,
స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,
11.02.2021