2125* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

 

2125* రోజులకు చేరిన స్వచ్ఛ కార్యకర్తల గ్రామ హిత పరిచర్యలు.

 

ఈ శుక్రవారం (12.02.2021) నాటి  స్వచ్చోద్యమ కారుల స్వచ్ఛ - శుభ్రతా కృషి వేకువ 4.20 కే మొదలై, 6.22 దాక అంతరాయరహితంగా కొనసాగింది. 30 మంది వారం రోజుల నుండి తలపెట్టిన పంట కాలువ రెండు గట్ల విశిష్ట సౌకర్యకల్పన ఒక ఫర్లాంగు వరకైనా భద్రంగాను, స్వచ్ఛ - సుకర - విశాలంగాను కనిపిస్తున్నవి. ఐతే - ఈ బాధ్యతలు పంచుకోదగిన నారాయణరావునగర్ నివాసులు మాత్రం ఈ 30 మందిలో కనిపించలేదు. (గతంలో ఇక్కడి కొందరు సంవత్సరాల కొద్దీ తమ నివాస ప్రాంతాన్ని ప్రతి ఉదయం తీర్చిదిద్దుకొన్నారు!)

 

ఇక నేటి స్వచ్ఛ - సుందర  కర్మ వివరాల కొస్తే ....

 

- రెట్టించిన ఉత్సాహంతో సుందరీకరణ కార్యకర్తలు పంట కాలువ వంతెన దగ్గర గేదెలు దిగే దక్షిణపు గట్టు గండిని పూడ్చడంలో, సర్ది చదును చేయడంలో, అందుమూలంగా సదరు గట్టు మీది బాటను విశాలపరిచి, దర్శనీయంగాను, ద్విచక్ర, చతుశ్చక్ర వాహన ప్రయాణయోగ్యంగాను రూపొందించి గాని వదల్లేదు. అంతకు మునుపు అప్పుడప్పుడూ శ్రమదాత ఐనా, ఈ నడుమ మాత్రం బొత్తిగా రానట్టి 90 ఏళ్ల విశ్రాంత వ్యాయామోపాధ్యాయుడొకరు ఈ బృందానికి చేదీపంతో వెలుతురు ప్రసరిస్తూ కనిపించారు. (నిన్న ఈయనే మన ఉద్యమ ఖర్చుల నిమిత్తం 5000/- సమర్పించారు.)

 

- ఇదే కాలువ గట్టుపైనా, దక్షిణాన మురుగు కాలువలోనూ మైకులో పాటలు వింటూ సందడి చేస్తూ, అలవోకగా శ్రమదానం చేస్తున్న డజను మందికి పైగా స్వచ్ఛ వీర సైనికుల్ని కూడ వాట్సాప్ చిత్రంలో గుర్తించవచ్చు. ఎక్కువ మంది ఖడ్గధారులు – కొందరు దంతెల వారు – కొందరు చీపుళ్ళ వారు. అందరి ధ్యేయం ఒకటే – తెలవారే సమయానికి ముళ్ళ – పిచ్చి చెట్లు, గోనె సంచులు, సారా ఖాళీ సీసాలు, ప్లాస్టిక్ సంచులు, ఇంకా ఏవేవో దిక్కుమాలిన టిఫిన్ (ఖాళీ) పొట్లాలు, ఎండు – పచ్చి గడ్డి, ఇదేదో డంపింగ్ కేంద్రంలాగ గ్రామస్తులెవరో వేసిన రకరకాల మూటలు అన్నీ తొలగించి, కనీసం  ఈ రెండు మూడు వందల గజాలైనా శుభ్రపడి కనువిందు చేయాలనే! రోజుటి కన్న మరికొంత ఆలస్యమైనా సరే, వాళ్ళు తామనుకొన్నది సాధించి, సంతృప్తులయ్యారు!

 

- మరొక ముఠా బాట్లింగ్ కంపెనీ పడమర డ్రైనులోని రకరకాల తుక్కును, రాతి ముక్కల్ని ఏరి, ఊడ్చి శుభ్రపరిచారు.

 

చల్లపల్లిలో వేలాది దినాలుగా ఇదొక నిరంతర స్వచ్ఛ – శుభ్రతా విన్యాసం! వాన – ఎండ – మంచులు ఏవీ అడ్డుకోలేని ఒక స్వచ్చోద్యమ వీచిక! దూర దర్శనంలో వేలాది గ్రామస్తులు వదలక చూసే వాటికన్న రసవత్తర – వీరోచిత స్వచ్చోద్యమ ధారావాహిక. ఇది మరింత దర్శనీయమూ – ఆలోచనాత్మక – అనుసరణీయమూ!

 

కాఫీ కషాయ రసపానీయ ఆస్వాదన వేళ – శివరామపురానికి చెందిన ఒక రైతు – స్వచ్ఛ కార్యకర్త - ఇక్కడి ఆరోగ్యదాయకమైన సొరకాయల – మరొకరి నిమ్మ పళ్ల పంపిణీ యధాప్రకారం జరిగింది. తొలుత నేను ప్రస్తావించిన కోమలానగర్ నివాసి - 90 ఏళ్ల కోనేరు శివరామకృష్ణయ్య గారి త్రిగుణాత్మక గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సుందర సంకల్ప నినాదాల పిదప –

 

దాసరి రామకృష్ణ ప్రసాదు గారు కృషి సమీక్షతో బాటు గ్రామ పంచాయితీకి పోటీ పడుతున్న అభ్యర్ధులకు స్వచ్చోద్యమకారుల అభ్యర్ధనల పత్రాలందించాలని గుర్తు చేశారు!

 

రేపటి మన పునర్దర్శన వేదిక గాంధీ గారి పాద పీఠికే! రేపటి వేకువ మన స్వచ్ఛకర్మ భూమి అక్కడి నుండి ఊరి దిశగా బెజవాడ రహదారే!

 

     రంకెలేయు కాలుష్యంరాకాసిని...

స్వచ్చోద్యమ చల్లపల్లి కధాక్రమం బెట్టిదనగ -

సామాజిక ఋణ విముక్తితత్వం ఒక పునాదిగా

విచ్చలవిడిగా పెరిగుచు – విర్రవీగు – రంకెలేయు

కాలుష్యం రాకాసుల కాళ్ళు విరుగ గొట్టడం!

 

నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

12.02.2021