2126* వ రోజు ....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనే వాడం.

 

2126*  వ నాటి చల్లపల్లి స్వచ్చోద్యమ - నిర్నిబంధ శ్రమ వేడుక.

 

ఈ శనివారం నాటి ఉషోదయ బ్రహ్మ ముహూర్తాన 4.24 సమయంలో- భారతీయతకు ఆత్మ సాక్షి అనదగ్గ మహా పురుషుని ముందు తమకు మరింత తాత్విక బల సంపద కోసమేమో-16 మంది కార్యకర్తలు వాట్సాప్ ఛాయా చిత్రంలో ఒదిగి పోయారు.

 

మరో పదముగ్గురు కొద్ది క్షణాల వ్యవధిలో 3-4 కిలో మీటర్ల దూరం నుండి సైతం వచ్చి కలిశారు. నిన్నటి స్వయం నిర్దేశిత గ్రామ విభాగ (బెజవాడ బాటలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్ర పరిసరాల) స్వచ్చ-శుభ్ర సుందరీకరణలో రెండు గంటల  దాక తమ విలువైన సమయాన్ని, శ్రమను, చెమటను సమర్పించారు.

 

తమ అభిరుచిని, ఆసక్తిని, అవసరాన్ని బట్టి ఈ లోకంలో మనుషులు ఎన్నెన్నో పనులు చేస్తుంటారు- ముక్తి కోసం భక్తితో గుడికి వెళ్లడం, గ్రంథాలయాల్లో గడపడం, రాత్రి బగళ్ళు దూరదర్శినుల కంకితులైపోవడం, ఫోస్కో లు కబుర్ల కాలక్షేపాలు, ఎన్నికల్లో పోటీ పడటం వంటి చాలా పనుల్లో బిజీగా ఉంటారు.

 

ఈ స్వచ్చ కార్యకర్తల ప్రవృత్తే చాలా భిన్నం! తమ ఊళ్లో ఏ మూల ఏ కాలుష్యాల తో పర్యావరణానికీ, ప్రజలకు ఏం ముంచుకొస్తుందో, ఏ రోడ్ల మీద గోతులు పడి ఎవరు ఇబ్బంది పడతారో, ప్రధాన వీధుల స్వచ్చ- శుభ్ర సౌందర్యాలకు ఏ నష్టం జరుగుతుందో, ఏ మురుగు కాలువ పారక నిలిచి ఎక్కడ అంటు జబ్బులు దాపురిస్తాయో... అని మధనపడటం, గ్రామ మెరుగుదల కోసం తమ వంతు పాటుబడడం- ఏ రోజుకారోజు తమ కష్టంతో బాగుపడిన చోటుల్ని చూసుకొని ఆత్మ సంతృప్తి చెందటం వంటివి వీళ్ల నైజమైపోయింది.

 

ఆ రకం జీవన శైలికి, స్వచ్చ సంస్కృతికి మారిన ముగ్గురు కార్యకర్తలతో ఈ వేకువ 5.00 కు మాట కలిపాను. నారాయణ రావు నగర్ బాట దక్షిణాన డ్రైనులో దీక్షగా పని చేస్తున్న 60  ఏళ్ళు దాటిన వాళ్ళను- మూడు రోజులు గడిచినా అదే మురుగు కాల్వలోనే శుభ్రం చేస్తున్నారా?” అంటే వాళ్ల సమాధానం ఇది : ఏదో వచ్చాం-చూశాం-చేశాం-వెళ్లాం”- అన్నట్లు ఎందుకుండాలి సార్! చేసేదేదో మనసు పెట్టే చేయాలి. ఆ పనితో అక్కడ మళ్లీ నెల దాక ఆగంలేకుండా చూడాలనిపించాలి. అరకొరగా చేసి, ఇంటికి వెళ్తే సయించదు-నిద్ర పట్టదు”... అది విన్న నాకు డబ్బు-కీర్తి, పదవి, పదుగురి గుర్తింపుల కోసం పనిచేసే ఎవరికైనా ఇలాంటి ఆలోచనలు, మాటలు రావు-వీళ్ల సమున్నత సదాశయం ముందు అవన్నీ బలాదూరేఅనిపించింది.

 

నేటి శ్రమదాన వివరాలకొస్తే- ఈ 30 మంది స్వచ్చంద శ్రామికులే-

 

- 6 వ నంబరు కాలువ ప్రక్క నిన్నటి శేషించిన, ఇవాళ క్రొత్తగా పడిన గోనె సంచి మూటల్ని, ప్లాస్టిక్ సంచుల్ని తొలగించి ఊడ్చి పోగులు పెట్టారు.

 

- గాంధీ స్మృతి వన ప్రవేశ మార్గాన్ని, పూల మొక్కల్నీ, సుందరీకర్తలు సంస్కరించారు. ఎగుడుదిగుడుల్నీ, చెట్ల పాదుల్నీ చక్కబెట్టి, అక్కడి శుభ్రతకు పూర్తి బాధ్యత వహించారు!

 

- ప్రభుత్వ పాఠశాల ఎదుట నిన్న మిగిలిన బురద మట్టిని ఎత్తి, ట్రక్కులో నింపి, శ్మశాన స్థలికి చేర్చే బరువైన పనిని 10 మంది నిర్వహించారు.

 

ఇది గాక దూరంగా, ప్రభుత్వ సర్వజన వైద్య శాల మార్గం స్వచ్చ-శుభ్ర- సౌందర్య బాధ్యతలను ఐదుగురు స్వీకరించి, 6.25 దాక నెరవేర్చారు.

 

కృషి సమీక్షా సమయంలో గ్రామ శుభ్ర-సుందరీకరణ సంబంధ సంకల్ప నినాదాలను సౌమ్యంగా ముమ్మారు ప్రకటించిన వారు ఆకుల దుర్గాప్రసాదు గారు. కాకలు తీరిన స్వచ్చ కార్యకర్త శ్రీమతి పైడిపాముల కృష్ణ కుమారి తమ గ్రామ సర్పంచి పదవీ అభ్యర్దిత్వానికి అందరి ఆశీస్సులు కోరి, కార్యకర్తలు విధించిన 13 నిబంధనలకూ అంగీకరించారు.

 

రేపటి స్వచ్చ సుందర ప్రయత్నం కోసం మనం కలుసుకోదగిన చోటు-విజయవాడ దారిలోని కిషోర్ ఫౌండ్రి ఎదుట. సమయం- వేకువ 4.30.    

 

     సృజన శీల స్వచ్చ కృషి

జలం తీర్థమయ్యేందుకు శంఖమందె పొయ్యాలా?

ప్రతి సమస్య పూజారులె పరిష్కరిస్తూపోవాలా?

చల్లపల్లె నేటి యుగపు స్వచ్చోద్యమ నమూనా

ఇట్టి- స్వచ్చోద్యమ సృజనాత్మక చరిత చూడగలనా!

 

నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

13.02.2021