ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!
చల్లపల్లి కాలుష్యాల మీద 2200* వ నాటి దిగ్విజయ యాత్ర.
సంఖ్యాపరంగా కాస్త ప్రత్యేకత, స్ఫూర్తిదాయకంగానైతే ఎప్పటి లాగే విశిష్టత కలిగిన ఈ గురువారం నాటి వేకువ 4.21 నిముషాలకే పది మంది కార్యకర్తలకి, మరికొద్ది నిముషాలలో మిగిలిన పది మందికీ స్వచ్చంద శ్రమదాన శుభోదయమైపోయి – 2 గంటల పాటు స్వగ్రామ సౌకర్యాల మెరుగుదల కృషి నెలకొన్నది. వేదిక – వారం దినాల పైగా ఉన్నదే – గంగులవారిపాలెం రెండో మలుపు సమీప వంతెన.
స్వచ్ఛ కార్యకర్తల కార్యరంగ స్థలమంటే – అదేదో గిరిగీసినట్లు ఒక 50 – 100 గజాలకు పరిమితమెలా ఔతుంది? గత దిన ముందస్తు ప్రణాళికంటూ ఒకటుంటుంది గాని, తమ సృజనశీలతకనుగుణంగా అది ఎటైనా మారుతుంది; విస్తృతమౌతుంది. అలాగే 3 + 2 మంది సుందరీకర్తలు తాము గత 4 దినాలుగా నిర్వహించిన పూల మొక్కల, సుశ్యామ వర్ణ వృక్షాల సొగసుల మెరుగుదల కోసం నేడు కూడ మళ్ళీ ప్రయత్నించారు.
ఏడెనిమిది మంది మురుగు కాల్వ వంతెన ఉత్తర దిశ గట్టు అపరిశుభ్రత మీద ½ గంటకు పైగా పోరాడి, చిట్టడివిలా తయారైన చోటు చిందర వందర గందర గోళపు మొక్కల్ని, గడ్డిని తొలగించగా ముగ్గురు మాత్రం వంతెన దాటి గంగులపాలెం దిశగా ఎడమ ప్రక్క మార్జిను కశ్మలాల నిర్మూలనకు పూనుకొన్నారు.
స్వచ్ఛ సైనికుల నేటి అసలు సిసలు సాహసం మాత్రం బండ్రేవు కోడు మురుగు కాల్వ వంతెన క్రిందే దృశ్యమానమయింది. బండ్ల కొద్దీ తుక్కు, చెత్త, ప్లాస్టిక్ వస్తువులు, పాత గుడ్డలు, ఎవరు కట్టుకొన్న పుణ్యమో గాని – ప్లాస్టిక్ సంచుల మూటలు అడ్డుపడి మురుగు ముందుకు నడవక కుంటుతుంటే – కాస్త మసక వెలుతురులోనే ముగ్గురు రాటుతేలిన కార్యకర్తలు (60 సంవత్సరాల వయస్సు వాళ్ళు) ఏడడుగుల లోతుకు దిగి, చెత్త లాగి, కుంటుబడ్డ ప్రవాహాన్ని సక్రమంగా నడిపించడం ఈ స్వచ్చోద్యమ ఘట్టాలకు పరాకాష్ట కాదూ? (షరా : మరిన్ని వివరాలకు, ఈ సాహస ప్రదర్శన దృశ్యాల వీక్షణకు “జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం” మాధ్యమ చిత్రాలను చూడండి!)
వంతెన దాక గల కిలో మీటరు రహదారి అందాన్ని, పరిశుభ్రతను, వాటి వెనకున్న స్వచ్చోద్యమకారుల శ్రమనీ గుర్తిస్తారనీ మా ఆశ!
6.20 సమయాన – యువ కార్యకర్త రాజు ఎలుగెత్తి చాటిన గ్రామ స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య వైభవ సంకల్ప నినాదాల పిమ్మట రామకృష్ణ వైద్యుల వారి సముచిత సమీక్షను, భవిష్యత్ సూచనలను ఆమోదించాక 6.40 ప్రాంతంలో నేటి మన బాధ్యతలకు స్వస్తి!
రేపటి బాధ్యతాయుత కర్మక్షేత్రం కూడ గంగులవారిపాలెం దారి మలుపులోనే - వంతెన సమీపమే.
బలాబలాల వార్తలు.
స్వచ్చోద్యమ చల్లపల్లి సాహస కృత్యాలు కొన్ని
పంచవర్ష స్వచ్చోద్యమ ప్రగతి నివేదికలు కొన్ని
సుందరీకృత గ్రామపు శోభస్కర వార్త లెన్నొ
చల్లపల్లి స్వచ్ఛ సైన్య బలహీనతలవి ఎన్ని?
ఒక ‘స్వచ్ఛ సుందర చల్లపల్లి’ కార్యకర్త
05.08.2021.