ఒక్కసారికి మాత్రమే వాడి వదిలించుకొనే ప్లాస్టిక్ వస్తువులు వేటినీ వాడనే వాడం!
ఒక అద్భుత సామాజిక ప్రయోగం చల్లపల్లి లో - @ 2201* దినాలు.
6.8.2021 – శుక్రవారం కూడ 20.12.2013 నాడూ, 12.11.2014 వ తేదీనా మొదలైన చల్లపల్లి గ్రామ వీధుల బహుముఖ స్వచ్ఛ – సుందరోద్యమం అవిచ్ఛిన్నంగా నేరవేరింది. ఈ నాటి గ్రామ వీధి శుభ్ర – స్వస్తతా కర్తలు 22 మందైతే. వారిని బ్రహ్మ ముహూర్తంలో – 4.21 కే స్వాగతించిన ప్రదేశం 20 వ వార్డుకు చెందిన గంగులవారిపాలెం మార్గం లోని బండ్రేవుకోడు మురుగు కాల్వ వంతెన.
ఎవరి ఇంటిని, ఆవరణను, పరిసరాన్ని వారు శుభ్రపరుచుకోవడమే గగనమైపోతున్న ప్రస్తుత కాలంలో ఇంత పెద్ద గ్రామాన్ని – అందలి మురుగు కాల్వల్ని, వీధుల్ని, శ్మశానాల్ని, కొన్ని కార్యాలయల అవరణల్ని, పాఠశాలల్ని, పంట కాల్వ గట్టుల్ని, ఊరిలోనికి ప్రవేశించే 7 రహదారుల్ని తమ బాధ్యతగా స్వీకరించి స్వచ్ఛ – శుభ్ర – స్వస్త – సుందరంగా నిలుపుతున్న స్వచ్ఛ కార్యకర్త లెంతటి ఆదర్శ వ్యక్తులో పదేపదే చెప్పాలా? నిజానికి ఈ కర్తవ్యాలన్నీ పౌరులెన్నుకున్న పంచాయితీవి, ప్రభుత్వానివి. ప్రజల సహకారంతో. భాగస్వామ్యంతో ఇవన్నీ చక్కదిద్దవలసినవి అధికారిక వ్యవస్థలే గదా!
మరి ఇన్ని వేల దినాల – ఇన్ని లక్షల పని గంటల – ప్రతి వేకువనా 30 – 40 – 50 మంది కార్యకర్తలకు మాత్రమే ఈ బాధ్యతలెందుకు దక్కినవి? నేటి వీధి శుభ్రతల కోసం ఇక్కడికి పంచాయతీ కార్మికులో – వార్డు మెంబరో – కనీసం స్థానికులో వచ్చి పూనుకోలేదు. స్వచ్చోద్యమ కారులు మాత్రం యదావిధిగా మురుగు కాల్వ వంతెనకు ఉత్తర – దక్షిణ – పడమటి భాగాల్ని చీపుళ్ళతో ఊడ్చారు. ఎందుకూ పనికిరాని మొక్కల్నీ, గడ్డినీ, ప్లాస్టిక్ సంచుల్నీ, దుమ్ము – దూళినీ పోగులు చేసి, చెత్త కేంద్రానికి చేర్చారు. మురుగు కాల్వ దక్షిణ గట్టుతో కొంత, గంగులవారిపాలెం బాట తూర్పు గట్టు వ్యర్ధాలనూ కత్తులతో, దంతెలతో బాగు చేశారు.
ఈ పవిత్ర కార్యాలన్నీ 6.10 కి ముగించి, తమ ఈ నాటి కృషి ఫలితాన్ని కళ్ళారా చూసుకొంటూ, కాఫీలు సేవించి, సమీక్షా సమావేశంలో ఆజాను బాహుడు శివబాబు గారి ముమ్మారు చల్లపల్లి స్వచ్చోద్యమ ప్రతీకలైన స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య సాధనా సంకల్ప నినాదాలను ప్రతిధ్వనించారు. ఈ కాల్వ గట్టు పైన మరి 10 దినాలలో కిలో మీటరు బారునా వందలాది చెట్లను, పూల మొక్కల్ని నాటే ప్రణాళికను DRK గారు వివరించారు.
రేపటి వేకువ మన శ్రమదాన వేదిక కూడ ఈ గంగులవారిపాలెపు దారి మలుపు వంతెన దగ్గరే!
అడగాలను కొంటున్నా
అను నిత్యం గ్రామ సేవ లహర్నిశలు ఆ చింతన
రెండు వేల రెండొందల నాళ్ళు ప్రజల కొరకే తపన
ఏ స్ఫూరిని నింపిందని – ఎంత ఫలిత మిచ్చిందని....
స్వచ్ఛ రమ్య చల్లపల్లి సాకారత నిజమా అని...
ఒక ‘స్వచ్ఛ సుందర చల్లపల్లి’ కార్యకర్త
06.08.2021.