1885 * వ రోజు....

  

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1885* వ నాటి శ్రేయోదాయక కృషి.  

 

నిన్నటి నిర్ణయం ప్రకారం ఈ వేకువ 3.58-6.20 నిముషాల నడుమ 1 వ వార్డులో శ్మశానం దారి కిరుప్రక్కల జరిగిన గ్రామహిత స్వచ్చంద శ్రమదానంలో 27 మంది పాల్గొన్నారు.

 

కత్తుల పదును తగ్గడంతోను, ముళ్ల, పిచ్చి చెట్లు, కంప దట్టంగా పెరిగి, పెనవేసుకొని దారిలో కొంత మూసుకుపోవడంతోను ఈ రోజు కార్యకర్తల ఎక్కువ శ్రమతో గాని ఫలితం రాలేదు. అక్కడక్కడ వీధి దీపాల వెలుతురు కూడ చాల లేదు. ఐనా ఈ 20 మంది స్వచ్చ-శుభ్రతల కోసం చేసే పోరాటం ఆగలేదు. ముఖ్యంగా మురుగు కాల్వ బయటి గట్టు మీద మొండి మొక్కలు, గడ్డి తొలగిస్తూ-ఎండుటాకుల్ని , చెత్తా చెదారాన్ని రోడ్డు మీదికి లాగుతూ-గతంలో తాము నాటి పెంచిన చెట్ల కొమ్మల్ని కత్తిరిస్తూ – పాదుల్ని సరిదిద్దుతూ చేసిన వీరి కృషి విజయవంతమైనది! వీరితో బాటు చీపురుతో శ్రమించిన ఒకే ఒక మహిళా కార్యకర్త దారిలో అధిక భాగం శుభ్ర పరిచింది.

 

ఇరుకు-గతుకుల సిమెంటు దారి కావడంతో వ్యర్ధాలన్నిటినీ ట్రాక్టర్ లో నింపడం, చెత్త కేంద్రానికి చేర్చడం కొంత కష్టమయింది.  ఈనాటి రకరకాల వ్యర్ధాల పరిమాణం ఒక ట్రాక్టరున్నర! (ఇంత చెత్తా చెదారాన్ని సహిస్తూ-ఇన్నాళ్లు ఇరుకు రోడ్డులో తిరుగుతున్న ఒకటో వార్డు లోని ఆ ప్రాంతం జనం అభినందనీయులు!)

 

సుందరీకరణ త్రయానికి ఈ రోజు బైపాస్ మార్గంలోని వెలిసి, తుప్పు పడుతున్న ట్రాన్స్ ఫార్మర్ ఒకటి కంటబడింది!  దాన్ని శుభ్రపరచి, తుడిచి, ప్రైమర్ పూసి, రంగు వేసి, స్వచ్చ సంకల్ప నినాదాలు వ్రాసి, 6.25 దాక నియమిత సమయాన్ని అతిక్రమించారు.

 

స్వచ్చ యార్లగడ్డ కృషి 100 వ రోజుకు చేరడం ఈనాటి ముఖ్య విశేషం. ఒకానొక స్వచ్చ చల్లపల్లి కార్యకర్త ఉద్యోగ రీత్యా ఆ ఊరికి బదిలీ ఐ – అక్కడ ప్రారంభించిన స్వచ్చోద్యమం ఆ ప్రక్క గ్రామాల కు కూడ అంటుకోవాలని కోరుకొందాం! ఈ సాయంత్రం 3.30 కి అందరం యార్లగడ్డ కార్యకర్తలను అభినందించి వద్దాం.

 

వారం రోజుల తర్వాత స్వచ్చ చల్లపల్లి కృషికి పునరంకితుడైన కస్తూరి విజయ్ ముమ్మారు తన సహజ ధోరణిలో వేగంగా చెప్పిన గ్రామ స్వచ్చ-శుభ్ర – సంకల్ప నినాదాలతో నేటి మన బాధ్యత రేపటికి వాయిదా పడింది.

 

రేపటి శేష కర్తవ్య నిర్వహణ కూడ 1 వ వార్డుకు చెందిన శ్మశాన రహదారిలోనే కొనసాగిద్దాం!

 

       ప్రాథమ్యం- ప్రాధాన్యం.

ప్రాథమ్యం ప్రతిమారూ అవగాహన పెంచుటకే

ప్రాధాన్యం ఎప్పుడైనా ప్రజారోగ్య స్థితిగతులే

స్వచ్చ సైన్య కృషి సర్వం ఉదాహరణ ప్రాయమే

సుదీర్ఘ స్వచ్చ సేవలన్ని స్ఫూర్తి రగిల్చేందుకే!

 

    

   నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు- మనకోసం మనం ట్రస్టు,

గురువారం – 09/01/2020

చల్లపల్లి.