1886 * వ రోజు....

  

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1886* వ రోజు వార్తలు.  

 

    ఈ నాటి  వేకువ 4.02-6.20 మధ్య సమయంలో 1 వ వార్డు లో – హిందూ శ్మశాన మార్గంలో 32 మంది శ్రమదాతల గ్రామ బాధ్యతలు విజయవంతంగా జరిగాయి.

 

22 మందికి పైగా బాధ్యులు ప్రభుత్వ బాలికల వసతి గృహం దగ్గర నుండి శ్మశాన సమీప పంటకాలవ వారధి దాక ప్రణాళికా బద్ధంగా నిర్వహించిన స్వచ్చ-శుభ్ర-సుందరీకరణలో-

 

- కొందరు కరెంటు తీగల దాక పెరుగుతాయనుకొన్న-తమ చేతే నాటి-పెంచబడిన చెట్ల కొమ్మల్ని ఒక క్రమ పద్ధతిలో నరికి, తిరగేసిన గొడుగుల్లా తీర్చిదిద్దారు. అందుకవసరమైతే చెట్ల పైకి గూడ ఎక్కారు. (ఈ సందర్భంలో ఒక సీనియర్ మౌన కార్యకర్త కాలికి కత్తి గాయమైంది!)

 

- ఇంకొద్ది మంది కాలువ మురుగు కడ్డు నిలుస్తున్న తుక్కును, ప్లాస్టిక్ సంచుల్ని-బట్టలకు మురుగు అంటుతున్నా లెక్క చేయక- గొర్రులతో బైటకు లాగి, ఊరి మురుగులో చలనం తెచ్చారు. (ఒక సీనియర్ మహిళా కార్యకర్త గంటన్నర పాటు అడ్డ రోడ్డు తూము దగ్గర పది డిప్పల తుక్కు లాగింది!)

 

- ఇలా పుట్టుకొచ్చిన అన్ని రకాల వ్యర్ధాలను 6.10 తరువాత ట్రాక్టర్ లోకి ఎక్కించి, చెత్త కేంద్రానికి తరలించారు. ఇంత మంది 40-50 పని గంటల తదేక దీక్షతో ఈ రోజు శ్మశాన మార్గము, నాలుగైదు రోజుల నుండి బైపాస్ మార్గము ఎంతగా స్వచ్చ-శుభ్ర-సుందర-సౌకర్యంగా ఉన్నవో మనం వాట్సాప్ లో చూడవచ్చు.

 

 ఇక సాగర్ టాకీస్ ఉప (బైపాస్) మార్గంలో – విజయ్ నగర్ సమీపంలో సుందరీకరణ యజ్ఞం యధావిధిగా జరిగిపోయింది. మొండి గోడల్ని కూడ వదలక, విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లను సైతం ప్రైమర్లు పూసి, రంగులేసి, పూల బొమ్మలు తీర్చిదిద్ది సుందరీకరించే ఈ పనిలో- డాక్టర్స్, ఉపాధ్యాయులు, వ్యాపారులు చూస్తుండగానే కళాకారులుగా మారుతున్నారు.      

 

నిన్నటి స్వచ్చ యార్లగడ్డ శత దినోత్సవం ఒక పండుగ వాతావరణంలో విజయవంతంగా జరిగింది.

 

ఈనాటి స్వచ్చ కృషి సమీక్షా సమావేశంలో పైడిపాముల రాజేంద్ర ముమ్మారు ప్రకటించిన గ్రామ స్వచ్చ-శుభ్ర-సంకల్ప నినాదాలతో 6.45 కు మన గ్రామ బాధ్యతలు ముగియగా....

 

రేపటి మన తరువాయి కృషి కోసం గంగులవారిపాలెం దారిలో గల మా ఇంటి  దగ్గర కలిసి కొనసాగిద్దాం. అమెరికా లోని తెలుగు సంఘం మాజీ అధ్యక్షులు, అక్కినేని అంతర్జాతీయ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ తోట కూర ప్రసాద్ గారిని స్వాగతించడానికి అందరం స్వచ్చ యూనిఫాం తో అధిక సంఖ్యలో హాజరౌదాం!

 

     అందరూ మహానుభావులే.

స్వచ్చంద శ్రమదాతలు-గాయక-కవి-పండితులు-

తాత్వికులు-ఉదాత్తులు-ట్రస్టులోని ఉద్యోగులు-

రాజకీయు-లధికారులు-వృత్తి సంఘ అధినేతలు-

అందరి కలయిక తోనే స్వచ్చోద్యమ కదలికలు!

 

   నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు- మనకోసం మనం ట్రస్టు,

శుక్రవారం – 10/01/2020

చల్లపల్లి.