2287* వ రోజు.......

 ఒక్కసారికి మాత్రమే పనికొచ్చే ప్లాస్టిక్ వస్తువులను ఎప్పుడూ వాడం...

గ్రామ రహదార్ల భద్రతకై 2287* వ నాటి కొందరి శ్రమదానం,

          నవంబరు మాసం తుది దినాన - మంగళవారం వేకువ 4.30 సమయానికి స్వచ్ఛ చల్లపల్లి రెస్క్యూ టీమ్ అరడజను మంది ఊరికి ఉత్తరం దిశలో - విజయవాడ రోడ్డులోని బాలాజి అపార్ట్మెంట్ దగ్గర ఆగింది. అక్కడ వాళ్లు టాక్టలో నింపుకొన్నది తారు పెచ్చులు! గ్రామం పడమటి కొసలో 5.00 AM. సమయంలో వాళ్ల నిర్వాకం చూస్తే - జాతీయ రహదారి మీద పిడకల మామ్మ గారి ఇంటి దగ్గర పెద్ద గుంటలో ఆపెచ్చుల్ని పేర్చి, చెదరకుండ సర్ది, వందలాది ద్వి – చతుశ్చక్ర వాహన భద్రత కల్గించడం!

 

          అక్కడి గంట మరమ్మతు పిదప బస్టాండు సమీపంలో - పంచముఖ ఆంజనేయ దేవళం ఎదుటి గుంటల దగ్గరా వీళ్లే. ఇక్కడి రోడ్డు వైద్యానికి మరో ముప్పావు గంట! ఏం చేస్తాం - ఈ గ్రామ పరిరక్షక దళానికిదొక దైనందిన ఆనందం!

 

          నిత్యం ప్రయాణించే వందల వాహనదారులు, గ్రామస్తులు, రహదారి సంబంధిత ప్రభుత్వ శాఖలు, ఎక్కడెక్కడికో ఎన్నికైన ప్రతినిధులు, అధికారులు ఎవరూ పూనుకోక వదిలేసిన రోడ్ల గుంటలు! నెలల తరబడి వానలకు, భీభత్సంగా - ప్రామాదికంగా అనాథలుగా మిగిలిన గోతులు! గ్రామ స్వచ్చోద్యమ రెస్క్యూ టీమ్ చొరవతో ఇప్పటికైనా - కొన్నైనా పూడినందుకు అభినందనలు!    

          “So friends!

          Think less of selfish ends

          And lend your neighbor a helping hand!

          Never mean by ‘Land’ clay and Sand -

          The people - the people - They are the Land!...”

          అని గురజాడ అప్పారావు ఎందుకు ప్రబోధించాడో (ఆంగ్లీకరణ శ్రీశ్రీది) వీళ్లను చూస్తే నాకు బాగా అర్థమౌతున్నది!  

          కస్తూరి విజయ్ 3 మార్లు నినదించిన గ్రామ శుభ్ర - భద్రతా సంకల్పంతో నేటి శ్రమదాన పరిసమాప్తి!

రేపటి వేకువ - తరువాయి గ్రామ మెరుగుదల కృషి కోసం ఇస్లాం నగర్ దగ్గరే మన పునర్దర్శనం     

          స్వచ్ఛ సైన్యం ఉద్యమించుట

ఒక్కమాటగ - ఒక్క బాటగ - ఒకే లక్ష్యంతోనె నడిచీ

రెండు వేల దినాలపైగా - రెండు లక్షల గంటలుగ - నీ

ఊరి మేలుకు స్వచ్ఛ సైన్యం ఉద్యమించుట మరువబోకుము

అనువదింపుము – అనుసరింపుము - ఆసదాశయ స్ఫూర్తి మంత్రం!

          

ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లికార్యకర్త &

మనకోసం మనంట్రస్టు బాధ్యుడు

30.11.2021.