ఒక్కసారికే పనికి వచ్చే – పర్యావరణాన్ని చెరిచే ప్లాస్టిక్ వస్తువులను మనమెందుకు వాడాలి!
2449* వ నాటి వాహన భద్రతా చర్యలు రెస్క్యూ టీం వారివి!
ఔను – సోమవారం (30.05.2022) తమకు చాతనైనంతగా ఊరి కోసం కృషి చేసే వంతు రెస్క్యూ టీం వాళ్ల హక్కే గదా! ఆ అవకాశాన్ని వాళ్లెందుకు వదులుకుంటారు? 4.26 నుండి గంటన్నరకు పైగా 4+2+1= ఏడుగురి బరువు పాటి పని! RTC బస్ స్టాండు నిష్క్రమణ మార్గం (ఆంజనేయుని గుడి) ఎదుట పడిన రోడ్డు గుంటల్ని పూడ్చే పని వాళ్లు నెరవేర్చిన బాధ్యత!
వీళ్లలో నలుగురు రాటు తేలిన కార్యకర్తలూ, 84 - 75 ఏళ్ల ఇద్దరు విశ్రాంత వయోవృద్ధులూ, ఇంకో దారిన పోతూ ఆగి పని చేసిన ఆగంతకుడూ!
ముప్ఫై- నలబై మంది గ్రామస్తులు సొంత పనుల మీద అక్కడ తచ్చాడారు గాని - ఏ ఒక్కరూ ఆ గంటన్నరలో కాలు మోపనూలేదు, కార్యకర్తల పనిలో వేలు పెట్టనూ లేదు! ఈ రద్దీ మలుపు రోడ్డు గుంటలు మీరు పూడ్చడం ఇదెన్నో మారని ఆరా తీయనూ లేదు!
తారనేది ఎప్పుడో ఎండిపోయి, కంకర చెదరి పోయి, గుంటల లోతు పెరిగిపోయి, వాహన దారులకు ప్రమాదంగా ఉన్నా - ప్రభుత్వం పట్టించుకోనూ లేదు. అప్పుడొక ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలూ, ఇప్పటికీ 3 మార్లు చల్లపల్లి స్వచ్చ కార్యకర్తలూ పూడుస్తున్నా గుంటల పూడిక నిలవడమూ లేదు!
ఈ వేకువ కూడా మెరికల్లాంటి నలుగురు గ్రామ భద్రత దళ సభ్యులు ఏ దాత నుండో సేకరించిన రాళ్ల రద్దును ట్రక్కులో నింపి తెచ్చి, గోతుల్లో దించుతున్న పుణ్య కార్యాన్ని “జై స్వచ్చ చల్లపల్లి సైన్యం” వాట్సాప్ మాధ్యమ చిత్రాల్లో చూడండి. దించిన మట్టి రాళ్ల రద్దును ఒంగి, సర్ది చదును చేస్తున్న 84 ఏళ్ల వృద్ధుని ఆ చిన్న పనే ఆయనకెంత రిస్కో ఆలోచించండి!
ఇప్పటికైనా- చల్లపల్లి శ్రమదానోద్యమ మంటే ఏమిటో- ఎందుకో చర్చించండి- న్యాయమనుకొంటే నచ్చిన వాళ్లు వచ్చి పాల్గొనండి!
కాస్త మితభాషి ఐన స్వచ్చ కార్యకర్త – తూములూరి లక్ష్మణ నామధేయుడు పలికిన గ్రామ సంక్షేమ కారక స్వచ్చ-శుభ్ర-సౌందర్య నినాదాలతో 6.30 కి వీళ్ళ శ్రమదానం ముగించారు!
సమర్పిస్తున్నాం ప్రణామం – 29
పరిశుభ్రత సన్నిధిగా – విరి తోటల పెన్నిధిగా
సుమ సుందర వీధులుగా – పర్యాటక దృశ్యంగా
శ్రమ సంచిత సర్వోత్తమ గ్రామంగా తమ ఊరిని
నిలుపుతున్న శ్రమ జీవన రీతికి నా ప్రణామం!
- నల్లూరి రామారావు,
ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు,
స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త
30.05.2022.