కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దాం!
మరో మారు హిందూ శ్మశాన వాటికలోనే- శ్రమ వీర విహారం- @2519*
28.08.2022 – ఆదివారం వేకువ ఈ 1 వార్డు దగ్గర చిల్లల వాగు గట్టు ప్రక్కన జరిగింది పరాకాష్టకు చేరిన వెర్రి చేష్టలో- తెలివి మీరిన సమాజానికొక శుభ సందేశమో – పుట్టి పెరిగిన గ్రామానికొక ప్రణామమో – కొందరు తిక్క మనుషుల శ్రమదాన వ్యసనమో.... – ఎలాగైనా అనుకోవచ్చు గాని అది మాత్రం ఊరి జనమంతా తప్పక చర్చించాల్సిన విషయమే!
ఈ 45 మందీ తలా 105 నిముషాల పాటు- ఈ చీకట్లో – ఆగి, ఆగుతూ పడుతున్న చినుకుల్లో – ఎగుడుదిగుడు 20 సెంట్ల శ్మశాన స్థలిలో – సగం కాలి మిగిలిన కట్టె ముక్కల నడుమ – ఏ విశిష్ట గ్రామస్తులవో శవాల దిబ్బల వద్ద- కత్తులతో పిచ్చి, ముళ్ల మొక్కలు నరుకుతూ,
గొర్రులతో లాగి పోగులు పెడుతూ,
చినుకుల్లో సైతం చెమటలు చిందిస్తూ,
సీసాల కొద్దీ నీళ్ళను అనివార్యంగా త్రాగుతూ,
దోమల్తో- పురుగుల్తో కుట్టిచుకొంటూ చేసిన శ్రమదానం మా వంటి కొందరి దృష్టిలో పెద్ద పుణ్య కార్యం! పేరుకు ప్రజాస్వామ్య సమాజం కనుక ఎవరి ఆలోచన వాళ్లది!
ఎందుకంటే – ఒక 76 ఏళ్ల పెద్దాయన – శేషగిరి రావు - ఈ రోజు క్రొత్తగా వచ్చిన కుర్రాళ్లతో అనడం విన్నాను : “ గుర్తు పెట్టుకొండిరా! మన కాలంలో పుణ్యాత్ములంటే ఈ స్వచ్చ కార్యకర్తలే! 2519 * రోజులుగా మనందరి సౌకర్యాల కోసం నిత్యం శ్రమిస్తున్న వీళ్ల ఋణాన్ని చల్లపల్లి సమాజం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోగలుగుతుందా....” (నా ఓటు కూడ ఈయన అభిప్రాయానికే!)
ఈ ఊళ్లోనూ, దేశంలో లక్షల ఊళ్లలోనూ ఇలాంటి శ్రమదానాలెన్ని జరిగితే – ఎందరు క్రొత్త కార్యకర్తలు బయల్దేరితే – ఎంతగా ఈ కృతజ్ఞతా ప్రకటనలు వ్యాపిస్తే – వీధులు, మురుగు కాల్వలు, శ్మశానాలు చల్లపల్లి లాగా స్వచ్చ-శుభ్ర- సుందరంగా మారతాయో గదా! ఎప్పుడు చైతన్యం పెరిగి, ఫ్లెక్సీలు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దరిద్రాలు తొలగి, పర్యావరణ సంక్షేమం కనిపిస్తుందో గదా!
ప్రతి రోజూ – ప్రతి స్వచ్చ కార్యకర్త ఎంత బాధ్యతగా- తన ఊరి మేలు పట్ల నిబద్ధతగా- ఎన్ని చెమటలు చిందిస్తున్నాడో నేనెందుకు వర్ణించాలి? ‘ జై స్వచ్చ చల్లపల్లి సైన్యం’ వాట్సాప్ దృశ్య శ్రవణాలను చూస్తే తెలిసి పోదా?
45 మంది ఎంతగా శ్రమించినా ఏళ్ల తరబడీ పేరుకుపోయిన రకరకాల కశ్మలాలు తొలగించే పని ఈ రోజు కూడ పూర్తి కాలేదు. ఒక క్రొత్త కార్యకర్త ‘బళ్లా వాసు’ పాత కార్యకర్త’ అడపా గురవయ్యతో’ కలిసి “ జై స్వచ్చ సుందర చల్లపల్లి! స్వచ్చ సుందర చల్లపల్లిని సాధిద్దాం” అంటూ నినదించి, కార్యకర్తలందరితో పలికించాక-
మన స్వచ్చ వైద్యుడు అందరి అంగీకారంతో బుధవారం పాగోలు రోడ్డు రైస్ మిల్లు వద్ద, గురువారం హిందూ శ్మశాన వాటిక వద్ద ప్రణాళికను ప్రకటించారు!
కనుక బుధవారం వేకువ పాగోలు లోని రైస్ మిల్లు దగ్గర కలుసుకొందాం!
*శత శాతం మద్దతేది ?*
ఎవ్వరు ఊహించనారు ఈ స్వచ్చోద్యమ ప్రగతిని
‘ ఉబుసు పోక కబుర్లనీ’, ‘ ఉత్సాహపు ఉధృతి’ అని
ఆరంభ దినాల లోన అనిన వాళ్ళె ఎక్కువ గద!
శ్రమదానానికి ఇపుడూ శతశాతం మద్దతేది?
- నల్లూరి రామారావు,
28.08.2022.