కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమయ్యే ప్లాస్టిక్ వస్తువుల వాడకం మానేద్దాం!
2521* వ నాటిది పాగోలు సమీపాన పూర్తి స్థాయి కృషి.
మంగళవారం వేకువ నుండి 4 కి.మీ. దూరం వెళ్లి మరీ ఆ రహదారిని చక్కదిద్దిన వాళ్లు 29 మంది! మరి ఆ రోడ్డుకేం కష్టమొచ్చిందని అడిగితే - చల్లపల్లి వీధులంత అందంగా ఉండమనడం లేదు గాని, చాలా చాలా ఊళ్ళ రోడ్లంత నికృష్టంగా లేదు గాని, దీని మీద కూడ తగుమాత్రంగా ప్లాస్టిక్ గ్లాసులు, సీసాలు, ప్లేటులు ఉన్నాయి. మార్జిన్లలో పిచ్చి – ముళ్ల మొక్కలూ, తీగలూ సరేసరి!
సదరు గ్రామస్తుల సంగతేమో గాని, చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తలు మాత్రం వాటిని తట్టుకొనేంత బలవంతులు కాదు! వాళ్ల ఊళ్ళో కాదు – ఎంత దూరంలో ఏ పంట కాలువో ప్లాస్టిక్ కశ్మలాలూ, ప్రాత గుడ్డలూ.. కనిపిస్తే భరించలేక పదేసి కిలోమీటర్లు వేకువనే వెళ్లి శుభ్రపరచడం వాళ్ల బలహీనత! (చల్లపల్లిలో కూడ కొన్ని చోట్ల వీళ్ళ బలహీనతే గ్రామస్తుల బలం! – వీధుల్నెంత చెడగొట్టినా తమ ఊరి స్వచ్ఛంద శ్రమదాతలున్నారనే ధీమా!)
బుధవారం చేద్దామనుకొన్న పాగోలు రోడ్డు శుభ్ర సుందరీకరణం ఆ కారణాన - ఆ విధంగా నేటి వేకువనే జరిగిపోయింది! ఎలా జరిగిందనేది వాట్సప్ రకరకాల దృశ్య - శ్రవణ చిత్రాలే చెబుతాయి! ఏ వయసు వాళ్ళు నేలమీద చతికిలబడి ఏ గడ్డి చెక్కి శుభ్రం చేశారో - ఎవరు సైడు కాలువల్లో ప్లాస్టిక్ గ్లాసులు, సీసాలు ఏరారో- ఎండు చెట్టును ఎవరు మోసుకెళుతున్నారో – హుషారైక్కువై చెత్త డిప్పల్నెవరు కొత్త భంగిమల్లో ట్రాక్టర్ పైకి విసిరారో – వాటిని చాకచక్యంగా పట్టి, ట్రక్కులో త్రొక్కి ఎవరు సర్దారో – ఏ సుందరీకర్తలు బాహ్య ప్రపంచాన్ని మరచి, రహదారి మార్జిన్లనెలా క్షుణ్ణంగా శుభ్రపరిచారో
- ఆసక్తి ఉన్న వాళ్లందులోనే చూడగలరు!
నేను మాత్రం ఈ 29 మందిలో ఎవరి బట్టలు చెమటల్తో ఎంతగా తడిసిందీ, చేతులకు - ముఖాలకూ ఎంత దుమ్మంటుకొన్నదీ గమనించాను.
ఈ సుదీర్ఘమైన – దైనందిన శ్రమదాన ధారావాహికలో నేటి ఎపిసోడ్ 6.10 కీ, కాఫీ పురస్కారాలు 6.20 కీ ముగిసి, నేటి శ్రమ సమీక్షా సమయంలో- అది పాగోలైనప్పటికీ – చల్లపల్లి స్వచ్చ - సుందర – శుభ్ర సాధనా సంకల్పాన్ని ముమ్మారు వినిపించింది పాగోలు దుర్గా ప్రసాదు! భర్తృహరి నీతి శ్లోక సారాంశాన్ని తెలుగులో వివరించింది గురవయ్య నామధేయుడు!
ఇక్కడ మరో రెండు ఆసక్తికరమైన - ఆచరించక తప్పని ఆదర్శాలు:
1) వక్కలగడ్డలో పరుచూరి నాగరత్నం గారి పెద్ద కర్మను కుమారులు, మనుమరాలు ప్లాస్టిక్ రహితంగా – పర్యావరణ హితంగా నిర్వహించడం.
2) యార్లగడ్డలో - హనుమంత - శ్రీనివాసరావులు తమ మాతృమూర్తి కర్మకాండల సందర్భంగా - బంధుమిత్రులకు చక్కని సంచిలో పూల – పండ్ల మొక్కల సహితంగాను (వీటిని లాభాపేక్ష లేకుండ అందించినది – తాతినేని రమణ!) జ్ఞాపికలందజేయడం.
మూడవ విశేషం - షరామామూలుగా శాస్త్రి గారి బిస్కెట్ల పంపకం!
రేపటి వేకువ సైతం మనం కలుసుకొని సుందరీకరించవలసింది ఇదే పాగోలు సమీపం రహదారే!
- ఈ స్వచ్చ సుందరోద్యమం -
అపప్రదలను ఆపుకొంటూ - అడ్డుపుల్లలు దాటుకొంటూ –
హేళనలు జీర్ణించుకొంటూ - తప్పటడుగులు దిద్దుకొంటూ –
అవిఘ్నమస్తని పించుకొంటూ – వేల దినముల అనుభవంతో
దిగ్విజయముగ - ఉదాహరణగ – దివ్య సుందర ప్రవర్తకముగ!
- నల్లూరి రామారావు,
30.08.2022.