స్వచ్చ చల్లపల్లి ఉద్యమం మొదలు పెట్టిన రెండు, మూడు నెలలలోనే బైపాస్ రోడ్డును సుందరీకరించే పనులను కార్యకర్తలు మొదలు పెట్టారు. బైపాస్ రోడ్డు కి, డ్రైను కి మధ్య భాగమంతా దట్టమైన కలుపు మొక్కలతోనూ, చెత్త తోనూ నిండి ఉండేది. ఎన్నో రోజులు కష్టపడి ఆ మొక్కలను, చెత్తను స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలు శుభ్రం చేశారు.
ఆ సమయంలో ఈ ప్రాంతంలో నారాయణ రావు నగర్ బోర్డు కనిపించింది. “ఈ బోర్డు ఉన్నట్టు మాకే తెలియదని” అప్పటి E.O. గా ఉన్న దాసి సీతారామయ్య గారు నవ్వారు. ఆ తరువాత బైపాస్ రోడ్డంతా కొత్త మట్టి వేయించి, పూల మొక్కలతో తోటలను తయారు చేయించి, మెష్ వేయించి ఒక తోట మాలితో ఈ తోటలను నిర్వహించడం జరుగుతూ ఉంది.
కొంత భాగాన్ని తోటలుగా తయారు చేయించడానికి అయ్యే ఖర్చు కోసం అంజనా కంటి ఆసుపత్రి నిర్వాహకులు డా. రవీంద్రనాథ్ గారు సాగర్ టాకీస్ లో జరిగిన 600 వ రోజు వేడుకలో లక్ష రూపాయలు విరాళం కూడా ఇవ్వడం జరిగింది.
పూల మొక్కలతో డ్రైనేజి కనపడకుండా బైపాస్ రోడ్డు సుందరంగా కనిపిస్తున్నది.
ఎంతో మంది కార్యకర్తల శ్రమ, దాతల విరాళాలు, గ్రామ పంచాయితీ సహకారం ఈ అభివృద్ధికి కారణాలు. వీరందరికీ అభివందనములు.
ఆ తరువాత కొద్ది రోజులకు కోటేశ్వర రావు మాష్టారు గ్రామంలోని కొన్ని వీధులకు సిమెంటు బోర్డులు చేయించి నాటించారు. నారాయణ రావు నగర్ రహదారి అని ఈ ప్రాంతంలో నాటించిన సిమెంటు బోర్డు పడిపోతే మన స్వచ్చ కార్యకర్తలు చక్కగా సరి చేశారు.
నేటి స్వచ్చ కార్యక్రమం ముగిసిన తరువాత కార్యకర్తలు ఈ విషయాలన్నీ గుర్తు చేసుకున్నారు.
దాసరి రామ కృష్ణ ప్రసాదు
స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త
13.02.2020