2584* వ రోజు.......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!

2584*వ నాటి స్వల్ప సంఖ్యాక కార్యకర్తల కృషి.

          ఇది సోమవారం (7-11-22)., అది పాగోలు రహదారి, దాని నిడివి 1 కి.మీ. పైమాటే! ఒక ప్రక్కన స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తల ఎడతెగని శ్రమదానంతో రెండు ప్రక్కలా బారులు తీరిన రకరకాల రంగు రంగుల పూల సోయగం - విద్యుత్తీగల వైపున చిక్కని పచ్చదనం.

          “ఏదీ తనంత తానై నీదరికి రాదు

          శోధించి సాధించాలీ – అదియే ధీర గుణం...”

                   “కలకానిది - విలువైనది...” (వెలుగునీడలు)

          అనే శ్రీశ్రీ సినీ సాహిత్యానికనుగుణంగా ఈ దారంతా కొందరు సామాజిక కర్తవ్య పరాయణుల శ్రమదమార్జిత నయన మనోహరం!

          అక్కడికి 4.20 కి చేరింది రాటు తేలిన ముగ్గురు స్వచ్చ కార్యకర్తలు - వాళ్లకు కాస్త వత్తాసుగా ఇంకో ముగ్గురు అదే జాతి పక్షులు - ఇంకాస్త సమయానికి మరో ఇద్దరు పెద్దోళ్లు! తొలి ముగ్గురు సాధించినదేంటో చూద్దాం!

          గతవారం ప్రతి వేకువా పాతిక - ముప్పై - నలభై మంది కార్యకర్తల కృషి ఫలితంగా వీధంతా సర్వాంగ సుందరంగా ఏమీ మారిపోలేదు - యంత్రం తుక్కుచేయగా మిగిలిన ఎండు కట్టెలు, పుల్లలు, అందులో కొన్ని అడవి తంగేడు ముళ్ల కొమ్మలూ బాట పొడవునా మిగిలిపోగా వాటి సేకరణే నేటి కొద్ది మంది సాధించినది!

          పచ్చి తుక్కులాగా ఎండు కొమ్మలు ట్రాక్టర్లో అణిగి మణిగేం ఉండవు - ఆ మిడిసి పడే కట్టెల్ని లోడు చెయ్యడమూ, ట్రక్కులో సర్దడమూ చూసినంత సులభం కాదు - అందుగ్గాను వీళ్లలో ఒక స్పెషలిస్టున్నాడు! ఆల్ రౌండర్అనే నిక్ నేమ్ ఉందట అతనికి! ఎలాగైతేనేం - గంటన్నర కష్టించి - నడుం పట్టేసి కాబోలు - జాగ్రత్తగా ట్రాక్టర్  తోలుతున్న ఒక పెద్ద డాక్టర్ తోడ్పాటుతో వాళ్లు తామనుకొన్న పని పూర్తి చేశారు!

 

  *కొల్లా రాజమోహనుడు (చిలకలూరిపేట)*

జన చేతన రగులు కొలిపి - రైతుల శ్రేయస్సు కోరి -

ఆరోగ్యం లెక్కింపక అహరహమూ శ్రమిస్తున్న

కొల్లా రాజమోహనుడనే గొప్ప వైద్య శిరోమణి

ఎవరికైన మహాదర్శ మీతడు సాధించిన పని!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   07.11.2022.