కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమైన ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!
28 – 2586*- పాగోలు రహదారి!
09.11.2022 బుధవారం – వేకువ 4.24-6.12 నడుమ వేళ- NTR – మహాబోధి పాఠశాల ప్రాంతం – ఇవీ ఈనాటి వీధి స్వచ్చ – సుందరోద్యమ విశేషాలు!
చీకట్లో – చలి గాలిలో – వీధి కశ్మలాల్ని వెదుక్కుంటూ తొలుత అక్కడ అడుగు పెట్టిన 13 మంది కాక- నాలుగూళ్ళకు చెందిన మరో 15 మంది స్వచ్చ కార్యకర్తల కృషి సైతం ఇంచుమించు గత దినం జరిగిన చోటే – అనగా పెద్దబడి (H. స్కూల్) కేంద్రం గానే!
కరెంటు తీగల వైపున చెట్లను నరికిన వ్యర్థాలు చాల వరకు గత 10 రోజుల్లో తొలగిపోయినా, పిచ్చి- ముళ్ల- పచ్చిక గుబుళ్ల బెడద తప్పిపోయినా – ఇందరు ఈ వేళ అక్కడ సాధించిందేమిటి? అంటే :
మురుగు కాల్వల్లో ఏ బాధ్యతారహితులో విసిరిన ప్లాస్టిక్ సంచులు లేవా? చూస్తుండగానే దేశాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చిన రకరకాల 90-150-250 m.l సారా ఖాళీ బుడ్లు లేవా? ఏ సమీప గృహస్తులో ఉండలు చుట్టి డ్రైన్ లో వదిలిన పాత పరుపులూ, దిక్కు మాలిన ప్రాత గుడ్డ తుక్కులూ, బాగా నాని – బరువెక్కి- ఉబ్బి కనిపిస్తే కార్యకర్తలు తక్కిన ప్రజల్లాగా ఉపేక్షిస్తారా?
వీళ్లే ఈ బాటకిరు వైపులా నాటి – పాదులు తీసి- నీరుపోసి – పసి పిల్లల్లా చూసుకొంటున్న వందలాది మొక్కల్ని మాత్రం పరామర్శించవద్దా? రోడ్లకు గుంటలు పడినా, ఎక్కడ ఏ అంద విహీనత బైట పడినా, మురుగులు నిలిచి, కంపు గొట్టి, దోమల ఉత్పత్తి పెరిగినా.. అవన్నీ తమ బాధ్యతలే అనుకొనే స్వచ్చ కార్యకర్తలకు పారిశుద్ధ్య – సుందరీకరణ పనులు ఊళ్లో ఎక్కడైనా దొరుకుతూనే ఉంటాయి! మరో 8 ఏళ్ళైనా వీళ్ళ ఉద్యోగాలకు గ్రామస్తుల తరపున నాదీ హామీ!
అటు రహదార్లనీ, డ్రైన్లనీ, ఇళ్ల పరిసరాల్నీ తెలిసో తెలియకో మలిన పరచేవాళ్లూ – ఇటు తమ సంఖ్యా బలం తక్కువైనా ఒక్కో వీధి చొప్పున పరిశుభ్ర – సుందరీకర్తలూ గత ఎనిమిదేళ్లుగా ఎక్కడా తగ్గడం లేదు- ఇప్పటికైతే ఉభయులూ సమ ఉజ్జీలే!
ఈ వేకువ సైతం వీళ్ళు ప్రోగేసుకొన్న – ట్రాక్టర్ కెక్కించి చెత్త కేంద్రానికి చేర్చిన చెత్త సంపద ఒక పెద్ద ట్రక్కుకు సరిపడా! కాలుష్యం మీద పోరులో గ్రామస్తుల పక్షాన వీళ్లు అభినందనీయులు!
నేటి సమీక్షా సభలో కార్యకర్తల శ్రమజీవన సౌందర్యంతో బాటు రేపటి సజ్జా రాజేష్ సంస్మరణ సంగతి గుర్తు చేయబడింది.
స్వచ్చోద్యమం తొలి నాళ్ల నుండీ తోడ్పాటునందిస్తున్న వేమూరి అర్జున రావు గారు తన వంతుగా 2000/- విరాళాన్ని మేనేజింగ్ ట్రస్టీ గారికీనాడు ( అనగా ఇప్పటికీ మొత్తం 48000/-లన్నమాట!) అందజేయడమైనది. అందుకు మనందరి కృతజ్ఞతాభివందనాలు.
రేపటి వేకువ మన పునర్దర్శనా స్థలం మహాబోధి / NTR బడి తూర్పు ద్వారమే!
శ్రమ వితరణ విజయోస్తు
శరత్కాల గగనంలో చందమామ సాక్ష్యంగా
వీధి శుభ్రతల కోసం విసుగులేక- అలుపెరుగక
పాటుబడుచు తృప్తి చెందు స్వచ్చోద్యమ కర్తలార!
మీ సమయోచిత శ్రమ వితరణ జయప్రదంబగును గాక!
- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,
09.11.2022.