కేవలం ఒక్కసారికే పనికి వచ్చే - పర్యావరణ ధ్వంసకమైన ప్లాస్టిక్ ల వాడకం మానేద్దాం!
2587* వ వేకువ శ్రమదానం ముచ్చట్లు!
ఆ ముచ్చట్లను గూర్చి, ఈ గురువారం (10-11-22) 30 మంది విలక్షణ వ్యక్తుల క్రొత్త సందడి గూర్చి స్థూలంగా చెప్పాలంటే కూడ కాస్త గడువు తీసుకోక తప్పదు. షరామామూలుగానే - పాగోలు మార్గం మీదే – మహాబోధి - NTR పెద్దబడి కేంద్రంగానే – పైకి చర్వితచర్వణం గానే కనిపించే – క్రొత్త వాళ్లకి వింత గొలిపే – కొందరికి చూసి - చూసి నిల్వచింత పచ్చడనిపించే కొన్ని శ్రమజీవన సన్నివేశాల్ని ఎవరైనా “జై స్వచ్చ చల్లపల్లి” మాధ్యమంలో చూడవచ్చు.
ఆ మనుషులే – 3 వ వారంలో కూడ అదే ½ కిలోమీటరు రహదారినే ఏం ఉద్ధరిస్తారు? ఏం సుందరీకరిస్తారు... అని సుదూరస్తులు శంకించడం సహజమే గాని - మరి ఈ స్వచ్చ సుందర దైనందిన ఉద్యమమేమైనా సాధారణమా? ఎక్కడబడితే అక్కడ, ఎప్పుడుబడితే అప్పుడు పుబ్బలో పుట్టి హస్తలో ముగిసే సాదాసీదా విషయమా? జాగ్రత్తగా దగ్గరగా పరిశీలిస్తే దాని నిడివి ఎంతో - లోతెంతో తెలుస్తుంది. ఉదాహరణకు గత వారం రోజుల కార్యకర్తల పని పద్ధతే చూడండి:
- మొదటి విడతగా - అటు విద్యుత్ శాఖ వాళ్లు కసిగా చెట్లు నరుకుతారు – ఇటు కత్తీ - కటార్ల కార్యకర్తలు కూడ అవసరమైన కొమ్మల్ని సున్నితంగా తొలగించి ఆ చెట్లకు క్రమశిక్షణ నేర్పుతారు.
- రెండో దశలో డ్రైన్లలోని వ్యర్ధాల పని పట్టి – ఎండు కొమ్మలూ, ప్రాత గుడ్డలూ, ప్లాస్టిక్ తుక్కులూ కొందరు బైటకు రప్పిస్తారు.
- ఎక్కడ మొక్కల పాదుల్ని సవరించాలో, సారా సీసాల, ముదనష్టపు ప్లాస్టిక్ కవర్లను గోనె సంచుల కొద్దీ ప్రోగేయాలో కొందరు చూసుకొంటారు
- ఆ పైన చీపుళ్ల వారు రహదారికి ఇంకొన్ని మెరుగులు దిద్దుతారు.
- ఆఖరున జరిగే తుది మెరుగుల పని సుందరీకర్తలది.
మరి ఇన్ని రకాలుగా – ఊళ్ళో ముఖ్య వీధుల్నే గాక - శ్మశానాలనీ, బస్ ప్రాంగణాలనీ, 7 రహదార్ల శుభ్ర – సౌందర్యాల మన్నికనూ... చూచుకోవలసింది – పంచాయితీ పారిశుద్ధ్య కార్మికులతో బాటు స్వచ్చ కార్యకర్తలే గదా! అందుకే గదా ఒక్కో రహదారి వాళ్ల సమయాన్ని వారాల తరబడీ మ్రింగేసేది?
6.15 కి నేటి పని ముగింపు వేళ – కాఫీ కషాయ ఆస్వాదనానంతరం, ఈ నాటి సామాజిక శ్రమ సంగీత మహదానందాన్ని సోదర కార్యకర్తలతో పంచుకొంటూ మన స్వచ్చ – సుందర వైద్యుల వారు చెప్పిన క్రొత్త సంగతి - ఒకానొక గోదావరీ పరివాహక వ్యక్తి “అయ్ బాబోయ్! మీ సదూకొన్న పెద్దోళ్లు ఇన్నేళ్ల నుండీ ఈ వేకువ వీధి పనులు చేస్తున్నారండీ?” అని ఆశ్చర్యపడడం!
క్రొత్త వాళ్ళకేమో ఈ కార్యకర్తల సామాజిక బాధ్యతలు దిగ్ర్భాంతికరం! సదరు శ్రమ ఫలిత భోక్తలైన సొంతూరి మనుషులకేమో ప్రాతబడిపోయి, తమ ముంగిళ్లలో జరిగే శ్రమదానం పట్టకపోవడం!
నేటి గ్రామ సుందరోద్యమ సంకల్పాన్ని దీటుగా చాటి చెప్పిన పల్నాటి వీరుడు – ఆరోగ్యశాఖకు చెందిన భాస్కరుడు! మధ్యాహ్న సమయంలో కార్యకర్తలంతా సజ్జా వారి వీధికి చేరవలసి ఉన్నది!
రేపటి వేకువ మన పునర్దర్శనం మహాబోధి పెద్ద బడి ముఖద్వారం దగ్గర!
‘వ్యక్తికి బహువచనం శక్తని’
బాహ్య విసర్జనలు మానిపి - పచ్చపచ్చని చెట్లు పెంచి
ప్రతి వీధికి సౌందర్యపు పాఠాలను చెప్పి చెప్పీ
‘వ్యక్తికి బహువచనం శక్తని’ పదే పదే ఋజువు చేసే
ఓ శ్రమదానోద్యమమా! జోహారులు జోహారులు!
- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,
10.11.2022.