పర్యావరణ ధ్వంసకంగా - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్ ల వాడకం దేనికి?
2604* వ నాటి అర్థవంతమైన శ్రమ వేడుక.
ఔను – ఈ ఆదివారం వేకువ నుండి 6.30 వరకూ, మధ్యాహ్నం దాకా జరిగినది, జరుగుతున్నదీ నిజంగానే సార్థక శ్రమ జీవన వేడుక! జన జీవనంతో మమేకమౌతున్న డబుల్ ధమాకా! అలా తను శ్రమదానాన్ని సార్థకంగా-ప్రజోపయుక్తంగా మలుచుకొన్న కార్యకర్తలు 27+30 మంది!
వాళ్ల శ్రమ + సమయదానాలు డబుల్ ధమాకా ఎందుకైనవంటే:
మొదటిది – 9 ఏళ్లుగా-2604 రోజులుగా- లక్షోపలక్షల శ్రమ గంటలుగా చల్లపల్లి ఊరి స్వచ్ఛ-సౌందర్యాలకు అంకితులైన కార్యకర్తల క్రమం తప్పని వీధి పారిశుద్ధ్య ప్రయత్నం.
రెండోది – 20 ఏళ్లుగా, చల్లపల్లి కేంద్రంగా, పరిసర 30 కి పైగా ఊళ్ల అస్వస్తుల ప్రయోజనార్థంగా గోపాళం వారిచే నడుస్తున్న వైద్య శిబిరం.
రెండిటి పరమార్ధమూ ఒక్కటే! ఈ గ్రామ ప్రాంతాల జనంలో వ్యక్తిగత – సామాజిక చైతన్యం, ఆరోగ్య స్పృహ, వాస్తవ స్థితి గతుల పట్ల సదవగాహన కల్పించడమే!, అది ఉపన్యాసాల దంచుడుగా కాక- ఆచరణలో చూపడమే!
రెండోదాని ఫలితం 20 ఏళ్లుగా 30-40 గ్రామాల ఆర్థిక బలహీనులకు అండదండలు లభించడం. మొదటి స్వచ్చోద్యమం యొక్క ప్రయోజనమైతే కొంత పరిమితంగాను, మరింత దీర్ఘకాలిక అవసరంగాను కనిపిస్తున్నది.
4.20 కన్న ముందే విజయవాడ దారిలోని విజయా కాన్వెంటు దగ్గరకు చేరుకొన్న 27 మంది కార్యకర్తలు – తమకదేదో ఉగ్గు పాలతో నేర్చిన విద్యలాగా – గంటన్నరకు పైగా – ప్రభుత్వాస్పత్రి వైపున రోడ్డును ఊడ్చి, డ్రైను వ్యర్థాలు తొలగించి, ప్లాస్టిక్ దరిద్రాల పని బట్టి, బాటల అందాన్ని చెరుస్తున్న పిచ్చి-ముళ్ల మొక్కల్ని ఖండించి, చెట్లను సుందరీకరించి, పూల మొక్కల్ని పరామర్శించి, వాటి పాదుల్ని సవరించి.. 2604 వ రోజును ముగించారు!
మరి వీళ్లలో కొందరు చీపుళ్ల తో ప్రక్కనే విజయా కాన్వెంటు ఆవరణలో చొరబడి, అక్కడ మొదలు కాబోతున్న వైద్య శిబిర ప్రదేశాన్ని శుభ్రం చేసి, ఇతర సౌకర్యాలు అమర్చి బైటకు వెళ్లారు.
వైద్య శిబిరంలోనూ స్వచ్చ కార్యకర్తల హవా నడిచింది. 1200/ 1500 ల మంది ఆరోగ్య తరుగుదల వాళ్లకు మంచి జీవన శైలిని వివరిస్తూ – తిండి పద్దతులు ప్రకటిస్తూ – ఆరోగ్య అవగాహన పెంచుతూ – క్రమ శిక్షణ మప్పుతూ – 4 నెలలకు సరిపడా మందులందిస్తూ.. వాళ్ల 7/8 గంటల కృషి కొనసాగింది.
వీధి పారిశుద్ధ్య కృషి ముగిశాక- సమీక్షా సమావేశంలో:
1) ఎడమ చేతి వాటం రైతు సజ్జా ప్రసాదు గారు నిర్వివాదంగా ముమ్మారు సొంతూరి స్వచ్చ- సౌందర్య సంకల్ప నినాదాలు ప్రకటించడం,
2) బుధవారం వేకువ స్వచ్చంద శ్రమదాన స్థలం – నడకుదురు బాటలో -1 కి. మీ దూరాన “ రాజా వెంచర్స్” దగ్గర అనే సంగతి!
- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,
27.11.2022.