పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?
స్వచ్ఛ – సుందరోద్యమంలో 2615*వ శుభోదయాన :
కార్యకర్తలు ఆష్టాదశ కార్యకర్తలు గ్రామ ప్రవేశం దగ్గర – నడకుదురు బాటలో కొనసాగించిన కృషితో మరొక 50 గజాల రహదారి స్వచ్ఛ – సుందరీకరణం! 4.20 నుడి 6.12 దాక – 3 – 4 రకాల శ్రమ విన్యాసాలు!
డిశంబరు తొలి వారానికే చలి తీవ్రత కనిపించినా, ఆ రహదారి బారునా వీధి దీపాలు వెలగకపోయినా, పెళ్లిళ్ల – ప్రయాణాల వల్ల నేటి కార్యకర్తల సంఖ్య కాస్త బక్క చిక్కినా, RTC బస్సుల – ట్రాక్టర్ల – ఇసుక బళ్ల – ద్విచక్ర వాహనాల రాకపోకలు పెరిగి పనిలో చికాకు కల్గించిన అననుకూల వాతావరణంలో సైతం శ్రమ దాతల వీధి మెరుగుదల ప్రయత్నం ఆగలేదు!
10 పని దినాలు గడిచినా నడకుదురు రోడ్డులో కేవలం సగ భాగమే ప్రస్తుతానికి మెరుగయ్యింది. రాజా వెంచర్ – 1 వ కిలో మీటర్ రాయి దగ్గర నుండి పెద్ద వడ్ల మర దగ్గరి ‘డ్రైను వినాయక గుడి’ దాక మాత్రమే పని సాగిందంటే – అందుకు ప్రధానంగా అక్కడి 40 – 50 ఇళ్ల వారినే అభినందించాలి! ( 100, 150 గజాల బాట కిరు ప్రక్కలా ఊహించరానంత కశ్మలాలు విరజిమ్ముతున్నందుకు!)
కరెంటు శాఖ వారు సైతం తీగల కడ్డుపడతాయని – కొమ్మల్ని కాక చెట్ల మొదళ్ళను నరికి అక్కడే వదిలేస్తుంటారు. మరి ఇన్ని రకాల వ్యర్థాల పరిష్కారం స్వచ్ఛ కార్యకర్తల వంతు ! పాపం – కార్యకర్తలకేమో – అందరిలా ఇన్ని అస్తవ్యస్తతల్ని చూస్తూ ఊరుకోలేని బలహీనత! మరి అందుకే గదా- ఒక్కో రహదారి సుందరీకరణ నాలుగేసి వారాలు పట్టేది!
మంది తక్కువైనా – నేటి వేకువ నాల్గు రకాల శ్రమదానం యథా విధిగానే జరిగిపోయింది :
- చిన్న మట్టి దిబ్బను త్రవ్వి, ఆ మట్టిని రోడ్డుకు ఉత్తరం వైపు మార్జిన్ లో సర్ది బాటకు కల్పించిన రక్షణా కృషి నలుగురు కార్యకర్తలది,
- ఒక తాడి చెట్టు మొద్దును మోకుల సాయంతో లాగి, అందంగా అమర్చిన పనిలో నలుగురు,
-నేటి శ్రమదానంలో పాల్గొన్న ఇద్దరు మహిళా వైద్య సిబ్బంది బాటను ఊడ్చి శుభ్ర పరచడం,
- రోడ్డుకు దక్షిణం ప్రక్కన ఐదారు చెట్ల కొమ్మలు తొలగించి, కాస్తంత సుందరీకరించే వంతు ఏడెనిమిది మందిది!
గ్రామస్తులు ప్రేక్షక పాత్రను వదలి, తమతో బాటు ప్రత్యక్ష కార్యాచరణ లో కలిసి వచ్చే దాక – చల్లపల్లి స్వచ్ఛ – సుందర కార్యకర్తలూ – వాళ్ళ శ్రమ దానమూ చల్లగా వర్థిల్లాలని కోరుకొందాం!
6.25 కు మా జామ పళ్ల పంపిణీ పిదప, స్వచ్చ ముచ్చట్ల తరువార పౌరశాస్త్ర బోధకుడు వేముల శ్రీనివాసుడు స్వచ్ఛ – సుందరోద్యమ నినాదాలు పలికి, నేటి ఉషోదయ సమావేశాన్ని ఘనంగా ముగించాడు!
రేపటి మన శ్రమదానం ఇదే నడకుదురు రాదారిలో – మెహెర్ వడ్ల మర దగ్గర నుండి ప్రారంభించవచ్చు!
తొలి వెలుగుల జిలుగులు
చరిత్రలో అనేక మార్లు సామాన్యులె మాన్యులు
చడీ చప్పుడూ చేయని సాహసికులు – ధన్యులు!
స్వచోద్యమ ప్రవర్తకులె అందుకుదాహరణలు
తొమ్మిదేళ్ల ఉషః కాల తొలి వెలుగుల జిలుగులు!
- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,
08.12.2022.