2616* వ రోజు. ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం వద్దనే వద్దు!

శుక్రవారం నాటి శ్రమానందం సంఖ్య 2616*!

            ఆ సంఖ్యకు ఇప్పట్లో అలుపుదల గాని, నిలుపుదల కాని కనపడటం లేదు! పని దినాల సంఖ్య ఎందుకు ఆగుతుంది? నడకుదురు, అవనిగడ్డ, పెదకదళీపల్లె తదితర కొన్ని రహదార్ల నివాసులో ప్రయాణికులో వీధి కశ్మల ప్రక్రియను ఆపలేదు కదా; అందుకు ప్రతి చర్యగా ఈ పాతిక ముప్ఫై నలభై మంది పారిశుద్ధ్య శ్రామికులు తమ ప్రయత్నాన్ని నిలుపబోవడం లేదు కదా?

            ఈ వేకువ కూడ మబ్బు పట్టిన, తుఫాను ముందటి చలి గాలులు కొట్టిన 4.18 వేళకే నడకుదురు బాట అస్తవ్యస్తతలను సరిదిద్దేందుకు అక్కడికి చేరుకొన్న 21+4 మంది (నలుగురు అతిథులన్నమాట!) తమ ఉద్యోగం తాము చేసుకుపోయారు! స్థానికులు కొద్దిమంది వహించింది ప్రేక్షక పాత్ర!

            ఈ కొద్దిపాటి కార్యకర్తలు నేడు సైతం 100 గజాల రహదారిలో 3 రకాల వీధి బాగుదల పనులు చేపట్టారు. రోజుటి వలె చివరి 20 నిముషాలు చెత్త లోడింగు, డంపింగ్ కేంద్రానికి తరలింపు పనులు లేవు.

- నలుగురు సుందరీకర్తలు యదావిధిగా బాటకు దక్షిణాన ఇష్టం వచ్చినట్లు పెరుగుతున్న ఐదారు చెట్లకు కొంచెం అణకువ, పొందిక నేర్పారు.

- ఏడెనిమిది మంది నీళ్లు నిండిన డ్రైను అంచుల మీద ఈ నాటి తాజా వ్యర్ధాలనే క్రమ పద్ధతిలో పేర్చి, వాటి మీద ఆకులూ - రెమ్మలూ కప్పి కొంచెం క్రొత్తదనం చూపారు.

- ఈ 100 గజాల బాటనూ, మార్జిన్లనూ చీపుళ్లతో గంటన్నర ఊడ్చే పనేమన్నా చిన్నదా?

            వడ్లమిల్లుకు దగ్గర్లో - రోడ్డు దక్షిణాన కొలువు తీరి, రహదారి అందాన్ని వెక్కిరిస్తున్న పశువుల పేడ దిబ్బల సమస్యని ఎవరు పరిష్కరించాలి? ఈ కాస్త ఊరి భాగమేమో పాగోలు పంచాయతీలోనిది!

            అశోక్ నగర్, విజయనగర్ ల పెద్దలు నలుగురు శ్రమదానం చివర్లో వచ్చారు. చల్లపల్లిలో భూగర్భ మురుగు వ్యవస్థ నేర్పరచిన 3వ చోటు వారు! స్వచ్ఛ కార్యకర్తల సమక్షంలో రేపటి సూర్యోదయ వేళ ఐదారు లక్షల ఖర్చుతో నిర్మించిన సదరు ఆదర్శ వ్యవస్థను ప్రారంభించడం సమంజసమని వారి భావన!

            వారిలో ఒక విశ్రాంత బ్యాంకు మేనేజరు అర్జా రాజేంద్ర ప్రసాదు కార్యకర్తల చెవులకు ఇంపుగా ముమ్మారు స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలను వినిపించి, గ్రామ భూగర్భ మురుగు ఏర్పా టును అందరూ చప్పట్లతో స్వాగతించి 9.12.22 వ నాటి శ్రమ వేడుక ముగించారు.

            వీధి డ్రైను పై వెలసిన వినాయకుల వారి సాక్షిగా మరొక నాటి శ్రమదానం సార్థకమయింది.

            రేపటి వేకువ మన పరస్పర అభివాదం విజయనగర్ దగ్గరి బైపాస్ వీధిలోనే!

            అనుకోలేదీ చల్లపల్లి. 

గాలిమేడ కట్టనట్టి క్రాంత దర్శులుంటారని

స్వప్నాలను ఋజువు పరచు సాహసికులు వస్తారని

ఊరినిలా తీర్చిదిద్దు ఒరవడి సృష్టిస్తారని

ఆదర్శాలనుకొన్నవి ఆచరణలో చూస్తానని...!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   09.12.2022.