2618* వ రోజు.....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

గ్రామ స్వచ్చ సుందర జైత్ర యాత్రలో 2618* వ రోజు

            సోమవారం అనగానే అది మామూలు కార్యకర్తల శ్రమ దానం కాక ప్రత్యేక వ్యక్తుల శుభ్ర సుందరీకరణం అన్న మాట. ఈ వేకువ కూడా గంటన్నరకు పైగా నలుగురు కార్యకర్తల విభిన్న శ్రమదానం చోటుచేసుకున్నది.

            అది కమ్యూనిష్టు వీధిలో చివర ఉన్న ఒక విశాలమైన ఖాళీ స్థలం. ఎవరో కొట్టివేసిన ఎండు కొమ్మలు, నాలుగు ప్రక్కలా పెరిగిన పనికిమాలిన ఏవేవో మొక్కలు, అక్కడక్కడ గోడల వారగా మోకాలు ఎత్తున పెరిగిన గడ్డి అన్నీ ఈ గంటన్నర సమయంలో ఈ కార్యకర్తల చతుష్టయం చేతి కత్తులకు బలియై 6.15 సమయానికి దంతెలతో పోగులుగా మారి డిప్పలతో వ్యాను ట్రక్కు లోకి చేరి చెత్త కేంద్రానికి తరలిపోయినవి.

            అప్పటికి గాని ఈ కార్యకర్తలకు సంతృప్తి దక్కలేదు. ఊరిలోని ప్రధాన వీధులు సరే ప్రైవేటు స్థలం లోని కశ్మలాల పట్ల వీళ్లకింత అసహనం ఉండటం ఆశ్చర్యకరమే!

            ఇందుకే కాబోలు చల్లపల్లి స్వచ్చ కార్యకర్తలన్నా, ప్రత్యేక దళంగా ఈ కొద్ది మందికి గుర్తింపు వచ్చిందన్నా కారణం ఇదే!

            ఇదే సమయంలో ఇక్కడికి కొంత దూరంగా భారత లక్ష్మీ వడ్ల మర వీధిలో ట్రస్టు కార్మికుల శుభ్ర-సుందరీకరణ కృషి సమాంతరంగా జరుగుతున్న విషయం గమనించారా? ఇలా ఇన్ని ప్రత్యేక చర్యలతోనో గదా ఈ స్వచ్చోద్యమ చల్లపల్లి ఈ ఎనిమిది- తొమ్మిదేళ్ల తరువాత ఇంత శుభ్ర సుందర -మనోహరంగా ఎక్కడెక్కడి వారిని ఆకర్షిస్తున్నది! 

 

            6.20 సమయంలో కస్తూరి శ్రీనివాస నామధేయుని స్వచ్చ సుందర సంకల్ప నినాదాలతో వీళ్ల నేటి కృషి పరిసమాప్తం!

      శ్రమదానం చూడరండు!

స్వచ్చ శుభ్ర స్వప్నాలను సామాజిక బాధ్యతలను

కలలు నిజం చేయగలుగు కర్మిష్టుల కదలికలను

చూడాలనిపిస్తుంటే స్వచ్చ చల్లపల్లిలోన

ప్రతి వేకువ జరిగే శ్రమదానం చూడరండు!

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   12.12.2022.