2620* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కుల వాడకం దేనికి?

2620* వ నాటి వీధి పారిశుద్ధ్యం!

            బుధవారం (14.12.2022) నాటి ఆ పారిశుద్ధ్య కృషి జరిగిందేమో నడకుదురు మార్గంలో. రకరకాలుగా ఆ పనులు చేసినదేమో 20 మంది. సమయం 4.21- 6.13 నడుమ. అనగా ఇంచుమించు 39 పని గంటలు.

            నడకుదురు బాటలో అటు పెద్ద వడ్ల మర, ఇటు మదర్ థెరిసా పాఠశాల ప్రాంతమంటేనే కాస్త ఎక్కువగా కశ్మలాలు ప్రోగులు పడే ప్రాంతం. అక్కడి గృహస్తులకు ఎక్కువగా గొర్లు, మేకలు, గేదెలు ఉండటమే ఇందుకు కారణం!

            ఈ  కొద్ది మంది కార్యకర్తలే రెండు మూడు రకాల శుభ్ర సుందరీకరణ చర్యలు పూర్తి చేశారు. తామే నాటి ఏడేళ్ళు పెంచిన పచ్చని తీరైన చెట్లను విద్యుత్ శాఖ కార్మికులు మొదళ్ళంటా నరికి పడేస్తే వాటి కొమ్మలను నరకడము కార్యకర్తల మనసులకు ఎంత బాధగా ఉంటుందో ఆలోచించండి. నరికిన కొమ్మలను వంట చెరకు నిమిత్తం ఇటు కార్యకర్తలకో లేక అడిగిన ఇతరులకో వంట చెరకుగా ఇచ్చి వేయడమూ,డ్రైన్ల లోని చిరు కొమ్మలను, రెమ్మలను, ఆకులను తొలగించి ట్రక్కులోకి లోడు చేయడమూ అది కూడా దట్టంగా మంచు కురిసే చలి వేకువలో చల్లపల్లి స్వచ్చ కార్యకర్తలకు కాక వేరెవరికైనా కుదిరే పనేనా?

            ఈ నడకుదురు దారి కాక ఇదే సమయంలో విజయవాడ మార్గంలో కూడా వీరిలోని నలుగురైదుగురు ఇంచుమించు ఇలాంటి సుందరీకరణ కృషినే కొనసాగించి వచ్చారు. (ఈ కార్యకర్తల కృషి అనంతరం ఇందుకు కొనసాగింపుగా 6.30 తరువాత ట్రస్టు కార్మికులు విజయవాడ రహదారిలో కష్టపడుతున్న విషయం గమనించండి).

            దంతెలతో కశ్మలాలను పోగు చేయడమూ, మిగిలిన కార్యకర్తల కృషికి సహకరిస్తూ చీపుళ్లతో బాటలను ఊడ్వడమూ యధావిథిగా జరిగే కార్యక్రమమే అనుకోండి!

            స్వచ్చ కార్యకర్త కోడూరు వేంకటేశ్వరరావు గారు యధావిధిగా తన నెల చందా 520/- ‘మనకోసం మనం’ ట్రస్టుకు జమ చేశారు.

            6.35 సమయంలో అప్పటికీ కురుస్తున్న మంచులోనే మంచి కాఫీని సేవించి లయన్స్ క్లబ్బు కు చెందిన కస్తూరి వరప్రసాద్ గట్టిగా ముమ్మారు నినదించిన స్వచ్చోద్యమ సంకల్పాన్ని కార్యకర్తలంతా పునరుద్ఘాటించారు.

            కార్యకర్తల పట్ల గౌరవంతో లంక ఏడుకొండలు గారు తన కుమార్తె వివాహ వేడుకలకు (పెదకళ్లేపల్లి రోడ్డులో గల వాసవీ కళ్యాణ మండపంఈ రాత్రికి) ఆహ్వానించారు.

            ఇది కాక, పామర్తి వేంకటేశ్వరరావు (రెవిన్యూ శాఖ ఉన్నతోద్యోగి) గారు కూడ తమ కుమార్తె తేజస్వి పెండ్లి వేడుకకు  ఇదే కళ్యాణ మండపం ఆదివారం రాత్రికి- సాదరంగా ఆహ్వానించి, మనకోసం మనం ట్రస్టుకు 10,116 /- రూపాయల విరాళాన్ని అందచేసినందుకు మన ధన్యవాదాలు.

            రేపటి మన వీధి సుందరీకరణం కూడ నడకుదురు బాటలోని మెహెర్ వడ్ల మర దగ్గరే మొదలుపెడదాం. 

   

          అడుగుజాడల కంజలించెద! 

సొంతదనుకొని, బాధ్యతనుకొని ఊరి నెవ్వరు కాపు గాసిరొ-

ఊరి జనముల అవసరాలకు ఇంతగా బాధ్యత వహించిరొ-

భావి తరముల సుగతి కోసం ప్రణాళికలు రచించుకొంటిరొ-

అట్టి స్వచ్చ శ్రమానందుల అడుగుజాడల కంజలించెద! 

- ఒక తలపండిన స్వచ్ఛ కార్యకర్త,

   14.12.2022.