ఒక ప్రముఖ వ్యక్తితో ఫొటో....

          ఒక రోజు ఓ.పి లో ఒకాయన నాతో పరీక్షలు చేయించుకొని ఇంటికి వెళ్లబోతూ సర్! మీరు ఫలానా వ్యక్తికి ఒక బహుమతి ఇచ్చారు గుర్తుందా? అని అడిగారు. ఛ! అంత ప్రముఖ వ్యక్తికి నేను బహుమతి ఇవ్వడమేమిటి అని నవ్వాను. నా దగ్గర ఆ ఫోటో కూడా ఉందండి అని ఆయన అన్నారు. అయితే ఆ ఫోటో వెంటనే తెచ్చి ఇవ్వరా అని ఆయన్ని ఆతృతగా అడిగాను. ఎన్నో సార్లు గుర్తు చేసిన తర్వాత ఒక సంవత్సరానికి గాని ఆయన ఆ ఫోటో తీసుకురాలేదు. ఎంతో విలువైన ఆ ఫోటోను నేను అపురూపంగా దాచుకొన్నాను.

            డాక్టర్ ని కాబట్టి పాఠశాలల వార్షికోత్సవాలకు అప్పుడప్పుడు అతిథిగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. చదువులో గాని, క్రీడలలో గాని మంచి ఫలితాలు వచ్చిన విద్యార్ధులకు బహుమతులను మాలాంటి అతిధుల ద్వారా ఇప్పించడం జరుగుతుంది. వారు ఆ ఫోటోను ఆ తరువాత కాలంలో చూపించి నాకు మీరు బహుమతి ఇచ్చినప్పటి ఫోటో అని సంతోషంగా చూపిస్తూ ఉంటారు.

            పై సంఘటన జరిగిన తరువాత నేను వెళ్ళిన ప్రతి పాఠశాలలోనూ నాతో బహుమతి తీసుకుంటునట్లు ఉన్న మీ ఫోటో ను దాచుకుని సంతోషించడం కాదు. మీతో దిగిన ఆ ఫోటోని నేను దాచుకోవాలనే స్థాయికి మీరు ఎదగాలిఅని చెబుతుండేవాడిని.  

            ఇంతకీ ఆ ప్రముఖ వ్యక్తి ఎవరో మీకు ఇప్పటికే అర్ధమయ్యే ఉంటుంది. పాతికేళ్లుగా ఛస్లో ఎన్నో విజయాలను సమకూర్చుకున్న శ్రీమతి కోనేరు హంపి. ర్యాపిడ్ ఛస్ ఛాంపియన్ షిప్లో నేటి ప్రపంచ విజేత. చల్లపల్లి లో జరిగిన ఛస్టోర్నమెంట్ లో మొదటి బహుమతి గెలుచుకున్న కోనేరు హంపి కి నా చేతులతో బహుమతిని ఇప్పించడం జరిగింది. బహుశా అప్పటికి ఆవిడ వయసు 9 సంవత్సరములు.  

           స్వచ్చ చల్లపల్లి’ 100 వ రోజు వేడుకలో నాటి బహిరంగ సభ వేదిక పైన ఆ అనుభవాన్ని వివరించాను.

డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

30.12.2019.