2711* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు మనం వాడవద్దు.

బెజవాడ రోడ్డులోనే 2711* వ శ్రమదానం!

            గురువారం (16.3.23) నాటి సమాచారం ఇది! వేకువ 4.17 కే 14 మంది సామాజిక శ్రమదాతల హాజరు! వాళ్లకు తోడైన మరో డజను మంది. (వీరిలో ఒక క్రమశిక్షణ గల సృజనాత్మక కష్టజీవి ఎందుకో గాని బాగా ఆలస్యంగా అక్కడ కాలు పెట్టినా - పనిలో మాత్రం వ్రేలు పెట్టలేదు!)

            ఈ వేకువ కూడ 4.17 - 6.12 వేళల నడుమ యధావిధిగా - చల్లపల్లి స్వచ్చోద్యమ సాంప్రదాయబద్ధంగా - వీధి పారిశుద్ధ్య నియమ - నిష్ఠానుగుణంగా- ఉసూరు మంటూనో, ఈసురోమంటూనో కాక ఒక వేడుకగా - కాస్తంత సృజన శీలంగా ఆలోచన గల వాళ్లకెంతో కొంత స్ఫూర్తిమంతంగా జరిగిన శ్రమదాన విశేషాలిట్లున్నవి!

            బెజవాడ రహదారిలో కార్యకర్తలు ఆగి, పనికి దిగింది చిన్న కార్ల షెడ్డుకు ఉత్తర దక్షిణ దిశల్లో! కార్యకర్తల్లో ఆరేడుగురికి బాగా కష్టించి పనిచేయడం నేర్పింది సదరు షెడ్డు దక్షిణ భాగాన ఉన్న చిన్నపాటి డంపు! సుందరీకర్తలు తమ నైపుణ్యం చూపింది ప్రధానంగా పడమటి చెట్ల దగ్గరా, రోడ్డు మార్జిన్ల వద్దా!

            మిగిలిన కార్యకర్తలు వీధి కశ్మలాల మీద ప్రతాపం చూపింది అట్టపెట్టెల కర్మాగారం అడ్డ రోడ్డు దాక! బాటకు తూర్పు, పడమర డ్రైన్లు కూడ ఆరేడుగురికి గట్టి పరీక్ష పెట్టాయి గానీ, అట్టల మిల్లు దారి ప్రక్క మురుగు కాల్వ మాత్రం ఇద్దరు కార్యకర్తల సహనాన్ని మరీ మరీ పరీక్షించింది. (అక్కడి చిట్టడివిని కత్తితో నరికి, ఏక బిగిన 45 నిముషాలు శ్రమించిన ఒక ఎడమ వాటం కార్యకర్త ఒళ్లంతా చెమటతో తడిసిన ఫోటోను వాట్సప్ చిత్రంలో గుర్తించండి!)

            తదేక దీక్షతో రహదారి మార్జిన్ల గడ్డిని కూర్చొని జరుగుతూ తొలగించి, ముగ్గురు శుభ్రపరచడాన్ని శ్రద్ధగా గమనించాను! వాళ్ళ ఇల్లు కాదు పెరడు కాదు - ఇంటి ముందు వీధైనా కాదు - ఈ బ్రహ్మ ముహూర్తాన ఇంట్లో హాయిగా పవళించే సమయాన - వీళ్లకెందుకీ శ్రమ? ఏల ఈ పంతం? ఊరి బాగుదల కోసం ఇంత ఉడుంపట్టా?.....” అని నాకనిపించింది! వెంటనే భర్తృహరి సుభాషితం గుర్తొచ్చింది!

            ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై  

            ఆరంభించి పరిత్యజింతురురు విఘ్నాయత్తులై మధ్యముల్  

            ధీరుల్ విఘ్న నిహన్య మానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై

            ప్రారబ్దార్ధములుజ్జగింపరు సుమీ! ప్రజ్ఞా నిధుల్ గావునన్

                                                (అనువాదం ఏనుగు లక్ష్మణ కవి)

[అల్లాటప్పా మనుషులు ఏమంచి పనీ ఆరంభించరు; కాస్త ఆశయాలున్న మధ్యములు ప్రారంభించినా కష్టాలెదుర్కోలేక వదిలేస్తారు; ధీరులు మాత్రం ఎదురు దెబ్బలకు రాటు తేలి తలపెట్టిన మంచి పని పూర్తిచేస్తారు!]

ఈ నాటి ఇంకొన్ని శ్రమదాన విశేషాలు :

- గోకుడు పారకు బదులు ఒకాయన ప్రయోగాత్మకంగా దంతెనే తిరగేసి రోడ్డు ప్రక్క గడ్డిని గోకి ఐదారు గజాల స్థలాన్ని శుభ్రపరిచారు!

- మరొకాయన కూని రాగంతో శ్రమ తెలియకుండా పడమటి డ్రైన్లో దిగి పని చేసుకు పోతున్నాడు!

- ఇద్దరేమో చెమట చిందిస్తూనే జోకులేసుకుంటూ పనికానిస్తున్నారు!

- ఊడ్చే వాళ్ల ముఖాల్లో కాస్త అలసట తప్ప - విసుగూ విరామమూ లేక బాటను శుభ్రపరుస్తున్నారు!

-  వ్యర్థాలను ట్రాక్టరులోకీ, ఆ తర్వాత చెత్త కేంద్రానికీ బట్వాడా చేసే పనిలో ఐదారుగురి సందడి సరే!

            ఇద్దరు ద్విచక్ర వాహన బాటసారులు అనుమానంగా ఆగి, ఒక నిముషం పరిశీలించి, ఎందుకైనా మంచిదని తమ దారిన తాము వెళ్లిపోయారు!

            K.C.P. వారి చెరుకు పెంపక స్థలంలో 6.25 కు కార్యకర్తలు అర్థవలయంగా సమావేశమై నూతక్కి శివబాబు ముమ్మారు గట్టిగా ప్రకటించిన స్వచ్చ - సుందరోద్యమ నినాదాలను పునరుచ్చరించి, అతని జీవన మార్గ సూక్తులను చాలవరకర్థం చేసుకొని, అదనంగా అడపా వాని సుదీర్ఘ సూక్తుల్ని కూడా విని, మొన్నటి దాక సహకార్యకర్త, 92 ఏళ్ళ వయోవృద్ద విశ్రాంత వ్యాయామోపాధ్యాయ శివరామకృష్ణుని ప్రేమపూర్వక అరటికాయల్ని స్వీకరించి, ప్రాతూరి శాస్త్రి గారి బిస్కట్లను అందుకొని ఏ 7.00 కో ఇళ్లు చేరారు!

            నేటి శ్రమదానానికి పొడిగింపు గానే రేపటి వేకువ మరొక మారు చిన్న కార్ల కార్ఖానా దగ్గరే మన కలయిక!

            సమగ్రంగా మార్చుచున్నది!

నా కుటుంబం ఇరుగుపొరుగూ గ్రామమిది నా బాధ్యతనుకొని

తోటి వాళ్లకు అవసరాలకు తోచినంత సహాయపడుతూ,

సమైక్యరాగము నాలపిస్తూ, స్వచ్చ సంస్కృతి ప్రోది చేస్తూ

సొంత ఊరిని స్వచ్చ సైన్యం సమగ్రంగా మార్చుచున్నది!   

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   16.03.2023.