ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ఏ ప్లాస్టిక్ వస్తువులనూ వాడం!
స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం –1929* వ నాటి రహదారి.
చలీ, మంచు తగ్గని ఈ వేకువ 3.59-6.20 నిముషాల నడుమ- పెదకళ్లేపల్లి మార్గంలో ద్విముఖంగా నిర్వహింపబడిన స్వచ్చంద శ్రమదానంలో పాల్గొన్న ఔత్సాహికులు 27 మంది.
వేంకటాపురం దగ్గర రోడ్డు పునర్నిర్మాణం కోసం ప్రభుత్వ ఒప్పందీకులు (కాంట్రాక్టర్లు) తొలగించిన తారు మార్గపు వ్యర్ధాలను ఈ మూడవ రోజు గూడ మన గ్రామ రక్షక (రెస్క్యూ టీం) కార్యకర్తలు ట్రాక్టర్ లో నింపి, తెచ్చి, బస్ స్టాండు ప్రక్కనున్న పెదకళ్లేపల్లి దారి మీద గల గుంటలను 4 చోట్ల సరిజేశారు.
మిగిలిన కార్యకర్తల్లో చాలా మంది చీపుళ్లకు, గొర్రులకు, కొంతమందికత్తులకు పని కల్పించి మద్యదుకాణం దగ్గర నుండి చల్లపల్లి దిశలో ఊడ్చి, పిచ్చి, నిరర్ధక మొక్కల్ని, గడ్డిని నరికి, పోగులు చేసి, ట్రాక్టర్ లో నింపి చెత్త కేంద్రానికి తరలించారు, తదేక దీక్షగా తమ పనిలో లీనమైన వీరిలో కొందరు 6.15 తరువాత కూడ వంచిన నడుములెత్తలేదు. ( ఈ చిన్న సమీకరణాన్ని గమనిద్దాం: గ్రామ జనాభా=25నుండి 27 వేల మంది. గ్రామాభ్యుదయం కోసం రోజూ తమ 2 గంటల సమయాన్నీ, శ్రమనూ –అవసరమైనపుడు ధనాన్నీ, వెచ్చిస్తున్న స్వచ్చ కార్యకర్తలు=27 మంది మంది-ఇప్పటికి రెండు లక్షలకు పైగా పని గంటలు: గ్రామస్తుల భాగస్వామ్య శాతమెంతో, అందుకొన్న స్ఫూర్తి లేశమెంతో లెక్కించుకోండి!)
- కార్యకర్తల నేటి శ్రమదాన సమీక్షా సమావేశంలో డాక్టరు రామ కృష్ణ ప్రసాదు గారు భూటాన్ దేశ ప్రేరణతో ఒక ఢిల్లీ విద్యార్ధిని యొక్క వీడియో ను ప్రస్తావించి, ప్రభుత్వ ఉద్యోగుల, ప్రజల బాధ్యతా నిర్వహణ ఎలా మెరుగుకాగలదో వివరించారు.
- తమ మనుమడు కొర్రపాటి అభినవ్ ఐదవ పుట్టిన రోజును మన స్వచ్చ కార్యకర్త వీర సింహుడు ఈ సమావేశంలోనే జరిపి, కార్యకర్తలకు మిఠాయిని, “మనకోసం మనం” ట్రస్టుకు 1000/- ను సమర్పించినందుకు ధన్యవాదాలు, శుభాశీస్సులు.
ఈనాటి కార్యకర్తల పట్టుదలను గమనిస్తున్న స్పందిస్తున్న నాకు 60 ఏళ్ల నాటి సినిమా గీతం గుర్తుకువచ్చింది.
....”నాటేదీ ఒక్క మొక్క-పెరిగేది పెద్ద చెట్టు
కొమ్మ కొమ్మ విరబూసి వేలాదిగా- ఇక కాయాలీబంగారు కాయలూ
భోంచేయలీ మీ పిల్ల కాయలూ....!
[తెనాలి రామ కృష్ణ చిత్రం-సముద్రాల రచనా-ఘంటసాల గానం]
6.40 నిముషాలకు ఆస్పత్రి నర్సు పెద్ద కృష్ణ కుమారి మొహమాటంతో - నవ్వుతో ముమ్మారు ప్రకటించిన గ్రామ స్వచ్చ - శుభ్ర - సుందర నినాదాలతో ఈ నాటి మన బాధ్యతలకు స్వస్తి.
రేపటి శ్రమదాన విశేషాలు కూడ ఈ పెద కళ్లేపల్లి మార్గంలోనే నిర్వహిద్దాం!
ఈ మహోన్నత గ్రామ వైఖరి!
ప్రొద్దువాలుకు దగ్గరయ్యే వృద్ధ మూర్తులు-స్త్రీలు-పిల్లల
అలుపెరుంగక చెమట చిందే స్వచ్చ సుందర కార్యకర్తల
సుదీర్ఘ-సార్ధక శ్రమ విరాళం రుచిని చూసీ కలవకున్నది
ఎంత ధన్యతొ-ఎంత ఘనతొ-ఈ మహోన్నత చల్లపల్లిది!
నల్లూరి రామారావు
స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త,
సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,
శనివారం – 22/02/2020
చల్లపల్లి.