2756* వ రోజు....... ... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

ఎడతెగని చల్లపల్లి స్వచ్చోద్యమంలో 2756* వ నాడు!

            వారం - బుధ; దినం - క్రీ.శ. 2023 లో మే నెల 3 వది! సమయం వేకువ 4.15! స్థలం బెజవాడ - బైపాస్ వీధుల కూడలి వద్ద ఠీవిగా నిలిచిన HDFC బ్యాంకు అవరణ! ఇక - అక్కడి నుండి 6.07 నిముషాల దాక - కేవలం 24 మంది తమ ఊరి కోసం శ్రమించిన వైనం!

            ఇది 9 దేళ్ల నుండీ ఏదో ఒక వీధిలో పాతిక ముప్పై - 40 మంది వదలకుండా చేస్తున్న మొండి ప్రయత్నమే! ఇంతకాలం గ్రామ వీథి కాలుష్యాల మీద పోరాడుతున్న స్వచ్ఛ కార్తలనబడే - ఊరి జనాభాలో 0.1 పర్సెంటుగాళ్లు కాని సదరు వీధి కశ్మల కారకులైన కొందరు గ్రామస్తులు కాని - ఉభయులూ తమ ప్రయత్నాలు విరమించడం లేదు! ఎవరి సహనానికెక్కడ పరిమితులున్నవో - అంతిమ విజయం ఎవరిదో - ఎప్పుడో కూడా అంచనా కందడం లేదు!

            ప్రాత సినిమాలో దేవదాసు వేదాంతంలాగా కుడి ఎడమైతే పొరబాటు లేదోయ్! ఓడిపోలేదోయ్!అని ఉభయులూ సర్ది చెప్పుకొంటున్నారేమో!

            ద్రవ్య నిధి(బ్యాంక్) కేంద్రంగా ఈ కొద్ది మంది శ్రమదాతలు ఏ మేరకు ఏం సాధించారని గుర్తుచేసుకొంటే:

1) కాలజ్ఞాని బ్రహ్మయ్య గుడి, మండలాభివృద్ది కార్యాలయం, రోడ్ల మీదికి చొచ్చుకొస్తున్న మాంస విక్రయ దుకాణాలు -  రెవిన్యూ కార్యాలయాల ఎదుట వెలసిన 4 తాత్కాలిక అంగళ్లన్నీ 6.10 సమయం గడిచాక శుభ్రంగా ఉన్నది కేవలం కార్యకర్తల శ్రమ వల్లనే!

2) HDFC బ్యాంకు ఉత్తర వీధి భాగము, పడమటి బెజవాడ రోడ్డూ నిన్న ఎలా ఉన్నదీ ఈ వేకువ 100 నిముషాల శ్రమదానానంతరమెట్లున్నదీ గమనించండి!

3) రోడ్లనూ మార్జిన్లనూ ఊడ్చింది ముగ్గురే గాని - ఆ 100 గజాల బాట ఇప్పుడెంత ముచ్చటగా ఉన్నది?

4) నా వ్రాతల నిజా నిజాలు - ఋజువులు కావలసిన వారు ఉదయ శంకర శాస్త్రి నివేదిత జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యంవాట్సప్ మాధ్యమ దృశ్య - శ్రవణ సాక్ష్యాలున్నవి చూడుడు!

5) వీరిలో నలుగురో ఐదుగురో ఇక్కడికి కిలో మీటరు దూరంగా - బందరు రహదారి మీద తడారిన డ్రైను మట్టి కంపులను భరిస్తూ ట్రాక్టర్ లోకెక్కించి - బంకు ప్రక్కన సచివాలయం పల్లంలో సర్దిన సంగతికీ సాక్ష్యమున్నది!

- 6.30 సమయంలో- తమ నేటి కృషి సమీక్షా కాలంలో సదరు బ్యాంకు సిబ్బంది తెల్లారేసరికి తమ కార్యాలయాల్లో కార్యకర్తల వల్ల వచ్చిన మంచి మార్పుకు  సంతోషించగా

- దేసు మాధురీ - ప్రభాకర దంపతుల 21 వ వివాహ, వార్షికోత్సవంలో కార్యకర్తలకు కేకులు; ‘మనకోసం మనంట్రస్టుకు 1000/- విరాళమూ లభించగా,

            రేపటి వీధి పారిశుధ్య ప్రయత్నం కూడ HDFC నుండే జరగవలెననే నిర్ణయంతో నేటి ప్రాభాత గ్రామ సేవ ముగిసెను.

            ఒక సుమనోజ్ఞ కావ్యం వలె

ఒక సుందర శిల్పం వలె - ఒక సుమనోజ్ఞ కావ్యం వలె

స-రి-గ-మ- వలె శ్రావ్యంగా - మృదు మృదంగ నాదంగా

గ్రామానికి ఆరోగ్యం - ఆనందం సాధనగా

చల్లపల్లి సౌభాగ్యం సాధించాలనే గదా!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   03.05.2023.