2757* వ రోజు....... ... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వాడనేల?

గ్రామ పారిశుద్ధ్య హీనతపై మరొక విజయ గాథ! - @2757*

            గురువారం (4-5-23) 4.20 వేకువ కాలపు సదరు యుద్ధభూమి అగ్రహారం దగ్గరి బెజవాడ బాటే! నేటి పాతిక మంది పోరాటయోధుల్లో తొలి వరస వాళ్లు 11 మంది; చుట్టపు చూపు కార్యకర్తలం ఇద్దరం; జరిగిన పారిశుద్ధ్య కృషి 2 -3 చోట్ల! పోరాట కాలం 2500 నిముషాలు!

            నేను గమనించిన తొలి దృశ్యం గంగులవారిపాలెం వీధిలో! బందరు రహదారి ప్రక్కన పంచాయతీ వారు తోడిన 3 రోజులు ఎండిన మురుగు మట్టిని భవిష్య దవసరాల నిమిత్తం నలుగురు కార్యకర్తలు తెచ్చి దింపుతున్న సన్నివేశమన్న మాట!

            స్వయంగా నేను చూసిన, తెలుసుకొన్న రెండవ పోరాట విషయం - అగ్రహారం వీధి మొదట్లో - అనగా వ్యవసాయ కార్యాలయం ప్రక్కన నిలవ మురుగు కంపు దగ్గర ఆరేడుగురు ఊడ్చి శుభ్రపరుస్తున్న పారల్తో ఎగుడు దిగుల్ని సరిజేస్తున్న - రకరకాల ప్లాస్టిక్ - మద్యం సీసాల్ని ఏరుతున్నది! (ఎలా జరిగెనో గాని ఇద్దరు కార్యకర్తల్ని చీమలు కసిదీరా కుట్టినట్లు తెలిసింది!)

            అక్కడి నుండి బెజవాడ బాటలో దక్షిణంగా డజను మందిది కశ్మలాల మీద సార్థక సమరం! వారిలో కుడి - ఎడమ చేతి వాటాల రైతులిద్దరిది కాస్త నిశ్శబ్ద పోరాటమైతే - ఒక భారీకాయుడివి అప్పటికే చెమటకు తడిసిన బట్టలు! ఇందులో ఇద్దరు దంతెల వారు!

            గంటన్నరకు పైబడిన పోరుతో - రహదారికి తూర్పు పడమరల మినీ ఉద్యానాలు, శ్రీమంతు క్లబ్బు పరిసరాలు గడ్డీగాదం, పిచ్చి మొక్కలు ఇతర వ్యర్ధాలు తుడిచిపెట్టుకు పోయినవి.

            కాకపోతే ఆ గతుకుల రహదారి మీద వాహనాల రద్దీ నడుమ కార్యకర్తల కృషి మాత్రం ఏ రోజైనా రిస్కుతో గూడినదే!

            మనం గతంలోనే ప్రస్తావించుకొన్నట్లు ఏ రోజైనా చల్లపల్లి స్వచ్చోద్యమంలో ప్రత్యేక గమనాంశమేమంటే చివరి 20 నిముషాల వ్యర్థాల లోడింగు సందడే! ఆ ఊపులో ఒక పెద్దాయన వాల్మీకి రామాయణంలోని జననీ జన్మభూమిశ్చ - స్వర్గాదపి గరీయసి...వంటి శ్లోకాన్ని చెప్పేశాడు - ఇద్దరేమో నాటు తెలుగు సామెతలు పలికారు.

            నా వరకు నాకర్ధమయిందేమంటే - ఈ సుదీర్ఘ చల్లపల్లి సార్థక స్వఛ్ఛ సుందరోద్యమం అర్ధం తెలియని శ్రాద్ధ కర్మకాండ కాదనీ ఒక సార్థక, సజీవ, ప్రయోజనకర చర్య మాత్రమేననీ!

            HDFC బ్యాంకు ఆవరణలో ముందుగా ఒక వామ పక్ష నాయకుడు - యద్దనపూడి మధు ముమ్మారు స్వగ్రామ స్వచ్ఛ - సుందర - శ్రమదానోద్యమ సంకల్ప నినాదాలు ప్రకటించగా -

            డాక్టర్ దాసరి రామకృష్ణుల వారు ఎప్పటిలాగే నేటి పాతిక మంది కఠినతర కృషిని అభినందించగా....

            రేపటి వేకువ కూడ వరుణుడి ఉనికి నేపథ్యంలో బైపాస్ వీధి శుభ్రత కోసం -

            HDFC బ్యాంకు దగ్గరే మన కలయికగా నిర్ణయించారు.

            చల్లపల్లి స్వచ్చోద్యమం

తొలి దినాల అంచనాలు తొందరగా అధిగమించి

మలి దశలో మనకోసం మనంట్రస్టు అవతరించి

చిన్నా - పెద్ద దాతల చేయూతలునూ లభించి

తొలి దశాబ్ది పూర్తి చేయ తొందర పడుతూ ఉన్నది!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త,

   04.05.2023.