ఒక ప్రవాసాంధ్రుని సాహసం! - నాదెళ్ల సురేష్ ....           11-Oct-2024

 ఒక ప్రవాసాంధ్రుని సాహసం!

         ఎక్కడ అమెరికా? ఎక్కడ ఒక మారుమూల చల్లపల్లి? అక్టోబరు 3 వ తేదీన 106 కిలోమీటర్ల మహా పరుగు కోసం కనెక్టికట్ నుండి న్యూజెర్సీ వైపు బయల్దేరిన ఒక వ్యక్తి ఒంటి మీద “జై స్వచ్చ - సుందర చల్లపల్లి”  అనే గుడ్డ బ్యానర్ కనిపించడమేమిటి?

         35 డిగ్రీల మండుటెండలో ఆ వ్యక్తి తన గ్రామాభ్యుదయమే లక్ష్యంగా సదరు పరుగును ఎలా పూర్తిచేశాడు?

         మెరుగైన జీవన వికాసం కోసం వెదుకులాటలో పాతికేళ్ల క్రితం అమెరికాలో స్థిరపడిన నాదెళ్ల సురేశ్ అక్కడ ఇళ్ల మీద ఇళ్లు కొనక - వ్యాపారంలో కోటాను కోట్ల డాలర్లు గడించక -  పదేళ్ల నుండి జరుగుతున్న స్వచ్ఛ-సుందర-ఆనంద- అభ్యుదయ చల్లపల్లి కోసం ఇంతగా అంకితుడైపోవడమా? ఇన్నిన్ని ఆర్థిక భారాలు మోయడమా?

         తన శక్తియుక్తుల్నీ, సంపాదననీ, సమయాన్నీ చల్లపల్లికి సమర్పించుకోవడమా?

         చల్లపల్లి వచ్చిన ప్రతిసారీ, ఎక్కడ స్వచ్ఛ కార్యకర్తలు ఊరి కోసం శ్రమిస్తున్నారో తెలుసుకొని, వాళ్లతో కలిసి మట్టి - బురద పనులకు దిగడమా?

         తన ఎక్కడ ఉన్నా సరే స్వచ్ఛ కార్యకర్తల కోసం పనుముట్లో, హెడ్ లైట్లో – మామిడి పండ్లో పంపుతూనే ఉండడం?    

         సొంతూరి పట్ల ఇంత నిబద్ధత, శ్రమదాన విజయం పట్ల ఇంత ప్రగాఢ విశ్వాసమూ ఎలా కుదిరాయని ఆరా తీస్తే ఆయన సమాధానం :

         “ఇంత మంది పదేళ్లుగా చేస్తున్న అద్భుత శ్రమత్యాగం ముందు - వాళ్ల దృఢ నిశ్చయం ముందు నా సహాయ సహకారాలొక లెక్కా?” అని.

         నేనైతే చాలా మార్లు సందిగ్ధంలో పడుతుంటాను – “పద్మావతి, డి.ఆర్.కె, గురవారెడ్డి, శివన్నారాయణ, వరప్రసాదరెడ్డి వంటి వారో – చల్లపల్లి స్వచ్చ కార్యకర్తలో - ఎవరు ఎవరికి ప్రేరణ? ఎవరి నుండి ఎవరికి స్ఫూర్తి అని?”

         చివరికి నేను తేల్చుకొన్నదేమంటే - “ఇటు కార్యకర్తలూ, అటు పైన పేర్కొన్న ప్రముఖులూ పరస్పరం ఒకరికొకరు స్ఫూర్తిదాయకులనీ, వాళ్ల ఉమ్మడి కృషితో ఈ చల్లపల్లి ఎప్పటికైనా రాష్ట్రానికీ - దేశానికీ దిక్సూచి కాగలదనీ!”

శుభమ్  భూయాత్!

- నల్లూరి రామారావు.

   11.10.2024 

Bill Odendahl (కోచ్) తో సురేష్ గారు