DSP గారి మెప్పుపొందిన క్రమశిక్షణ!....           06-Nov-2024

 DSP గారి మెప్పుపొందిన క్రమశిక్షణ!

          “దయచేసి-ఈ తాళ్ళు దాటుకొని ఎవరూ రావద్దు” అని సెక్యూరిటీ ముఖ్యాధికారి ఐన DSP గారి హెచ్చరిక!

          “ఈబలమైన తాళ్లతోనూ 10 మంది పోలీసులతోనూ అవసరమే ఉండదు. నిలుచున్న చోటు నుండి మా కార్యకర్తలు కదలనే కదలరు” అని చెప్పాను.

          ఆరేళ్లనాడు-2018 లో చంద్రబాబు గారి స్వచ్చ చల్లపల్లి సందర్శన సమయంలో డంపింగ్ యార్డులోని సంభాషణ ఇది!

          ఆ ఉన్నతాధికారి ముఖంలో ఆందోళన! ఈ 150 మంది కార్యకర్తలం వారితో ఫోటో దిగేందుకు అక్కడ నిలబడి-CM గారు వచ్చీ రాగానే ఉత్సాహంతో వెళ్లి చుట్టు ముడతారేమో అని పోలీసు వారి కంగారు-

          గంటన్నర పాటు అలా నిల్చొనే మేం వేచి ఉన్నప్పుడు ఇలాంటి సంభాషణ మళ్లీమళ్లీ జరుగుతూనే ఉన్నది!

          చంద్రబాబు గారు హెలికాఫ్టర్ దిగడమూ, డంపింగ్ కేంద్రంలో మేము నిర్మించిన ‘చెత్త నిర్వహణ షెడ్డును పరిశీలించి, చిరునవ్వుతో చిల్లలవాగు గట్టు మీదున్న మావద్దకు వచ్చి, గ్రూప్ ఫొటో దిగడమూ, మాతో సంభాషించి, సభావేదిక వద్దకు వెళ్ళడమూ 10 నిముషాల్లో ముగిసింది!

          ఆ సమయంలో ఒక్క కార్యకర్త కూడ ఒక్కడుగు కదిల్చితే ఒట్టు! హడావిడి లేదు-తొక్కిసలాట లేదు! పోలీసులకూ, తాళ్లకూ పనే పడలేదు!

          వెళ్తూ DSP గా రన్న మాటలు-“నిజమే డాక్టరు గారు! ఇందరు కార్యకర్తలు ఇంతసేపు-ఇంత క్రమపద్ధతిలో ఉంటారంటే నమ్మలేకపోయాను! ఎన్నో బందోబస్తులు చేశాం-కాని ఇంత సాఫీగా రోప్ టీం అవసరం లేనంతగా-CM గారి కార్యక్రమం ముగియడం ఇదే మొదటి సారి!”

          శ్రమదానంలోను, ఇతర ఫంక్షన్లలోను కార్యకర్తల క్రమశిక్షణ నాకు క్రొత్త కాదు గాని-ఈ ఆరేళ్లలో ఎప్పుడు క్రమశిక్షణ అనే పదం విన్నా నాకు ఆ సంఘటనే గుర్తొస్తుంది.

- డా. దాసరి రామకృష్ణ ప్రసాదు

   05.11.2024.