ప్రస్తుతం ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ విశ్రాంత ఉద్యోగ పెద్దల సంఖ్య గణనీయంగా ఉంటున్నది. 60 ఏళ్లు దాటిన వీరిలో మరో 10-15 ఏళ్ల పాటు శారీరకంగా ఆరోగ్యంగా ఉండే వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటున్నది. వీరంతా తమ దినచర్యలతో పాటు ఒక గంట సేపు తమ చుట్టూ ఉన్న సమాజం కోసం సమయదానం, శ్రమదానం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. శారీరక, మానసిక, సామాజిక ఆరోగ్యం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది.
న్యూజిలాండ్ లో క్రైష్ట్ చర్చ్ అనే అందమైన పట్టణంలో విశ్రాంత ఉద్యోగులంతా 4 గంటల సేపు ‘తోట పనులు’ (గార్డెనింగ్) చేస్తుండడాన్ని గమనించి ఆశ్చర్యపోయాను. ఆ పట్టణం అంతా మొక్కల పూలతో సుందరంగా ఉంటుంది.
మన చల్లపల్లి సుందరీకరణ శ్రమదానంలో కూడా రోజూ గంటన్నర పాటు శ్రమిస్తున్న 30-40-50 మందిలో 3 వ వంతు మంది ఇలాంటి పెద్దలే సొంతూరి కోసం పాటుబడడం చూస్తే సంతోషంగా ఉన్నది.
ఒరిస్సా రాష్ట్రం బాలాసోర్ లోని విశ్రాంత ఉద్యోగులు 107 మంది గత 684 వారాలుగా ప్రతి ఆదివారం 2 గంటల సేపు శ్రమదానం, సమయదానం చేస్తూ ఊళ్ళ, దేవాలయాల, పాఠశాలల పరిశుభ్రత కోసం, పర్యావరణ రక్షణ కోసమూ పాటుపడుతున్న శుభవార్తను నేటి ప్రజాశక్తి పత్రికలో చదువుతుంటే సంతోషంగానూ, భవిష్యత్తు పట్ల ఆశాజనకంగానూ అనిపించింది.
- దాసరి రామకృష్ణ ప్రసాదు
02.12.2024.