చల్లపల్లి స్వచ్ఛ – సుందరోద్యమానికి ఉత్తరాంధ్ర సన్మానం!....           20-Jan-2025

 చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమానికి ఉత్తరాంధ్ర సన్మానం!

         అది విశాఖ తీరంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ అంబేద్కర్ సభా స్థలం. వేదిక పైన వివిధ రంగాల నిష్ణాతులైన అందె శ్రీ, మొహుయుద్దీన్, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, బ్రహ్మానందం వంటి ప్రముఖులు. వేదిక ముందు వందలాది సహృదయులు. గత 20 ఏళ్లలాగే యార్లగడ్డ లక్ష్మీ ప్రసాదు గారి ‘లోకనాయక్ ఫౌండేషన్’ తరపున NTR - ANR ల వర్ధంతి, శతజయంతుల జ్ఞాపకంగా 6 గురికి జీవన సాఫల్య పురస్కార ప్రదానం!

         ఇంత మంచి వాతావరణంలో చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తల ప్రతినిధి ప్రాతూరి ఉదయ శంకరుల వారికి ఘన సన్మానమూ, లక్ష రూపాయల బహూకరణమూ! అంతకు ముందు వేదిక యవనికపై ప్రదర్శించిన 3 నిముషాల వీడియో గాని, లక్ష్మీ ప్రసాదు గారి ఉపోద్ఘాతము గాని ఆ  సభలో ఉత్సుకత పెంచాయి!

         శాస్త్రి గారికిచ్చిన 2 ½ నిముషాల వ్యవధిలోనే చల్లపల్లి సుదీర్ఘకాల శ్రమదానం గురించీ, ఫలితాల గురించీ వివరించవలసి వచ్చింది!

         “ఒక మహిళా వైద్యురాలు తన చల్లపల్లి కోసం నగల్ని తెగ నమ్మిన విషయాన్ని” లావు రుద్రమదేవి గారు ప్రస్తావించినపుడు చప్పట్లు గట్టిగా వినిపించాయి.

         స్వర్ణభారతి ప్రతినిధి దీపా వెంకట్ గారు ప్రసంగ వశాత్తూ అనిన “ఎవరైనా తాము చేసిన మంచిని ఎందుకు చెప్పుకోవాలి?

         “వాళ్ల పనులే వాళ్ళను గురించి మాట్లాడాలి గాని”

         అనిన వాక్యాలు మన స్వచ్ఛ కార్యకర్తల పద్ధతికి చక్కగా వర్తిస్తాయి అని నాకనిపించింది.

         ఏ ఆర్భాటం, అట్టహాసం లేకుండా దశాబ్దానికి పైగా చల్లపల్లిలో జరుగుతున్న విశిష్ట సామాజిక శ్రమదాన సందేశం ఆ విధంగా విశాఖపట్నంలో ఆవిష్కృతమయింది.

         3 దఫాలుగా ఆరేడుగురు జిజ్ఞా సాపరులు నా ప్రత్యేక ‘స్వచ్ఛ చల్లపల్లి’ ఆహార్యం చూసి, నా వద్దకు వచ్చి, పదేళ్ల శ్రమదాన సేవల గురించి వాకబు చేశారు.

         ఇందరు కవులూ, కళాకారులూ, సామాజిక సేవకుల్ని ఇన్నేళ్లుగా సన్మానిస్తున్న లక్ష్మీప్రసాదు గారు అభివందనీయులు.

         తాము స్వయంగా వచ్చి చల్లపల్లిలో క్షేత్రస్థాయిలో ఆ ఉదమాన్ని చూస్తామని వారు శాస్త్రి గారితో అన్నారు.

         చూద్దాం - ఎన్ని గ్రామాల్లో, ఎన్ని జిల్లాల్లో ఇకముందు ఈ శ్రమదానం విజయవంతం కాబోతున్నదో! రెక్కలు ముక్కలు చేసుకొంటూ తాముంటున్న ఊరును తీర్చిదిద్దుతున్న కార్యకర్తల ఆశయమూ, పద్మావతీ రామకృష్ణ ప్రసాదు దంపతుల భారీ సమయ - మేధో - అర్థ దాతృత్వమూ తెలుగు రాష్ట్రాల్నీ, దేశాన్ని ఎంత వరకు ప్రభావితం చేయగలవో!

- నల్లూరి రామారావు

  20.01.2025.