అగిరిపల్లి ఆనందలోయలో చల్లపల్లి శ్రమదాతల యాత్రా విహారం.
ఆ పాఠశాల పేరే హ్యాపీ వాలీ స్కూలు! ఆ సువిశాల ప్రాంగణం అడుగడుగునా సరస్వతీ చరణ కింకిణులనిస్వనాలు! లక్షల కొద్దీ మొక్కల, వృక్షాల పచ్చందనాలు! దూరం నుండి భవనాలు చూసినా, లోపలి గదుల్ని తిలకించినా శిల్పాభిరామాలు! K.K.R. తదితరుల మేధో విన్యాసాలు! ఈ అద్భుత ఆనంద ప్రపంచంలో 45 మంది స్వచ్ఛ సుందర కార్యకర్తల 4 గంటల విహరణలు!
25.1.25 శనివారం ఉదయం 8.30 – రాత్రి 7.30 దాక జరిగినది స్వచ్ఛ సైనికుల ప్రప్రథమ విహారయాత్రేమీ కాదు. తమ ఊరి వీధుల సర్వతోముఖ మెరుగుదల కోసం పది - పదకొండేళ్ళుగా శ్రమిస్తున్న సదరు కర్మిష్టులు ఆటవిడుపుగా ఇలాంటివి అప్పుడప్పుడూ చేయడం పరిపాటే!
దానికి తోడు హ్యాపీ వ్యాలీ పాఠశాల నిర్వాహకులు చల్లపల్లి పారిశుద్ధ్య శ్రమకారులకు పంపిన ఆత్మీయ ఆహ్వానం! 12:00 కు అక్కడికి చేరుకొన్న స్వచ్ఛ - సుందరీకర్తల బృందం తొలుత భవిష్యదున్నతోద్యోగినులైన చిన్నారుల స్వాగత మందుకొన్నది. గంటన్నర పాటు విద్యార్థినులతో కలిసి, స్వచ్చ రథసారధుల, కొసరాజు కోటేశ్వర మహోదయుల ప్రసంగాలను విన్నది.
మధ్యాహ్న భోజనానంతరం జలపాత సౌందర్యాలనూ, చలన చిత్ర ప్రదర్శనశాలనూ, ఊహకందని ఆకృతులతో వందలాది శిల్పాలనూ, తరగతి గదుల్నీ, కార్యాలయాల్నీ పరిశీలించారు. K.KR గారి కళారాధనకు ముగ్దులయ్యారు. 400 మంది ఒకే మారు భోంచేయగల భోజనశాలలో అల్పాహార తేనీటి విందునాస్వాదించారు.
వెలుపలి ప్రవేశద్వారం వద్ద వీడ్కోలు సమావేశంలో పాఠశాల యాజమాన్యంతోబాటు గ్రూపు ఫోటో దిగారు. ఆ విధంగా అగిరిపల్లిలో స్వచ్చ చల్లపల్లి పతాకం ఎగిరింది. అక్కడ మరొకమారు స్వచ్చ కార్యకర్తల శ్రమోద్యమాశయం నందేటి శ్రీను కంఠం నుండి మారు మ్రోగింది!
హ్యాపీ వ్యాలీ పాఠశాల ఆతిధ్యం కార్యకర్తల మనుసుల్లో నిలిచిపోయింది!
- నల్లూరి రామారావు
26.01.2025.