సాకారమౌతున్న స్వచ్ఛ కార్యకర్తల 2 స్వప్నాలు!
11 ఏళ్ళ స్వచ్ఛ-సుందరోద్యమానికి 2 శుభవార్తలు!
పరుల శ్రేయస్సు కోసం శ్రమిస్తూ- సుదీర్ఘ కాలంగా -స్వఫలాపేక్ష లేకుండా గ్రామాభ్యుదయం కోసం కంటున్న కలలు అనుకోకుండా నెరవేరితే ఎవరికైనా ఎంత సంతోషం కలుగుతుంది? ఆ కలలు వ్యక్తిగతం కాక – సమాజ హితకారిణులైతే ఇంకెంత బాగుంటుంది?
ఆలాంటి శుభ తరుణమొక్కటి స్వచ్ఛ చల్లపల్లి కి ఈ 24.03.2025 నాడు తటస్థిస్తున్నది. అదేమంటే, ఎలాగంటే :
సోమవారం ఉదయం 10 గంటలకు జిల్లా పాలకులను మచిలీపట్నంలో కలుసుకొన్నది శతాధిక స్వచ్ఛ కార్యకర్తల ప్రతి నిధులుగా శంకరశాస్త్రి, బృందావన్, గోపాల కృష్ణయ్య, నరసింహారావు, ప్రసాదు, కస్తూరి శ్రీను, లక్ష్మణరావు, తూము వెంకటేశ్వరావు గారలు – మొత్తం ఏడున్నర మంది. (అంటే చివరి తూము వారు సగం రెవిన్యూ అధికారి + సగం స్వచ్ఛ కార్యకర్త అన్న మాట! ఐతే ఈ సగం స్వచ్ఛ కార్యకర్త వల్లే రహదార్ల, విద్యుత్ శాఖ, కలెక్టరు గార్ల సత్వర ముఖాముఖీ సుసాధ్యమయిందనుకొండి!)
చల్లపల్లి ప్రతినిధుల బృందం సావకాశంగా ఉన్నతాధికారులతో మాట్లాడి,
“తమ గ్రామంలోనూ, చుట్టూ 7 రహదార్ల వెంటా 30 వేల నీడ, పండ్ల చెట్లను తామెంత కష్టపడి పెంచుతున్నదీ,
విద్యుత్ శాఖ కార్మికులు గాని, స్వయంగా తాము గానీ ఆ చెట్లను అవసరం మేరకు ఎత్తు సరిపడా కోసివేస్తున్నదీ,
ఊరి రోడ్లకు బరంతులు పోసి, గుంటలు పూడ్చి, జాగ్రత్తలు తీసుకొంటున్నదీ” వివరించారు.
“కన్స్ట్రక్షన్ ల వారు పెద్ద రహదార్లతో బాటు చిన్న సిమెంటు రోడ్ల మీద 40 టన్నుల టిప్పర్ల ను త్రిప్పుతుంటే ఆ రోడ్లు విరిగి పోతున్నప్పటి తమ బాధనూ, పంచాయతీ అనుమతి లేకుండ వీధుల్లో చెట్లను ఎవరెవరో నరుకుతున్న చట్ట వ్యతిరేక చర్యల్ని ఆపాలనీ” అర్జీలను సమర్పించారు.
కలెక్టరు గారూ, ఇతర ఉన్నతాధికారులూ “ మీరింత శ్రమ పడుతుంటే మేం మీ ఊరికి ఈ మాత్రం చేయమా? వెంటనే వచ్చి స్వయంగా చూసి, తగిన ఉత్తర్వులిస్తాం,
ముఖ్య రహదార్లలో చెట్లను నరికే అవసరం లేకుండా భూగర్భ విద్యుత్ వ్యవస్థను కూడ వేస్తాం” అని సానుకూలంగా స్పందిచారట!
ఈ సానుకూలతలు :
1) పదకొండేళ్ల కార్యకర్తల కఠిన శ్రమకూ,
2) స్వచ్ఛ చల్లపల్లి పట్ల ఉన్నతాధికారుల శ్రద్ధకూ,
3) శంకరశాస్త్రి తదితరుల చాకచక్యానికీ ఫలితాలన్నమాట!
జై స్వచ్ఛ సుందర ఆనంద-ఆరోగ్య-చల్లపల్లి!
- ఒక సీనియర్ కార్యకర్త,
(మాజీ ప్రిన్సిపల్, SRYSP కళాశాల)
24.03.2025