పరస్పర స్ఫూర్తిదాయక పర్యటన - @ మార్చి 15,16!....           25-Mar-2025

 పరస్పర స్ఫూర్తిదాయక పర్యటన - @ మార్చి 15,16!

         అదేమీ కాలక్షేపానికి వచ్చిన విహరణ యాత్ర కానే కాదు. మోపిదేవి-పెదకళ్లేపల్లి, హంసలదీవుల పుణ్యతీర్ధయాత్ర అసలేకాదు.. చల్లపల్లిలో రెండు రోజుల పర్యటనకు వచ్చిన పద ముగ్గురిలో ఏ ఒక్కరూ కాళ్లు బార్లా చాపి, గోళ్లు గిల్లుకుంటూ అర్ధం లేని విశ్రాంత జీవితం గడిపే ఒట్టొట్టి కబుర్లరాయుళ్లూ కారు. సారా వ్యతిరేక, అక్షరాస్యతల వంటి ఉద్యమ నిర్వాహకులు వారు!

         విద్యా వైద్య ఆర్థిక వ్యావసాయక రంగాల సమస్యలకు ఎదురొడ్డి పోరాడిన యోధాన యోధులు! జనవిజ్ఞాన వేదిక వంటి చైతన్యఝరులను ప్రజా సమూహాల మీదికి వదలిన సృజనశీలురు! ఐతే ఇలాంటి వాళ్ళేకాలంలోనైనా అల్ప సంఖ్యాకులు!

         వాళ్లది అర్థవంతమైన సామాజిక సంస్కర్తల జాతి! వయోభారాలను లెక్కచేయక ఆదర్శాలకే కట్టుబడి ఎడతెగక శ్రమించడమే వాళ్ల నీతి!

         మరి వీరు 2 రోజుల చల్లపల్లి పర్యటనకు ఎందుకు వచ్చినట్లు? ఏం సాధించినట్లు? ఇక్కడి పదకొండేళ్ల శ్రమదానోద్యమాన్నుండి క్రొత్తవి నేర్చుకోవడానికా? స్వచ్ఛ కార్యకర్తలకేదైనా నేర్పడానికా?

         బ్రతుకంతా ప్రజా జీవితపు దారుల్లో అలుపెరుగని 13 మంది క్రియాశీలక మేధావులొకవంకా, తమ గ్రామ సామాజిక సంక్షేమం కోసం పదకొండేళ్లుగా శ్రమిస్తున్న 50 మంది నిత్య కర్మిష్టులు మరో వంకా ఒకే మారు కనిపించడం నా బోటివాళ్ళకొక అరుదైన అవకాశం!

         “చాలాచాలా ఉద్యమాలు చూశాం - నడిపాం కాని ఒక గ్రామం కోసం ఇందరు కార్యకర్తల ఇన్నేళ్ల శ్రమదానం ఇప్పుడే ఇక్కడే చూస్తున్నాంఅని అతిధులూ,

ఎన్నో ఉద్యమ అనుభవాలతో తలపండిన ఇందరు 3-4 వందల కిలోమీటర్ల దూరం నుండి వచ్చి, మాతో కలిసి పారిశుద్ధ్య పనులు చేయడం మా అదృష్టం!అని అతిధేయ స్వచ్ఛ కార్యకర్తలూ!

         ఈ సుదీర్ఘ కాల శ్రమదాన చరిత్రనూ, వీడియోలనూ అడిగి తెలుసుకొని, ఆశ్చర్యానందాల్లో మునిగి, గ్రామమంతా కలయ తిరిగిన సందర్శకులూ, అనుభవాలతో రాటు తేలిన ఆ 13మంది సామాజిక సేవకుల ఆలోచనల్నీ, సలహాల్ని తెలుసుకొంటున్న స్వచ్ఛ కార్యకర్తల ప్రతినిధులైన - పద్మావతీ - డి.ఆర్.కె.లూ!

రెండు రోజులూ ఇలా గడిచాయి!

* “2 రోజుల స్వచ్ఛ చల్లపల్లి పర్యటన నా అదృష్టం, మీరిచ్చే సలహాలతో రేపే మా మిర్యాలగూడలో శ్రమదానం మొదలుపెడతాంఅని ఆవేశపడుతున్న Dr. జీవనజ్యోతి!

* చల్లపల్లి కార్యకర్తల క్రమశిక్షణకూ, పట్టుదలకూ మురిసిపోయిన విశ్రాంతోపాధ్యాయుడు సత్తార్ భావ - రాగయుక్తంగా పాడిన సినారే గీతము!

* నెల్లూరు జిల్లా ఆత్మకూరు వాస్తవ్యుడూ, ఎన్నెన్నో ప్రజాఉద్యమాల కారకుడూ Dr. సుధాకర రెడ్డి మా ఆదివారపుపర్యటనానుభవాలను వ్యాసంగా రాయాలని ఉంది. ఎందుకంటే మీ ఆస్పత్రి గానీ, ఇల్లు - ఆతిధ్యాలు గానీ మేం కనీవినీ ఎరుగనివి. నేనే గనుక ఇంకొంత కాలం ముందుగా వచ్చి ఇక్కడి శ్రమదానాన్ని చూసి ఉంటే నా దృక్పధం మారి ఉండేది’. అనే సందేశం పంపడమూ,

* 74 ఏళ్ల అవిశ్రాంత సామాజికోద్యమకారుడు బ్రహ్మారెడ్డి మీ శ్రమదానోద్యమం ఇకమీద నవతరాన్నీ, ముఖ్యంగా విద్యార్థుల్నీ లక్ష్యంగా చేసుకోవాలిఅనే హితవు చెప్పడమూ

         మొత్తంగా ఈ ప్రముఖులందించిన స్ఫూర్తిని స్వచ్ఛ కార్యకర్తలు కొన్ని దశాబ్దాల పాటు మననం చేసుకొంటూనే ఉంటారు!

- నల్లూరి రామారావు

25.03.2025.

డా. మువ్వా రామారావు గారు
డా. కాలేషా గారు
డా. K. నాగేశ్వరరావు గారు
డా. సాంబిరెడ్డి గారు
డా. మహ్మద్ అఫ్జలుద్దీన్ గారు
Dr. మురళీధర్ గారు
Dr. జీవనజ్యోతి గారు