09.06.2025....           09-Jun-2025

  నిజమైన తారలంటే....అసలైన సెలబ్రిటీలంటే....?

వెండి తెర మీద తళుక్కుమనే తారలు కావచ్చు

సిక్సర్లు దంచే క్రికెట్ వీరులు కావచ్చు

కళామతల్లి ముద్దు బిడ్డలనిపించవచ్చు

         ఆ హీరోల పౌరుష సాహసాలకూ

         హీరోయిన్ల తళుకు బెళుకులకూ

         క్రికెటర్ల గెలుపులకూబౌలర్ల బంతి విసుర్లకూ

         పునాదులు మాత్రం కీర్తి-ధన దాహాలే కదా!

         స్టార్ క్రికెటర్ల కరస్పర్శల – సినీ తారల ఆటో గ్రాఫ్ ల ఖరీదులు

         ఇన్నిన్ని త్రొక్కిసలాటలాఇందరి నిండు ప్రాణాలా??

 

X   X   X   X   X   X 

 

మరోవంక – చల్లపల్లిలో 

తమ ఊరి మేలు కోసం దశాబ్దాలుగా శ్రమిస్తూ

వీధులూడ్చికాలుష్యాల కెదురొడ్డి,

శ్మశానాల్ని సుందరీకరించి,

రహదార్లకు పచ్చదనాల సొగసులద్ది,

పాతిక వేల ప్రజల ముఖాల్లో చిరునవ్వులు పూయించేందుకు -

మట్టి కొట్టుకుంటున్న బట్టలతో

డ్రైన్లలో - వీధి బురదల్లో

నిస్వార్ధంగా ఆరుగాలాలూ చెమటలు చిందిస్తూ 

పర్యావరణ భద్రతను సాధిస్తూ 

భావితరాల సుఖమయ జీవనానికి హామీనిస్తున్న

చల్లపల్లి స్వచ్ఛ సుందర కార్యకర్తలు గదా

సిసలైన సెలబ్రిటీలుసామాజిక బాధ్యతా ధృవతారలు??