దశ వసంతాల శ్రమ జీవుల మనో గతాలు – 6
ఏదో నాకు తోచిన నాలుగైదు సంగతులు!
పద్మావతి ఆస్పత్రిలో నా నర్సు ఉద్యోగం నాలుగున్నరేళ్ళ నుండి స్వచ్చంద సేవా కార్యక్రమం మూడున్నరేళ్ల నుండి, మొదటిది బ్రతుకు తెరువుకూ, రెండోది ఆత్మ సంతృప్తికీ, ఆరోగ్యానికీ నండి.
సాంత ఊరు లక్ష్మీపురం పంచాయితీలోని పుచ్చగడ్డ. వీధులు బాగు చేయడానికీ, చెట్లు పెంచడానికీ, మురుగు కాల్వల మరామత్తుకూ నాలాంటి 100 మంది స్వచ్ఛ కార్యకర్తల్ని ఈ చల్లపల్లి సొంతం చేసుకొన్నదండి!
ఆసుపత్రి సిబ్బందిలో వంతులేసుకొని ప్రతిరోజూ కొంతమందిమి వేకువ నాలుగింటికే శ్రమదాసం కోసం వెళుతుంటాం, తొలి రోజుల్లో మా డాక్టరమ్మ గారూ, డి.ఆర్.కె. సారూ, ఇంకా కొందరు పెద్ద వాళ్ళూ వీధులూడుస్తుంటే, కంపుకొట్టే మురుగు కాల్వ ఒడ్డున పనిచేస్తుంటే, వింతగా చూసే దాన్ని.
తరవాత అన్ని పనులూ అలవాటైపోయినవి. నేనిప్పుడు చీపురుతో వీధి ఊడవగలను; గొర్రుతో మురుగు కాల్వలో తుక్కులాగగలను; డిప్పల్తో తుక్కులూ, దుమ్మూ ట్రాక్టర్ లో పోయగలను; అందరితో బాటు దాదాపు అన్ని రకాల పనులూ చేయగలను!
మొదట వింతగా అనిపించింది తరవాత దిన చర్యలో భాగంగా మారింది. అలవాటు కాస్తా చివరికి మానలేనంత ఆకర్షణగా తేలింది! ప్రతిఫలంతో ఆశించకుండా ప్రతిరోజూ గంటన్నర ఊరి కోసం పని చేయడంలో ఎంత సంతృప్తి ఉందో తెలిసొచ్చింది.
అసలీ కార్యకర్తల తెగింపే లేకపోతే - చల్లపల్లిలో ఇంత పచ్చదనమూ, ఇన్ని సౌకర్యాలూ, ఇంత ఆహ్లాదమూ ఉండేవా!
ఖాళీ దొరికినప్పుడు మా ఆసుపత్రి వైద్య సిబ్బందిమి ఇవన్నీ చర్చించుకొంటామండి! ఇలాంటి వేకువ పనుల్ని మా పుచ్చగడ్డలో ఇరుగుపొరుగు వాళ్లకి చెపితే ఆశ్చర్యపోతున్నారండి!
ఈ ఊరు ఇంత బాగుపడి, దేశంలో గుర్తింపు పొందుతుంటే – గ్రామస్తులకు ప్రయోజనంగా ఉంటే – ఇలాంటి శ్రమ దానం ఎందుకు మానాల?
- జ్యోతి విజయరాణి
18.10.2024.