దశ వసంతాల శ్రమ జీవుల మనోగతాలు – 16
నిలిపారు మన ఊరి నిండు గౌరవము!
‘విజయరమ’ అనబడే నేనొక పాఠశాల ప్రధానోపాధ్యాయినిగా 2021 లో విరమించాను. మెయిన్ రోడ్డులో ఉన్నందు వల్ల స్వచ్చ సైనికులు ఆది నుండీ ఈ ఊరికి చేస్తున్న సేవలు నాకు తెలుసు. అప్పట్లో శలవుల్లో మాత్రం వాళ్ళతో కలిసి నాకు తగ్గ పనులు చేస్తుండే దాన్ని.
చల్లపల్లి రవీంద్ర భారతికి బదిలీ అయ్యాక – దగ్గర దారని భారతలక్ష్మి రైసుమిల్లు రోడ్డులో వెళ్ళే దాన్ని. అప్పట్లో అదేం రోడ్డు? అదొక నిప్పుల కుంపటి (కుంపటి అంటే తెలుసుగా - పెంటలు) – తప్పని సరై కళ్ళూ ముక్కులూ మూసుకుని వెల్లవలసిన నరకమార్గం.
దాన్నొక పుణ్యాత్ముడు - వాసిరెడ్డి మాస్టారు – ఒంటి చేత్తో – ఆరు నెల్లలో శుభ్రంగా – అందంగా – పచ్చదనాల కనులవిందుగా మార్చి చూపారు!
రిటైరయ్యాక – ఆయన స్ఫూర్తితోనూ, అలాంటి శ్రమదాన కార్యకర్తల అండతోనూ - రాగలిగినన్ని రోజులు వచ్చి - చేయగలిగినంత వీధి పారిశుద్ధ్యం చేస్తున్నాను.
ముఖ్యంగా కార్యకర్తల ఏ మీటింగైనా హాజరౌతుంటాను. “ప్రతి వేకువా మన ఊరి కార్యకర్తల శ్రమ ఎలాంటిదో – దాని ప్రత్యేకత ఏమిటో – అన్ని ఊళ్ళ వారూ ఈ పద్ధతిలో శ్రమదానం చేస్తుంటే రాష్ట్రమూ, దేశమూ ఎలా మారిపోతాయో గదా!” అని ఆలోచిస్తుంటాను!
“మా శ్రోత్రియ మహిళలు శ్మశానాలలో అడుగు పెట్టనే పెట్టరాదు” అనే సాంప్రదాయాన్ని ధిక్కరించి, మొండి ధైర్యంతో తొలిరోజు చిల్లలవాగు శ్మశానానికి వెళ్ళాను. అక్కడ అదివరికే కొందరు స్త్రీలు పనిచేస్తూనే ఉన్నారు.
కొన్నాళ్ల క్రితం నేపాల్ యాత్రకు వెళ్ళినప్పుడు - తోటి యాత్రికులకు మన ఊరిలో క్రమం తప్పక జరిగే శ్రమదానం వివరించినప్పుడు – వాళ్లకు నమ్మకం కలిగేందుకు ఏరోజు ఫోటోలు ఆ రోజు వాళ్ళకు చూపినప్పుడు – వాళ్లు ఆశ్చర్యంతో నోళ్ళు తెరుస్తుంటే – అప్పుడు గుర్తొచ్చింది - ఒక తెలుగు కవి వ్రాసిన
“ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠ మెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా! నీ తల్లిభూమి భారతిని
నిలపరా! నీ జాతి నిండు గౌరవము..!”
అనే గేయం! మన ఇద్దరు డాక్టర్లు ఈ పదేళ్లు నిర్విరామ శ్రమదానంతో - ఊరినెలా మారుస్తున్నదీ వాళ్ళకు వివరించాను. ఒకరిద్దరు తప్పక చల్లపల్లి వచ్చి చూడాలని ఉత్సహించారు!
పుట్టిన ఊరి నిండు గౌరవాన్ని నేపాల్ దాకా తీసుకెళ్లిన - స్వచ్ఛ సుందర కార్యకర్తలకు ప్రణామాలు!
- విజయరమ
29.10.2024