మాలెంపాటి అంజయ్య - 17 ....           01-Nov-2024

 దశ వసంతాల శ్రమ జీవుల మనోగతాలు – 17

అసలు మన శ్రమదానం ఎందుకు మానాలంటా?

          కమ్యూనిస్టు బజారులో ఉండే అంజయ్యని. 40 ఏళ్లుగా ఈ చల్లపల్లి ఎట్టా మారుతున్నదీ చూసిన వాడిని, చివరి పదేళ్లలో ఈ ఊరికి ఏకాస్తయినా మంచి జరిగుంటే - దానికి కాస్తో కూస్తో బాధ్యుడిని,

          ఇదుగో - ఇట్లా అంటున్నందుకు ఏమనుకోవద్దండి - ఒకరకంగా చెప్పాలంటే సిగ్గూ శరమూ లేని వాళ్ళం! నవ్వుకోమాకండి - ఇది ఆత్మనింద కాదు

          ఇప్పుడూ - మెయిన్ రోడ్డులో పని చేత్తన్నామనుకోండి - ఆ బందరు రోడ్డులోనే పడున్న ఎంగిలాకులూ, ప్లాస్టిక్కు చెత్తలూ, కుళ్లిన కూరగాయలూ ఎత్తామా మళ్లీ మరసటి రోజూ అంతే! 20 రోజులు వరసగా వేసేవాళ్లు వేయడమూ మా కార్యకర్తో - నేనో తీయడమూ! మరి విసుక్కోకుండానూ - వేసిన వాళ్లని తిట్టుకోకుండానూ - సిగ్గుపడకుండానూ తీస్తూనే ఉన్నానా లేదా?

          చిన్నప్పుడునుండీ పొలంలో- ఎండలో యగసాయం పనులుచేసినోడికి చెత్తబండిలో కెక్కి సర్దడమూ నడుం లోతు మురుగులో దిగి ఎన్ని ఛండాలాలైనా తీసేయడమూ ఒక లెక్కేమీ కాదు గాని

          రొండేళ్ల నుండి మోకాళ్లు దెబ్బతిని - నడుముకు ఆప్రేశను జరిగి అంతకు ముందులాగా గట్టిగా చేయలేకపోతన్నానండి.

          ఇదంతా గొప్పల కోసం మెప్పుల కోసం చెప్పటం లేదండి - మూడోసారి కూడ పెద్దోళ్ళు  అడిగినా చెప్పకపోతే బాగుండదనే ఈ నాలుగైదు మాటలండి - మొత్తం సెప్పానంటే శాట భారతమే నండి!

          ఏం మొదలు పెట్టామో పెట్టాం - అనుకొన్నట్టుగా చల్లపల్లి ఇంకా - ఇంకా మారేదాక నా వరకు నేను పొద్దున్నే వత్తానే ఉంటాను!

- మాలెంపాటి అంజయ్య

  చల్లపల్లి.

   29.10.2024.