దశ వసంతాల శ్రమ జీవుల మనోగతాలు – 18
మనం కాదు - ఊరు శాశ్వతం!
ఈ సంగతి తెలియందెవరికి? తెలిసినా గుర్తు పెట్టుకొని, ఎన్ని ఊళ్ళ వారు వాళ్ల ఊరి కోసం ఒక మంచి పని చేయాలని ప్రయత్నిస్తారు? ఒక వేళ ప్రయత్నించినా మరసటి నాడో – మరొక నెలకో మానుకొంటారు గదా!
అలాంటిది - ఈ చల్లపల్లిలో - ఒకరిద్దరు కాదు - లెక్కేసుకొంటే 150-200 మంది కార్యకర్తలు - సంవత్సరమో, రెండేళ్ళో కాదు. పదేళ్లపాటు - ఎవళ్ళ ప్రాంతానికీ కాక - ఊరి మంచి కోసం రోజూ 30-40-50 మంది కష్టపడటమంటే మాటలా?
ఎవరికి వాళ్లు 4.30 కు ముందూ వెనుకగా రావడమూ, తోచిన – కుదిరిన పని చేసి, సరదా కబుర్లాడుకొని వెళ్లడమూ!
నా ఇంటెదురు బజార్లో ఊడ్చుకోవటమే మహాభాగ్యమనిపిస్తున్న రోజుల్లో - ఇందరు ఆడా - మగా మనుషులు ఇన్ని పన్లు చేస్తూ – ఇంత ఊరిని ఈ మాత్రం బాగా ఉంచడం చిన్న సంగతా?
మనలో ఎవరికి వాళ్లం ఇలా శ్రమదానం చేయగల్గుతున్నామంటే – దీని వెనక ఎంత ఖర్చు – ఎంత ఆలోచన - ప్రోత్సాహం ఉన్నాయో వేరే చెప్పాలా?
60 రోజుల తర్వాతనుకొంటా - అప్పటికే పంచాయతి పాలకవర్గంలో ఉన్న నేను కూడ – అప్పటి దాక సంకోచించి నా - అన్నపూర్ణ వదిన పట్టుబట్టటంతో స్వచ్ఛ కార్యకర్తగా మారాను! మా చిన్నమ్మాయి కూడ అప్పుడప్పుడు ఒళ్ళు వంచి పనిచేసింది!
అసలు మన నూరేళ్ళ బ్రతుకు ఈ ఊరితో ముడిబడి ఉంటే - ఊరి కోసం రోజుకొక గంట పనిచేస్తే తప్పేముంది?
ఇంతకు ముందులాగే - ప్రతి వేకువ కాకున్నా - సాధ్యమైనన్ని రోజులు ఇట్లా పనిచేయ్యాలనేదే నా కోరికండి!
- పసుపులేటి ధనలక్ష్మి
చల్లపల్లి.
30.10.2024.