కొర్రపాటి వీర సింహుడు - 20 ....           04-Nov-2024

 దశ వసంతాల శ్రమ జీవుల మనోగతాలు – 20

వీరాధి వీరులూ - శూరాధి శూరులూ!

వాళ్లెవరంటే:

- ఆడ పిల్లల్ని ఏడిపించే వాళ్ళో, జనాన్ని మాయజేసి దోచుకు బ్రతికేవాళ్ళో, కుల మతాల కుంపట్లు పెట్టే వాళ్ళో, రాజ భక్తి తలకెక్కించుకొని, శత్రు సైనికుల్ని చంపే లేదా చచ్చేవాళ్లసలే కాదు. మరి?

- నమ్మిన సత్యం కోసం కష్టాల కోర్చే వాళ్లు!

- స్వార్థం కోసం కాక – ఊరి జనం మంచి కోసం తమ శ్రమనూ, కష్టార్జితాన్నీ త్యాగం చేసేవాళ్లు!

- పగలు సొంత బాధ్యతలు చూసుకొంటూ, వేకువ కాలం మాత్రం గంటన్నర సమయాన్ని ఇతరుల కోసం కేటాయించే వాళ్లు!

- అవసరమైతే మురుగు పనులకీ, వల్ల కాడు సేవలకీ వెనకాడని మనుషులు!

- ఆ కాసేపూ తమ అంతస్తునీ, హోదానీ, మర్యాదల్నీ ప్రక్కన పెట్టి, తమ ఊరికేది మంచనిపిస్తే అదే చేసే మొనగాళ్లు!

- ఈ కాలంలో దివిటీ వేసి వెతికినా - చల్లపల్లిలో తప్ప ఎక్కడా కనిపించని గ్రామ పారిశుద్ధ్య యోధులు!

          మా ఊరి స్వచ్చ సుందర స్వచ్చంద కార్మిక కార్యకార్తలే వాళ్లు! ఐతే – అంతంత పెద్ద మాటలు నాకు వర్తించవులెండి.

          పేరుకు మాత్రం వీరసింహుడినే గానే - ఊరి కాలుష్యాలకు మరీ అంత సింహ స్వప్నాన్ని కాదు.

          V.R.O. ఉద్యోగం విరమించాక - అప్పటికే 800 రోజులు పూర్తి చేసుకున్న శ్రమదానంలోకి వచ్చిన వాడిని.

          బరువులోనూ - కొన్ని అనారోగ్య సమస్యల్లోనూ సప్తతి సంవత్సర వయస్సులోనూ ముందు వరుసలో వాడిని.

          నారాయణరావు నగర్ లో జరిగిన 1000 రోజల స్వచ్చ సేవల విజయ సభలో పాల్గొన్న తర్వాతే దీన్ని సీరియస్ గా తీసుకొన్న - రాముడుపాలెం + చల్లపల్లి వాస్తవ్యుడిని.

          ఏదో చాతనైనంత వరకు పుట్టి - పెరిగి - చదివిన ఊరికి ఉపయోగపడుతున్నాను. టాంజానియా నుండి మా అబ్బాయి స్వచ్చ కార్యకర్తలకు 3 మార్లు టీ షర్టులో, చిన్న గిఫ్టులూ పంపి, పరోక్షంగా ఊరికి సహకరిస్తున్నందుకు సంతృప్తి!

          శ్రమదానం పదవ పుట్టినరోజు శుభాకాంక్షలతో –

- కొర్రపాటి వీర సింహుడు.

    Retd. V.R.O

   02.11.2024.