దశ వసంతాల శ్రమ జీవుల మనోగతాలు – 21
శ్రమదాన శిఖరంగా నా చల్లపల్లి!
నేను పైడిపాముల కృష్ణకుమారి అనే చాలా అదృష్టవంతురాలిని. ఎగుడు - దిగుళ్లూ, కష్ట నష్టాలూ ఎవరికైనా ఉండక తప్పవుగాని - చీకటి వెలుగులు ఏ గ్రామ చరిత్రలోనైనా ఉండేవే గాని - ప్రస్తుత నా జీవితమూ, వర్తమాన చల్లపల్లి చరిత్రా మంచి స్ధితిలో ఉన్నాయండి!
పోటీ చేసిన అన్ని ఎన్నికల్లోనూ గెలవడం నా గొప్ప అనుకోను - అది ప్రజల దయా, నా అదృష్టమూ!
ప్రజా జీవితంలో క్రియాశీలకంగా ఉన్న కాలంలోనే నా గ్రామానికి స్వచ్ఛ – సుందరీకరణ మహర్దశ పట్టడం నా ఇంకో అదృష్టం!
తమ ఇళ్ల వద్ద సొంత పనులనైనా వాయిదా వేసి, ఊరి ప్రయోజనం కోసం ప్రతి వేకునా వీధులెక్కే శ్రమదాతలు నాకేగాదు - చల్లపల్లికే పెద్ద అదృష్టం! వాళ్ల స్ఫూర్తి దేశానికే అదృష్టం!
లక్షల్లక్షల తమ శ్రమార్జిజాన్ని ఈ చల్లపల్లికి తృణప్రాయంగా – దానం చేస్తున్న, తమ సమయాన్నీ, మేధస్సునూ ఈ ఊరికి ధారపోస్తున్న డాక్టర్లు ఈ ఊరిని పట్టుకొన్న అదృష్టాలు!
తన నగల్ని ఈ గ్రామ సౌభాగ్యం కోసం తెగనమ్మే ఒక డాక్టరు సమకాలికురాలిని కావడం ఎంత పెద్ద అదృష్టం!
అసలెవరు ఊహించారు - ఈ గ్రామ పంచాయతీకి ఇన్నిన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపులూ, బహుమతులూ, రివార్డులూ, నారా చంద్రబాబు గారి సన్మానాలు దక్కుతాయని!
ఇలా ఇంత పెద్ద దేశంలో- 6 లక్షల గ్రామాల్లో ఎక్కడైన్నా ఇలా పదేళ్ళ శ్రమ త్యాగ పరిమళాలు పీల్చారా?
ఏ గ్రామంలో ఇందరు వయోవృద్ధ – విశ్రాంత ఉన్నతోద్యోగులు – మహిళామతల్లులు క్రమం తప్పక మురుగులు తోడారు? కసవులూ ఊడ్చరు? పెంటలు పోగులు చేశారు? కులీన మహిళలు శ్మశానాల్లో పనులకు తెగించారు?
ఐతే - ఇదంతా నాణానికి మొదటి పార్శ్యం! ఈ ఊళ్లో ఇంకా జరగవలసిన పనులు, మారవలసిన మనసులు, ప్రభుత్వం నుండి ప్రసరించవలసిన కరుణా దృక్కులు ఉన్నాయి.
అప్పటి దాకా త్యాగ ధనులైన స్వచ్ఛ కార్య కర్తలతో కలిసి నేనూ శ్రమిస్తానని సవినయంగా తెలుపుకొంటూ –
- కృష్ణకుమారి - గ్రామ సర్పంచి.
02.11.2024.